కేసీఆర్ ఉచ్చులో కోదండరాం…!

0
189

కేసీఆర్ ఓటమే మన ఉమ్మడి అజెండా అన్నారు. అధికార పార్టీ మదం అణచడానికి జట్టుకడుతున్నామని ప్రగల్భాలు పలికారు. తీరా రోజులు గడిచేకొద్దీ పర్సనల్ అజెండాలు బైటకొస్తున్నాయి. సీట్ల వాటాల్లో కొట్లాటలు మొదలవుతున్నాయి. దీనికితోడు ఇగోలు ఒకటి.

అందరికంట ముందుగా అయ్యవారు కోదండరాం బైటపడ్డారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకే అల్టిమేట్టం ఇచ్చారు. 48 గంటల్లో సీట్ల లెక్కలు తేల్చకపోతే తనదారి తాను చూసుకుంటానని హెచ్చరించారు. భావసారూప్య పార్టీలతో కలసి బరిలో దిగుతానని కాంగ్రెస్ కి లేఖాస్త్రం సంధించారు.

అంతే కాదు, 21మంది అభ్యర్థులతో ఆయన దగ్గర తొలిజాబితా కూడా సిద్ధంగా ఉందట. అంటే రెండో జాబితా, మూడో జాబితా.. ఇలా మాస్టారు మాంచి ముందు చూపుతోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం కూటమిలో మిగతా పార్టీలకు 19 సీట్లు మాత్రమే కేటాయించాలని, మిగిలినచోట్ల తామే పోటీచేయాలని నిర్ణయించుకుంది. ఈ లెక్కన చూసుకుంటే కోదండరాం కూటమిలో ఇమడటం కష్టమని తేలిపోయింది. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ కు కలిసొచ్చింది.

టీజేఎస్ ఒంటరిగా బరిలో దిగితే మాత్రం మహా కూటమి బాగా బలహీన పడుతుందని వేరే చెప్పక్కర్లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మహాకూటమి, టీజేఎస్ మధ్య చీలిపోతుంది. మధ్యేమార్గంలో ఉన్న వారంతా కోదండరాంకి సపోర్ట్ చేస్తే టీఆర్ఎస్ అభ్యర్థులకు అనుకోకుండా మెజార్టీ ఇచ్చినవారవుతారు. కేసీఆర్ కి కావాల్సింది కూడా ఇదే. అందుకే టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా కోదండరాంని రెచ్చగొడుతున్నారు.

పార్టీ పెడితే పెట్టారు, పోటీ చేస్తే చేశారు కానీ, తెలంగాణ ద్రోహులతో ఎలా చేతులు కలుపుతున్నారంటూ కోదండరాంపై విమర్శలు చేస్తున్నారు. మొదట్లో ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోని కోదండరాం మెల్లమెల్లగా కేసీఆర్ ట్రాప్ లో పడినట్టే కనిపిస్తోంది.

తన ప్రతిపాదనకు ఒప్పుకుంటే సరే సరి, లేకపోతే కచ్చితంగా కూటమి నుంచి బయటికొచ్చేయాలనేది కోదండరాం ఆలోచన. అందుకే జాబితాలు కూడా తయారు చేసుకున్నారు. 2 రోజుల్లో తేల్చకపోతే తొలి జాబితా విడుదల చేస్తానంటూ కాంగ్రెస్ కి అల్టిమేటం ఇచ్చారు.

కోదండరాం టీఆర్ఎస్ ట్రాప్ లో పడి ఒంటరిపోరుకి సిద్ధమైతే.. కచ్చితంగా కేసీఆర్ మళ్లీ తెలంగాణలో చక్రం తిప్పడం ఖాయం. టీడీపీని భూస్థాపితం చేసి, ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నేతల్ని మట్టికరిపించడం అంతకంటే ఖాయం. కొసమెరుపేంటంటే.. మహాకూటమి నుంచి కోదండరాం వైదొలిగితే, కూటమిలో టీడీపీ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అసలు దాన్ని మహాకూటమి అనడం కూడా వేస్ట్‌.