బతుకమ్మ పూర్తి చరిత్ర
నాటి బృహదమ్మే నేటిబతుకమ్మ…!
పదిశతాబ్దాల వేడుక బతుకమ్మ పండుగ…!
బతుకమ్మ పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. వేములవాడ లో మాత్రమే ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు న జరుపుకుంటారు.ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు కొన్ని ప్రాంతాల్లో దసరా పిదప రెండు రోజుల కు మరికొన్ని ప్రాంతాల్లో జరుపుతారు.

సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, ఆత్మీయుల కలయకలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా విజయ దశమి. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఇది తెలంగాణ సాంస్కృతికి ప్రతీక.

ఈ పండుగ సందర్భంగా
బాలికలు యువతులు మహిళలు రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగిన బతుకమ్మలను బావిలో చెరువులో వాగు లలో నదీ నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, పురాణ చారిత్రక నేపథ్యాలన్ని వివరిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.
పుష్పాల ఆరాధనే బతుకమ్మపండుగ విశిష్టత.
పువ్వులను దేవుళ్ళ కు భక్తితో సమర్పించి పూజలు చేస్తారు అందరూ.అయితే పూలనే దేవతగా భావించి పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణాప్రాంత విశిష్టత . తెలంగాణా రాష్ట్రములోని అన్ని ప్రాంతాల్లోముఖ్యంగా వరంగల్ ఖమ్మం వేములవాడ సిరిసిల్ల జగిత్యాల రాయికల్ కోరుట్ల కరీంనగర్ నిజామాబాద్ తదితర చోట్లలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ.
తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను గత పది శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.నాడు నవాబులు,రజాకార్లు భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.నాటి దొరల అకృత్యాలకు నలిగిపోయిన వారిని,ఆ బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలు పూచే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కై జరిగిన ఉద్యమ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.
ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది . ఒక బాలిక ఆనాటి భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం “బతుకమ్మా !” అని దీవించారట.

అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించినది.ఆ బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు భార్య సత్యవతి పుణ్యదంపతుల కు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన ఆమె అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసారు. అప్పటినుండి బాలికలు యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆనవాయితీ అయ్యిందని ఈ కథ చెబుతుంది.
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో,పూలతో జలంతో, మానవ అనుబంధాన్ని ఆనందంగా జరుపుకునేలా చేస్తుంది. ఈ సంబరాలు జరుపుకునే స్త్రీలు పసుపు తో గౌరమ్మ “బొడ్డెమ్మ” ను చేసి బతుకమ్మతో పాటూ నిమజ్జనం చేస్తారు. మహిళల ఐక్యత కు ప్రకృతి ఆరాధనకు ప్రతీక గా బతుకమ్మ పండుగ నిలుస్తోంది.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
బతుకమ్మ చరిత్ర..
తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేకాలంలో వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. ఆనాడు వేములవాడ లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరస్వామి అండగా ఉంటాడని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరస్వామి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరుడే తమను కాపాడినాడని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళుడే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది.
అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వర ఆలయం లోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో తంజావూరు లో ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. సా.శ 1010లో నిర్మాణం పూర్తయ్యాక వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరు బృహదీశ్వరాలయం కు తరలించాడు. ఈసంఘటన నాటి తెలంగాణ ప్రజల మనసులను కలచివేసింది.తమ బృహదమ్మ(పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళరాజులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మగా పూజలను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే అని చరిత్రకారుల అభిప్రాయము. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు “బొడ్డెమ్మ” మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.


జానపదులు తమసంతానం దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీచాలా పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని ‘పెంటమ్మ లేదా పెంటయ్య’ అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి ‘బిచ్చంగా’ తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు ‘భిక్షపతి,భిక్షమ్మ’లని పేరు పెట్టుకుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు.
ఈ పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మపండుగ నాడు ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో , బిడ్డాలెందారే.. వలలో’ అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతానం బతికినందుకు ప్రతీకగా నీటివారన పెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసివుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మ పండుగగా మారి వుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మన గొప్ప సంస్కృతికి సాక్ష్యం. ఎవ్వరికన్న ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మానవజాతి పిల్లల వల్లనే కదా ఇన్ని వేలయేండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది. పూజించింది. అమ్మదేవతల పూజల్లో ఒక ఆరాధనా రూపమే మన బతుకమ్మ.

వివిధ మతాల లో బతుకమ్మ ఆరాధన..
బౌద్ధమతంలో ముందు చెడ్డదేవతగా, పిల్లల్ని ఎత్తుకపోయే రాక్షసిగా పిలువబడ్డ హారీతి బుద్ధునివల్ల మంచిదానిగా, పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లలదేవతగా కొలుస్తారు. పుట్టిన తమ పిల్లలు బతుకాలని, రోగాలు, రొష్టులు లేకుండ వుండాలని హారీతిని ఆరాధించేవారు. ఈ దేవతను గురించి బౌద్ధ జాతక కథల్లో చదువగలం. వివిధ చారిత్రకదశల్లో ఈ దేవత విగ్రహాలు వేర్వేరు రూపాల్లో అగుపిస్తున్నాయి. చాళుక్యులు తమను తాము హారీతిపుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు.2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలం నుండి హారీతి శిల్పాలు కనిపిస్తున్నాయి.12వ శతాబ్దం దాకా శాసనాల్లో హారీతిపేరు ప్రస్తావించబడ్డది. పిల్లల్ని బతికించే దేవత హారీతినే బతుకమ్మగా భావించినారేమో.

కూష్మాండిని దేవతకు ప్రతీకగా గుమ్మడిపువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మన పూర్వీకులు ఇనుము-ఉక్కు తయారీకి తంగేడుచెక్కను వాడేవారు. తోలు తయారీకి తంగేడు చాలా అవసరమని అందరికి తెలుసు. గునుగుఆకులకు పూలకు నీళ్ళను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్యజీవితాసరాలైన తంగేడు, గునుగుపూలతో మనపూర్వీకులు తమ అమ్మదేవత(కూష్మాండిని?)ని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారి వుంటుంది. గునుగు, తంగేడుపువ్వులతో కొప్పురం రూపంలో పూలబతుకమ్మను పేర్చి, శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వుంచి, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పూజపువ్వులను తొక్కుట్లవెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్ళలో వదిలే సంప్రదాయమైంది.

దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూదేవత నవదుర్గారూపాల్లో కూష్మాండిని ఒకటి. ఎనిమిదవ రోజున కూష్మాండినిని అర్చిస్తారు. అదేరోజు బతుకమ్మలాడుతారు. కొన్ని ప్రాచీన ఆచారాలను మతాలు స్వంతం చేసుకున్న క్రమం చరిత్రలో కనిపిస్తుంది మనకు. తొలి మొలకలను, తొలిపూతను కొలిచే ఆచారం గిరిజనులదే. పువ్వంటే రేపటి ఫలమని వాళ్ళకు తెలుసు. ఆడపిల్లలను, పువ్వుల్ని కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు.కులం లేదు అయితే కాలక్రమేణా మతాచారాలు కులాచారాలు రుద్దబడ్డాయి. మన ప్రాంతంలో కూష్మాండిని ఆరాధన జైనులవల్ల వచ్చింది. జైనమతానుయాయులైన కాకతీయులవల్ల ప్రోత్సహించబడ్డది. జైనంలో 22వ తీర్థంకరుని శాసనదేవత, యక్షిణి అంబిక(అంబ=అమ్మ) లేదా కూష్మాండిని (గుమ్మడితీగె, గుమ్మడిపువ్వు). ఈమె ప్రతిమాలక్షణంలో చేతుల్లో ఫలాలతో, ఇద్దరు పిల్లలతో, మామిడిచెట్టుకింద కూర్చొనివున్నట్టు వుంది. అంబిక కూడా ఒక అమ్మదేవతే. ఈ దేవతలకు ప్రతిమారూపాలు క్రీ.శ. 5వ శతాబ్దం నుంచే కల్పించబడ్డాయి. అంతకు ముందున్నట్టు చారిత్రకాధారాలు లేవు.

బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో వుంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయముందని చాలాచోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారుచేసుకునేవారు. బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్దునికి ప్రతీకగా నమస్కరించేవారు. పూలు, ఇసుక, మట్టి, పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు, ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించివుంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకుని వుంటారు. పిదప కాలాల్లో వచ్చిన మతపరిణామాలవల్ల ఈ దేవతలను తమ, తమ మతదేవతలుగా చేసుకున్నారు. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకూష్మాండినిగా, హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు.

తెలంగాణలో అతిప్రాచీనమైన అమ్మదేవతల ఆరాధనమే తల్లుల రూపంలో ఏ దేవత వచ్చినా తమ దేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మ జాతరగా నిలిచిపోయింది. దసరాపండుగతో బతుకమ్మను కలుపడం, అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం ‘పెత్రామాస’(పితృ అమావాస్య)ను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిణామమే.

జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు, మన తెలంగాణాకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూలపూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మనమూలాలను ఎరుకపరిచే మంచి సంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట. శతాబ్దాలుగా విలసిల్లుతున్న మన ఘనచరిత.