
సంక్షేమమే పరమావధిగా బీర్ల ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న బీర్ల ఫౌండేషన్ చైర్మన్, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి బీర్ల అయిలయ్యను రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు గురిచేసిన మోటకొండూర్ మండలానికి చెందిన ముగ్గురు యువకులపై పోలీసులు గురువారం పీడీ యాక్టు నమోదు చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో పోలీసుస్టేషన్ ఎదురుగా నివాసముండే బీర్ల అయిలయ్యను జూన్ నెలలో అత్యంత అవమానకర రీతిలో దూషిస్తూ మోటకొండూరు మండలానికి చెందిన ముగ్గురు యువకులు గొంతు మార్చే టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు కావాలని బీర్ల అయిలయ్యను బెదిరించారు. పలు దఫాలుగా దూషిస్తూ మాట్లాడారు. బీర్లతో ఫోన్లో మాట్లాడిన వారిని అత్యంత చాకచక్యంగా పోలీసు అధికారుల దర్యాప్తు బృందం పరిశోధన చేసి అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేశారు. పోలీసు అధికారులను కూడా వదలకుండా… దూషిస్తూ ముగ్గురు నిందితులు ఫొన్లో పలు మార్లు దుర్భాషలాడారు. దాంతో వారిపై అన్ని రకాలుగా పోలీసులు విచారణ చేపట్టారు. యాదాద్రి ఏసీపీ కోట్ల నర్సింహరెడ్డి, సీఐ ఎస్. జానకీరెడ్డిల ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం సిపారసు మేరకు యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి ముగ్గురు యువకులు ముఠా గా ఏర్పడి చేసిన అరాచకాల నివేదికను రాచకొండ సీపీ మహేష్ భగవత్ కు సమర్పించారు. దాంతో నేరానికి పాల్పడిన
సందేపల్లి క్రాంతి కుమార్ S/o శంకర్, సందేపల్లి సింహాద్రి S/o శంకర్, సంగి జశ్వన్ S/o శంకర్ లపై రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వుల మేరకు యాదగిరిగుట్ట పోలీసులు పీడీ యాక్టు ఉత్తర్వులు సెర్వ్ చేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు యాదాద్రి పట్టణ సీఐ. ఎస్. జానకిరెడ్డి వెల్లడించారు.

ఫోన్లు చేసి భయానక పరిస్థితులు కలిగించడముతో బీర్ల అయిలయ్య తనకు ప్రాణహాని ఉన్నదని రక్షణ కల్పించాలని జూన్ నెలలో పోలీసు అధికారులను ఆశ్రయించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పోలీసులు నిజాయితీగా వ్యవహరించి అయిలయ్య ను భేదిరిస్తున్న వారిని అరెస్టు చేయడం అప్పట్లో సంచలన కలిగించింది. బీర్ల అయిలయ్య పోలీసుల సూచనల మేరకు అప్పట్లో వారం రోజులు తన కార్యకలాపాలు కూడా రద్దు చేసుకొన్నారు.

ముగ్గురు యువకులు డబ్భులు వసూలు లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు తేల్చారు. అప్పట్లో ఈ యువకులు పట్టుబడకపోతే విషయం అప్పట్లో రాజకీయ రంగు పులుముకుని జఠిలం అయ్యేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపట్టారు. యువకులు పట్టుబడటంతో పోలీసుల అధికారులు, రాజకీయ పార్టీల నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
ఏదీ ఏమైనా పల్లెల్లోని యువత మారుతున్న నాగరిక ప్రపంచంలో నేర ప్రవృత్తిని ఆశ్రయించడం రానున్న సవాళ్ళను గుర్తు చేస్తున్నది.