శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం!
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం!!
విజయానికి ప్రతీక విజయ దశమి
విజయదశమి రోజు జమ్మి చెట్టు ఆకులు ఒకరినొకరు ఇచ్చుకొని దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అరణ్యవాసానికి వెళుతున్న సమయంలో శ్రీరాముడు శమీ వృక్ష ఛాయలో విశ్రాంతి తీసుకున్నాడని అందుకే ఎంతో పవిత్రమైనదిగా శమీవృక్షాన్ని భావిస్తారు. పాండవులు కూడా అజ్ఞాత వాసానికి వెళ్లేముందు తమ ఆయుధాలు శమీ వృక్షంపైనే దాచారు. శమీవృక్షం రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది పాండవులు కౌరవులపై విజయం సాధించారని విజయానికి ప్రతీకగా పాండవులు శమీ పూజ జరిపారని పురాణాల కధనం. సృష్టి చక్ర భ్రమణానికి మూలకారణం శక్తి జగన్మాత.

సమస్త జీవకోటికి ఆ దేవదేవి చైతన్యాన్ని అనుగ్రహిస్తుంది. సంకల్ప శక్తి, జ్ఞాన శక్తి, క్రియానురక్తుల సమ్మిళిత రూపంగా జగద్ధాత్రి ఫరిడవిల్లుతున్నది. అలాంటి ఆద్యశక్తి శ్రీ మాత భగవతిని ఉపాసన గ్రామంలో ఆరాధించే ఆరాధించే పరమ పవిత్ర తరుణం దేవి శరన్నవరాత్రులు.
శ్రేష్ఠమైన వ్యక్తుల్ని రక్షించడానికి, వేదాల్ని సదా సురక్షితంగా ఉంచడానికి దుష్టులను సదా సంహరించడము దుర్గాదేవి అవతారం లక్ష్యంగా దేవీ భాగవతం పేర్కొంటుంది.

జగన్మాత అంటే మహాదుర్గ. దేవి నవరాత్రులలో తొమ్మిది రోజుల్లోనూ దుర్గ శక్తిని భక్తులు ఆరాధిస్తారు. జగదీశ్వరి కరుణ పొందడం కోసం భక్తి తత్పరత, స్వధర్మ నిర్వహణ, యోగ సాధన, ఆధ్యాత్మిక భావన, క్రమశిక్షణ, అంతర్వీక్షణం వంటి అంశాల సమాహారం సమర్పించి అర్చన రీతి శక్తి- తత్రం, జడత్వాన్ని అధిగమించి నిస్తేజాన్ని పరిహరించి తమో గుణాన్ని విడనాడి ప్రయత్న శీలతతో పురోగమించి కార్యోన్ముఖులు గా జీవన ప్రధాన ముందడుగు వేయడానికి కావలసిన శక్తిని అమ్మవారు శరన్నవరాత్రులలో చేసే ఆరాధన తో తన భక్తులకు ఆశీస్సుల రూపంలో అందిస్తుంది.

ఇంతటి పరమపవిత్రమైన శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆరాధన చేసి అమ్మ ప్రేమను పొందుతారు. పదో రోజు విజయానికి ప్రతీకగా అత్యంత సంబరంగా విజయదశమి జరుపుకుంటారు.

విజయదశమి రోజు ఎలాంటి పని ప్రారంభించిన విజయమే చేకూరుతుందని, నాటి పాండవుల నుంచి నేటి వరకు అనేక విధాలుగా భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేకమైన బతుకమ్మను ఆరాధించి ఆడి పాడి మహిళలు తన్మయత్వం పొందుతారు. ఒకవైపు బతుకమ్మ తొమ్మిది రోజుల కోలాహలం… మరోవైపు దేవీనవరాత్రుల ఆధ్యాత్మిక సందడి దసరాకు కొత్త శోభను తీసుకొస్తుంది. తెలంగాణ పల్లెలు దసరా జోష్ తో కళకళలాడుతాయి.

మందు మార్బలంతో ఊగి పోతాయి. పాలపిట్టను దర్శించిన మీదట శమీ పూజతో దసరా ఆనందం మరింత జోరందుకొని అలాయి బలాయితో హల్చల్ చేస్తుంది దసరా…!!