ఆళ్వారుల వైభవాన్ని చాటుతూ…కాకతీయుల పౌరుషాన్ని ..శైలిని తేటలతెల్లం చేసేవిధంగా యాదాద్రిలో ముఖమండపం నిర్మాణమవుతోంది. ప్రపంచంలోనే ఎక్కడాలేనివిధంగా ఇక్కడ నిర్మానమవుతున్నది. సాధారణంగా యాలిస్తంభాలు, అశ్వస్తంభాలతో ముఖమండపాలు నిర్మితమై ఉన్నాయి. కానీ యాదాద్రిలో విశిష్టమైన పన్నెండు ఆళ్వార్లు శ్రీవారిని సేవిస్తూ ఉన్నట్లుగా ముఖమండపంలో విశిష్టమైన నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం పలికారు. ఈ నిర్మాణంలో కింద ఆళ్వార్‌మూర్తులు, వాటిపైన పొదికలు, దూలాపైన ఏనుగులు, భూతము, ప్రస్తరము, వాటిపైన కాకతీయ స్తంభాలు అత్యద్భుతంగా నిర్మాణం చేశారు. ఈ స్తంభాల మధ్యలో పూర్ణకళ స్తంభాలు, పిల్లస్తంభాలు అంటే ఒకే శిలలో ప్రధాన స్తంభం నలువైపులా పిల్లస్తంభాలను నిర్మాణం చేశారు.
ఉపాలయాలు :
మహామండపం లోపల అండాళ్ అమ్మవారి ఆలయం, ఆళ్వార్ ఆలయాలు నిర్మాణం చేస్తున్నారు.
క్షేత్రపాలకుడు :
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు యాదాద్రిలో కొలువుదీరడానికి యాదమహర్షికి దిక్సూచిగా పనిచేసిన శ్రీ ఆంజనేయస్వామి వారు క్షేత్రపాలకునిగా ఉన్నారు. స్వామి వారి ముఖమండపంలోనే అష్టభుజి ఆకారంలో ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని నిర్మాణః చేస్తున్నారు. రూప్ వరకు నిర్మాణం చేసకున్నది.
అష్టభుజి మండపం నిర్మాణంతో ఆకట్టుకుంటున్న ప్రాకారం
రాజగోపురం:
గోపురం అంటే ఏంటీ…?
గోపు యొక్క మూపురానికి గోపురం అని పేర్కొంటారు. ఆధునిక భాషలో చెప్పాలంటే ఎత్తయిన టవర్ అని చెప్పవచ్చు. అన్ని ఆలయాలలో గోపురం ఎత్తయిన నిర్మాణం కావడంతో గోపురంగా పిలుస్తారని శిల్పశాస్ర్తం చెబుతున్నది. రాజుల కాలంలో ఈ రాజగోపురాల నుంచి రాజులను పూర్ణకుంభంతో ఆహ్వానించేవారు కావడంతో రాజగోపురంగా, గాలిగోపురంగా పిలువడం ఆనవాయితీగా వస్తోంది. యాదాద్రిలో తూర్పువైపున, ఉత్తరం వైపున పంచతల రాజగోపురాలు పూర్తి కావోస్తున్నాయి. గోపురాలకు విగ్రహాలు అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. దక్షిణ వైపు నిర్మాణమవుతున్న రాజగోపురం రూప్ వరకు నిర్మాణం జరుపుకున్నది. పడమర ఉన్న పంచతల గోపురం కర్ణకూటం లెవెల్ వరకు పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా సప్తతల రాజగోపురం అతివేగంగా రూప్ లెవెల్ వరకు నిర్మాణం జరుపుకున్నది. త్రితల రాజగోపురం తూర్పు ఈశాన్యదిశలో కూడా కర్ణకూటం పైభాగం వరకు నిర్మాణం జరిగింది.

యాదాద్రిలో కొలువుదీరుతున్న ప్రాకార మండపాలు :
ప్రతి ఆలయానికి ప్రాకారం ఒక అందమైన నిర్మాణం. యాదాద్రి ఆలయంలో నిర్మాణమవుతున్న ప్రాకారం వేయినోళ్ల కొనియాడబడుతోంది. ఎందరో రాజులు ఎన్నో నిర్మాణాలు చేశారు. కానీ ఎక్కడా లేనివిధంగా యాదాద్రిలో నిర్మాణమవుతున్న ప్రాకారం ప్రత్యేకత సంతరించుకున్నది. బాహ్యప్రాకారం, అష్టభుజి మండపాలు, స్తంభాలు, వాటిలో సొగసుగా ఒదిగిపోయిన బాలపాద స్తంభాలు, వాటికి అడుగుభాగాన గజమూర్తులు స్తంభాన్ని మోస్తూ కనువిందు చేస్తున్నాయి. పైన విగ్రహా స్ధానంలో అనేక రకాల విష్ణురూపాలు, హంసలు, పక్షులు, పులులు, సింహాలు, పుష్పాలు, లతలు మిక్కిలి అందంగా కృష్ణశిలలపై చెక్కబడి ఉన్నాయి. స్తంభ భాగంలో పలక, పద్మము మొదలైన భాగాలతో శిల్పులు అద్భుతంగా చెక్కారు. పెద్దస్తంభంపైన పుష్పపొదికలు అమర్చడం వల్ల శోభాయమానంగా చూసిన వారిని ఆకట్టుకుంటున్నాయి. వాటిపైన భీములు అమర్చనున్నారు. వాటిపైన రూప్‌స్లాబ్ నిర్మాణం చేయనున్నారు.
యాలీ మిశ్రమ స్తంభం…సింహాం…ఏనుగు తొండంల కలయికతో ఏర్పడిన స్తంభం
అష్టభుజి మండపాల శోభ చూడతరమా…!
యాదాద్రి ప్రాకారానికి ఈశాన్యదిశలో త్వరలో పూర్తికావొస్తున్న అష్టభుజి మండపాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా లోపలి ప్రాకారంలో గల యాళిస్తంభాలు శిల్పుల చేతి నైపుణ్యానికి ప్రతీకగా నిలిచాయి. యాళిస్తంభాలు కొన్ని ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తయారు చేసి యాదాద్రికి తీసుకువచ్చారు. యాళిస్తంభాలు తయారు చేయడానికి స్తపతులు, ఉపస్తపతులు ఏళ్ల తరబడిగా శ్రమించారు. కృష్ణశిలలపై అందంగా చెక్కిన నైపుణ్యం ప్రశంసనీయంగా ఉన్నదనే అభినందనలు శిల్పులు అహోరాత్రులు కష్టించి పనిచేసిన దానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఆర్కిటెక్టు ఆనందసాయి ఇచ్చిన డిజైన్లకు స్తపతులు ఎస్.సుందరరాజన్, డాక్టర్ ఆనందాచార్యుల వేలుల పర్యవేక్షణలో అద్భుత శిలాఖండాలుగా పురుడు పోసుకున్నాయి.
యాళిస్తంభాలు:
యాళి అనగా సింహాం ఆకారంలో గల తొండం కలిగిన శిల్పాన్ని యాళి అని పిలుస్తారు. యాదాద్రి ప్రాకారానికి యాళిస్తంభాలు అందాన్ని సమకూర్చి పెట్టాయి. ఏనుగు మాదిరిగా…సింహం పోలికలతో ఉండటంతొ దీన్ని మిశ్రమ మృగంగా వారికి కన్పిస్తుంటుంది. ఇదే శైలిలో చెక్కే సింహాస్తంభమును యాళి అని పిలుస్తారు. ఈ స్తంభంలో అశ్వపాదం, విగ్రహాస్థానం, నాగబంధం, అష్టపటం, చతురస్రము మొదలైనవి ఉంటాయి. పద్మములు, అడ్డుపట్టముపైన లతలతో కూడుకన్న పద్మములు, వీటిపైన పొదికలు, భీములు, సన్‌సెడ్ మొదలైనవి ఈ స్తంభంలో చెక్కబడ్డాయి. అనేక విష్ణు అవతారాలు, హంసలు, పుష్పాలు, పత్రాలు, దశావతరాలు, మొదలైన ఎన్నో రకాల దేవతా ప్రతిమలను యాళీ స్తంభాలపైన చెక్కారు. ప్రాకారానికి వరుసలో గల యాళిస్తంభాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
యాదాద్రికొండపైన అందరిని ఆకట్టుకుంటున్న యాలీస్తంభాలు
ప్రథమ ప్రాకారం:
యాదాద్రి ఆలయం లోపలివైపు గల స్టోన్ క్లాడింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి స్టోన్ క్లాడింగ్ పనులు పూర్తి చేయడం దా్వరా ముఖమండపానికి మెరిసిపోయే శోభను సమకూర్చాలని శిల్పులు, స్తపతులు, ఉప స్తపతులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రథమ ప్రాకారం పూర్తి కావడం ద్వారా వెలుపలి ప్రాకారం పనులను అదే వేగంతో పూర్తి చేయాలని కంకణబద్దులై ఉన్నారు.
బాలపాదం:
ప్రధాన స్తంభాన్ని ఆనుకుని ఉండే చిన్న స్తంభాన్నే బాలస్తంభం అంటారు. యాదాద్రి ప్రాకారంలో బాలపాదముల ప్రత్యేకత ఎంతో ఉంది. అనేక ప్రధాన స్తంభాలపైన రెండు లేక మూడు లేక నాలుగు బాలపాదములు కూడా ప్రధాన స్తంభంలో అమరి ఉన్నాయి. దీని నుంచి సప్తస్వరాలు వచ్చేవిధంగా పూర్వంలో గల శిల్పులు చెక్కేవారు. దీనిపై హంసలు, పుష్పాలు, లతలు, సింహాలు మొదలైన ఎన్నో రకాల అందమైన రూపురేఖలు గల శిల్పాలు బాలపాదంలో చెక్కుతారు.
పొదికలు:
పొదికలు అనగా భీములు కింద వంగి ఉండే పుష్పాల మాదిరిగా కన్పించే శిల్పాలు. పొదికలు మూడు రకాలు. అవి 1. పుష్పపొదిక, 2. తరంగ పొదిక, 3. సాధారణ పొదిక అని పేర్కొంటారు. పుష్పపొదిక అరటి పుష్పము ఆకారంలో ఉంటుంది. పొదికలలో ఇది మిక్కిలి శ్రేష్టమైనది. యాదాద్రిలో పుష్పపొదికల రాజసం ఉట్టిపడుతున్నది.
ప్రాకారమండపం:
ప్రాకారమండపం తూర్పు, ఉత్తర దిశలలో నిర్మాణం జరుపుకున్నది. దక్షిణం, పడమర దిశలలో రక్షణగోడ చుట్టూ మట్టి నింపే పనులు జరుగుతున్నాయి. ప్రాకారాన్ని కొనసాగించడానికి సివిల్ ఇంజనీరింగ్ పనులు పూర్తి చేసి ఇచ్చినట్లయితే త్వరత్వరగా ప్రాకారాన్ని పూర్తి చేసే ఉద్దేశంలో శిల్పులు ఉన్నారు.
యాదాద్రికే సొంత కానున్న ఘనకీర్తి…!!
రాజుల కాలంలో కేవలం రూఫ్ వరకు మాత్రమే రాతి నిర్మాణాలు చేపట్టి విమానగోపురాలు, రూప్‌పైన ఉండే గోపురాలు ఇటుకలో నిర్మించేవారు నాటి రోజుల్లో సాంకేతిక పరమైన పనిముట్లు అంతగా లేకపోవడం వల్ల పనులు చాలా ఆలస్యంగా జరిగేవి….తండ్రులు మొదలు పెడితే కొడుకులు పూర్తి చేసేవారని చరిత్రకారులు చెబుతుంటారు. ఇప్పుడుమ మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆలయ నిర్మాణం చేపట్టి రెండు మూడు సంవత్సరాలల్లోనే పూర్తి చేయిస్తున్న అరుదైన ఘనత దక్కించుకోనున్నారు. అంది వచ్చిన సాంకేతికతను ఉపయోగించుకోవడంతో పాటు పని విభజన చేయడం పర్యవేక్షణ చేయడం అంతా తన కనుసన్నలలో జరుగుతుండటంతో పనుల్లో పురోగతి స్పష్టంగా కన్పిస్తోంది. యాదాద్రిలో నాలుగు పంచతల రాజగోపురాలు, ఒక మూడంతస్తుల రాజగోపురం ఒకటి, ఒక సప్తతల రాజగోపురం, ఒక విమానగోపురం నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఈ నిర్మాణమంతా కృష్ణశిలలతో జరుగుతుండడం విశేషం.
మూడు రాష్ట్రాల శిల్పులు…
అత్యద్భుతమైన నిర్మాణం జరుపుకుంటున్న యాదాద్రిలో మూడు రాష్ట్రాల శిల్పులు తమ కళా నైపుణ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలకు చెందిన శిల్పులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అద్బుతమైన శిల్ప సంపదను యాదాద్రి సొంతం చేసేందుకు వారు కంకణ బద్దులై పని చేస్తున్నారు. ఇన్నాళ్లు తమకు ఎవరు పనిచ్చిన వారు లేక తమ కళా సంపదలను సృష్టించలేకపోయాము ఇప్పుడు మాకు మంచి వేధిక లభించింది. సీఎం సారు మాకు మంచి అవకాశం ఇచ్చారంటూ వారు ఇష్టంతో కష్టపడి తమకు ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేస్తున్నారు.