శ్రీయాదాద్రి ప్రతినిధి : పుడమిపై పూల సింగిడి ఆవిష్కృతం కానున్నది. తీరొక్క పూల జాతరకు పల్లెలు సిద్దమయ్యాయి. నేటి ఎంగిలి పూల సంబురం నుంచి సద్దుల బతుకమ్మ ప్రతి వాకిలి పూదోట కానున్నది. బతుకమ్మా.. బతుకమ్మా ఉయ్యాలో..అంటూ సాగే ఆడబిడ్డల ఆటపాటలతో వీధివీధి హోరెత్తనున్నది. తొమ్మిది రోజుల పాటు అంబరాన్నంటేలా ఆడపడుచులు వైభవంగా బతుకమ్మ సంబురాలు జరుపుకోనున్నారు. ఆశ్వయుజ మాసం వస్తుందంటే తెలంగాణలో గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఈ పండుగ వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రవేశించే రోజుల్లో వస్తుంది. ఈ సమయానికి చెరువులు నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు పుష్కలంగా లభిస్తాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి, నందివర్థనం పూలతో పాటు రకరకాల పువ్వులతో ఆడపడుచులు బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో వేడుకలు చేసుకుంటారు. ఎంగిలిపువ్వుతో ప్రారంభం కానున్న బతుకమ్మ సంబురాలకు యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అసలే మహిళల పండుగ బతుకమ్మ కావడంతో వస్త్రాలకంరణలతో ఒకరిని మించి మరొకరు పోటితత్వంతో అలంకరించుకొంటారు. అందరూ ఒకేచోట చేరి కన్నుల పండుగగా తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేలాది సంఖ్యలో మహిళలు ఒకేచోట బతుకమ్మలు ఆడేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తన్నారు. అలాగే మహిళలు ఆడుకునే బతుకమ్మ ప్రాంగణానికి యువకులు, మగవారికి అనుమతి ఉండదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చెప్తున్నారు. ఏర్పాట్లను పోలీసు, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు.
పూలపండుగకు వేళాయే
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ (గౌరీ) పండుగను మహిళలు ఉత్సాహాంగా నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు అధికారికంగా నిర్వహించనుంది. మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు అంటరాన్నంటనున్నాయి. బతుకమ్మ అంటేనే పూల పండుగ. అంతేకాదు ప్రకృతి దేవతారాధనకు సంబంధించిన పండుగకు కూడా చెప్పుకోవచ్చు. బతుకమ్మను పూజిస్తే లక్ష్మీదేవిని ఆరాధించినట్టే. ప్రతీ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అంటే మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. చివరి సద్దుల బతుకమ్మతో ముగింపు పలుకుతారు. హిందూ సంప్రదాయంలో బతుకమ్మ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారి వ్యవస్థలో వారు చేసే ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ గ్రామీణ మహిళల బతుకులు దుర్భరంగా మారిన తరుణంలో తోటి మహిళ పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ ఆశ్వయుజ మాసం వస్తుందంటనే తెలంగాణలో గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఆ తర్వాత విజయదశమి నిర్వహిస్తారు. పండుగ వర్సాకాలం చివరిలో శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది. ఈ సమయానికి చెరువులు నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు పుష్కలంగా లభిస్తాయి. బతుకమ్మను పేర్చడానికి తంగేడు, గునుగు, బంతి, చామంతి, నందివర్థనం, ముచ్చాల పూలతో పాటు రకరకాల పువ్వులు ఉపయోగిస్తారు. వాటిల్లో తంగేడు పువ్వుకు అధిక ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే ఈ పువ్వును రాష్ట్ర పుష్పంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
బతుకమ్మ పండగ చరిత్ర..
బతుకమ్మ పండగ అంటే చాలా కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ. ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆమెను ఆ ఊరు ప్రజలు చిరకాలం బతుకమ్మ అంటూ దీవించారట. అందుకే ఈ పండుగను మహిళలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగగా చెప్తారు. అమ్మవారు మహిషాసురుడిని చంపి అలసి మూర్చపోయినప్పుడు బతుకు అమ్మా అని మహిళలంతా కలిసి పాటలతో స్ఫృహ తెప్పించారని ఇతిహాసంలో కథలో ఉంది.మరో కథ కూడా ఉంది. ఓ ముద్దుల చెల్లికి ఏడుగురు సోదరులు. వారికి చెల్లెలు అంటే పంచప్రాణాలు. వదినలకు మాత్రం అసూయ. ఓ రోజు వేటకు వెళ్లిన అన్నలు ఎంతకాలం అయినా తిరిగి రాలేదు. అదే అదునుగా భావించిన వదినలు సూటి పోటి మాటలతో వేధిస్తారు. దీంతో ఆమె ఇళ్లు వదిలి వెళ్లిపోతుంది. ఇంటికి వచ్చిన అన్నలు చెల్లెలు లేదని తన భార్యలను నిలదీస్తారు. తిండి తిప్పలు మాని చెల్లెలు కోసం వెతుకుతూ ఓ ఊరు పోలిమెరలో బావిలో దాహం తీర్చుకుంటుండగా పెద్ద తామరపువ్వు కనబడుతుంది. వాళ్లు దానిని చూడగానే నీళ్లలో తేలుతూ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి రాజ్యమేలే రాజు అక్కడికి వస్తాడు. ఆ పువ్వును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేస్తాడు. కొలనులో తంగేడు మొక్కలు మొలుస్తాయి. కొంత కాలానికి విష్ణుమూర్తి దిగివచ్చి తామరను స్త్రీమూర్తిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మీ అవతారం అని ప్రకటించాడు. పువ్వులకు బతుకు దెరువు చూపినందున బతుకమ్మ అయింది. ఇలాంటి కథలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి.