రాష్ట్రంలోని అన్నవరంలోని సత్యదేవుడి సన్నిధి తర్వాత యాదాద్రికొండపైనే అతి ఎక్కువగా శ్రీసత్యనారాయణస్వామి వారి పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా ఇక్కడ 70 వేలకు పైగా వ్రతాలు జరుగుతున్నాయంటే.. ఈ ప్రాంతంలో వ్రతపూజలకు ఎంత విశిష్టత ఉందో అర్థమవుతున్నది. వ్రతం కోసం అన్ని హంగులతో కూడిన విశాలమైన మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపంలో సామూహికంగా ఒకేసారి 250 జంటల వ్రత పూజలను నిర్వహించవచ్చు. 300 రూపాయల రుసుము చెల్లిస్తే భక్తులకు పూజా సామాగ్రి దేవస్థానమే సమకూరుస్తుంది. ఉదయం 7:30 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు వ్రత పూజలు జరుగుతాయి. సెలవుల్లో విశేష దినాల్లో అదనంగా వ్రతపూజలను జరుపుతారు.
నిత్యకల్యాణాలతో కళకళ
నిత్య కల్యాణాలతో యాదాద్రీశుడి ప్రాంగణం కళకళలాడుతున్నది. నరసింహుడికి భక్తజనం నిత్యం కల్యాణ మహోత్సవం జరిపిస్తూ తరిస్తుంటారు. ఉదయం 8:30 గంటలకు శ్రీవారి కల్యాణసేవ, హోమం జరుగుతాయి. ఈ కల్యాణంలో పాల్గొనే భక్తులు 1, 016 రూపాయలు రుసుము చెల్లించాలి. కల్యాణోత్సవం జరిపించే భక్తులకు ప్రసాదాలతో పాటు శ్రీవారి శేష వస్త్రాన్ని ఐదుగురు కుటుంబ సభ్యులకు అన్నప్రసాదాన్ని అందజేస్తారు.

శ్రీవారికి నిజాభిషేకం
శ్రీవారికి అర్చకుల సుప్రభాత సేవ తర్వాత నిజాభిషేకం జరుగుతుంది. ఉదయం 5 గంటలలోపు 216 రూపాయలు చెల్లించి టికెట్ పొందిన ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు.
అమ్మవారికి కుంకుమార్చన…!
యాదాద్రి నరసింహుడి సన్నిధిలో కొలువుదీరిన శ్రీఅండాళమ్మ వారికి భక్తులు కుంకుమార్చన నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కుంకుమార్చన పూజలో పాల్గొనే భక్తులు వంద రూపాయలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవికాకుండా ఆలయంలో శ్రీవారికి నిత్యం వెండి జోడుసేవ, అర్చన అష్టోత్తర గండదీపం పూజలను జరిపించుకునే అవకాశం కల్పిస్తారు.
సర్వసేవా పథకం
స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవం వరకు జరిగే అన్ని పూజల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ దేవస్థానం అధికారులు భక్తులకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేశారు. ఈ సర్వసేవా పథకంలో ఉదయం సుప్రభాతం, నిజాభిషేకం, అర్చన, నిత్యకల్యాణం, సాయంత్రం జోడుసేవ, రాత్రి అర్చన, అరగింపు, శయనోత్సవ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఇందుకు రూ. 2500 చెల్లిస్తే ఉచిత వసతి, భోజనంతో పాటు స్వామి వారి దివ్య ప్రసాదాలైన లడ్డూ, వడ, పులిహోర, శేషవస్ర్తం బహుకరిస్తారు.
మండలదీక్ష
స్వామి వారి సన్నిధిలో మండల దీక్ష ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. స్వామి వారిని 40 రోజుల పాటు కొలిస్తే ఆయురారోగ్యాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులుంటే నయమవుతాయని భక్తుల నమ్మకం. కొండపై గల పుష్కరిణిలో స్నానమాచరించి రోజుకు మూడుసార్లు ఆలయంలో భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు.
అన్నప్రసాదం..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించే భక్తులకు రోజుకు 500 మందికి ఉచిత భోజన టికెట్లు అందజేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో శాశ్వత ఉభయుల కోసం భక్తులు రూ. 1, 116 విరాళంగా చెల్లించి లక్ష్మీనరసింహుడి కటాక్ష ఫలం పొందవచ్చు.
తలనీలాల సమర్పణ
యాదాద్రికొండపై తలనీలాలను సమర్పించడం భక్తుల ఆనవాయితీ. కొండపై గల కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శిస్తారు. కల్యాణకట్టలో పది రూపాయలను చెల్లించి తలనీలాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
