యాదాద్రి కేంద్రంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళిక ప్రకారం కార్యాచరణను అమలు చేస్తున్నారు. యాదాద్రిని పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రంగా విశేష ఆదరణ తీసుకురావడం కోసం యాదాద్రి నుంచి ఇతర జిల్లాల్లో గల ప్రత్యేక ఆలయాలను కలుపుతూ ప్యాకేజీలను కూడా రూపొందిస్తున్నారు. సీఎం హోదాలో నాలుగేళ్ల క్రితం యాదాద్రిలో అడుగుపెట్టి అనేక వరాలను ఇక్కడి ప్రాంతానికి ఇచ్చారు. వాటిని అమలు చేయడానికి అధికార యంత్రాంగం అహర్నిషలు శ్రమిస్తున్నారు. ఈ మేరకు పర్యాటక, ఉద్యానవనాలు, సాంస్కృతిక శాఖలను సమన్వయం చేసి సాంస్కృతిక, పర్యాటక శాఖలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి కోటకు పర్యాటకులు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. రాయగిరిలో జింకల పార్కు…ఉద్యానవనాలు…రకరకాల మొక్కల పెంపకం…మినీ ట్యాంకుబండ్‌గా రాయగిరి చెరువు…బోటింగ్‌కు ఏర్పాట్లు…పార్కులో సైతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా…అందులో అందమైన పక్షులు, కోతులు, కుందేళ్లు…చూడ ముచ్చటేసే జింకలు…మృగరాజుల బొమ్మలు…బోట్ షికార్ ఇవన్నీ యాదాద్రి సన్నిధిలో మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. భువనగిరి ఖిల్లా, కొలనుపాక జైన దేవాలయం, స్వయంభూ సోమేశ్వరాలయం, కొమురవెల్లి ఆలయాన్ని కలుపుతూ టూరిజం ప్యాకేజీలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. దీనితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళి, వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, అటు నుంచి రామప్ప, లక్నవరం వరకు ప్యాకేజీలను పర్యాటక శాఖ సిద్ధం చేస్తున్నది. అన్ని ప్యాకేజీలలో యాదాద్రి దర్శనం తప్పనిసరి చేస్తూ పర్యాటక శాఖ ఆతిధ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇప్పటికే పర్యాటక శాఖ సీఎండీ ప్రత్యేకంగా ఈ విషయమై హైద్రాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం యాదాద్రి ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నది. సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఇంతకాలం భరించిన ఈ ప్రాంతం వాసులకు ముఖ్యమంత్రి అన్నీ తానై అండగా నిలుస్తూ ఊహించని వరాలు ఇస్తున్నారు. యాదాద్రిని రూ. 1900 కోట్లతో అభివృద్ధి చేస్తుండడంతో పర్యాటకపరంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. సుమారు 50 వేల మందికి ప్రత్యక్షంగా మేలు కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. యాదాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను కలుపుతూ యాదాద్రికి పర్యాటక శోభ తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పక్కా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించడంతో ఈ మేరకు పర్యాటక, ఉద్యానవనాలు, సాంస్కృతిక శాఖలను సమన్వయం చేసేందుకు సాంస్కృతిక, పర్యాటక శాఖలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. భువనగిరి కోటకు పర్యాటకులు పెద్ద ఎత్తున పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
రాయగిరి చెరువులో బోటింగ్
రాయగిరిలో జింకల పార్కు…ఉద్యానవనాలు…రకరకాల మొక్కల పెంపకం…మినీ ట్యాంకుబండ్‌గా రాయగిరి చెరువు…బోటింగ్‌కు ఏర్పాట్లు…పార్కులో సైతం ఉట్టిపడేలా…అందులో అందమైన పక్షులు, కోతులు, కుందేళ్లు…చూడ ముచ్చటేసే జింకలు…మృగరాజుల బొమ్మలు…బోట్ షికార్..! ఇవన్నీ యాదాద్రి సన్నిధిలో మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. భువనగిరి ఖిల్లా, కొలనుపాక జైన దేవాలయం, కొలనుపాకలోని స్వయంభూ సోమేశ్వరాలయం, కొమురవెల్లి ఆలయం వరకు కలుపుతూ టూరిజం ప్యాకేజీలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికి ఇంతకాలం భరించిన ఈ ప్రాంతం వాసులకు ముఖ్యమంత్రి అన్ని తానై అండగా నిలుస్తూ జరిగిన అన్యాయాన్ని అధిగమించడంతో పాటు ఊహించని వరాలను ఇస్తున్నారు. యాదాద్రిని రూ. 1900 కోట్లతో అభివృద్ధి చేస్తుండడంతో పర్యాటక పరంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. సుమారు 50 వేల మందికి ప్రత్యక్షంగా మేలు కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. యాదాద్రిలోని స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పంచేందుకు ప్రత్యేకంగా రాయగిరి చెరువును మినీ ట్యాంకుబండ్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఈ చెరువును పరిశుభ్రంగా మార్చి అందులో బోట్‌షికార్ చేసేందుకు ప్రత్యేకంగా బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక ప్లాట్‌పాంలను నిర్మిస్తున్నారు.
ఆహ్లాదం…ఆనందం కోసం…
భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఆహ్లాదం పంచేందుకు ప్రభుత్వం రాయగిరి-యాదగిరిగుట్ట మార్గంలో ఏర్పాటు చేస్తున్న జింకల పార్కు పనులు చురుగ్గా సాగుతున్నాయి. సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పార్క్‌ను త్వరలో ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాదాద్రికి వచ్చిన భక్తులు రెండు మూడు రోజులు గుట్టతో పాటు చుట్టు పక్కన గల ప్రాంతాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్టకు అభిముఖంగా వెయ్యి ఎకరాలలో నిర్మాణం కానున్న టెంపుల్‌సిటీలో భక్తులను ఆనందింపజేసేవి. వినోదం కలిగించేవి గుర్తించి ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నారు. యాదాద్రి సమీపంలోని మల్లన్నగుట్టను పూర్తిగా అటవీ ఉద్యానవన శాఖలు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. జింకలను పెంచడంతో పాటు ఇతర వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన జంతువులతో ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు నుంచి భువనగిరికి పర్యాటకులు చేరుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. భువనగిరి ప్లోర్ట్‌పైకి పర్యాటకులు సులువుగా ఎక్కేందుకు కేబుల్ కార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భువనగిరి ఖిల్లాను ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దడానికి అన్ని హంగులతో అభివృద్ధి చేయనున్నారు. పర్యాటక రంగానికి ఆదరణ లభించేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, క్రీడల, పురావస్తు, సాంస్కృతిక శాఖలను అనుసంధానం చేస్తున్నారు. పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా కేబుల్ కార్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 6 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. తెలంగాణ సంస్కృతి తెలంగాణ పరిపాలనా దక్షతకు నిదర్శనంగా భువనగిరి కోటను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటక కేంద్ర అభివృద్ధి క్రమంలో జనవరి నెలలో భువనగిరి ఫోర్ట్ ఫెస్ట్‌వల్ నిర్వహిస్తారు. ఆసియా ఖండంలోనే సింగిల్ రాక్ ఏకశిల మరెక్కడా లేదని, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
భువనగిరి కోట వద్ద క్రమం తప్పకుండా మ్యూజికల్ ప్రదర్శనలు…
భువనగిరి కోట వద్ద క్రమం తప్పక అనునిత్యం ఉండేలా సాంస్కృతిక, మ్యూజికల్ ప్రదర్శనల ఏర్పాటును పరిశీలించనున్నారు. సాహసానికి, ఆనందానికి నిలువెత్తు నిదర్శనమైన ఖిల్లా ఏర్పాట్ల విషయంలో భద్రతాపరమైన అంశాలను కూడా పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యాటక ప్రాంతంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్యాకేజీలు ప్రకటించనున్నారు. హైద్రాబాద్ నుంచి ప్రతిరోజు టూరిజం బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకుల ఆకర్షణతో పాటు పర్యాటక అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. జిల్లాలోని పోచంపల్లి, కొలనుపాక, గంధమల్ల, యాదాద్రి తదితర ప్రాంతాలను టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి పర్చాలని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
పార్కులో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా…
పార్కులో సైతం ఆధ్యాత్మికత ఉట్టిపడేవిధంగా మధ్యమధ్యలో స్వామి, అమ్మవార్లకు సంబంధించిన కొన్ని నినాదాల బోర్డులను పెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పార్కులోకి ప్రతి భక్తుడికి సమయం తెలియకుండా కాలం గడిపి ఆనందంగా తిరిగి వెళ్లేవిధంగా అన్ని హంగులతో పార్కును ముస్తాబు చేస్తున్నారు. ఈ పార్కులో వివిధ రకాల అందమైన పక్షులు, జంతువులకు ప్రత్యేకంగా గదులు నిర్మిస్తున్నామని, అవసరమైతే పాములకు కూడా గదులు నిర్మిస్తామని అధికారులు వెల్లడించారు. స్వామి, అమ్మవార్లకు ప్రతిరోజు నిత్యకైంకర్యాలకు అవసరమైన పుష్పాలు, పండ్లు, కొబ్బరికాయలకు ప్రత్యేకంగా మొక్కలు పెంచుతున్నారు. ఈ పార్కును సందర్శించేందుకు టికెట్టు ఏర్పాటు చేద్దామా వద్దా అనేది ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. ఈ పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆటవస్తువులు సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.