యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మాణం చేయడానికి అవసరమైన వివిధ శిల్పాకృతులు పలు శిల్పకళాశాలల్లో రూపుదిద్దుకుంటున్నాయి. యాదాద్రిని అద్భుత దివ్యదేవనగరిగా మార్చడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వల్ల పనులు ఊపందుకున్నాయి. ఆళ్లగడ్డతో పాటు మార్టూరు, గురిజపల్లి, కోహెడలలో కూడా శిల్పాలు తయారవుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత కలిగిన శిల్పాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతీ 15 రోజులకోసారి సీఎం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. దాంతో శిల్పాలను చెక్కే పనుల్లో సీఎం ముద్ర స్పష్టంగా కన్పిస్తున్నది. ఆలయం మొదటి ప్రాకార మండపం, రెండవ ప్రాకార మండపం, శ్రీవారి కళ్యాణమండపం, యాగశాల, అద్దాల మండపం, రామానుజకూటంతో పాటు సప్తతల, పంచతల రాజగోపురాలకు అవసరమైన భారీ శిల్పాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి. భారీ నిర్మాణాల కోసం అవసరమైన శిల్పాలకు ప్రాణం పోసే పనుల్లో శిల్పలు తమ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. వీటితో పాటు ప్రాకార మండపాల పిల్లర్లు, ఆలయ ముఖమండపంపై కప్పుకు అవసరమైన శిల్పాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. రాజగోపురాల పనుల కోసం ప్రకాశం జిల్లాలోని మార్టురులో తయారవుతున్నాయి. అత్యంత ప్రాధాన్యత కలిగిన శిల్పాలు ఆళ్లగడ్డలో తయారవుతున్నాయి. శిల్పులు తమ నైపుణ్యతతో నృసింహుని ఆలయ నిర్మాణం ఇతర విగ్రహాలకు రూపమిచ్చే పనులు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మనసులో నుంచి వచ్చిన ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు శిల్పులు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. యాదాద్రిలో రెండు ఎకరాల్లో కొండపై శ్రీవారి ఆలయం రూపుదిద్దుకుంటున్నది. దీనిలోనే బాలపాద ప్రాకార మండపం ఏర్పాటు చేస్తున్నారు. బాలపాద ప్రాకార మండపంలో వరుసగా మండపం పొడవునా 32 శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి సంబంధించిన అవతారాలు కొలువుదీరేవిధంగా డిజైన్లు రూపొందించారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎక్కడా 32 శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహాలు ఒకే దగ్గర కొలువుదీరిలేవని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత యాదాద్రికి రానుంది. ఆళ్లగడ్డతో పాటు మార్టూరు, గురిజపల్లి, కోహుడలలో కూడా శిల్పాలు తయారవుతున్నాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత కలిగిన శిల్పాలు రూపుదిద్దుకుంటున్నాయి.
రూ.150 కోట్ల బడ్జెట్‌తో పనులు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విస్తరణ కనీవినీ ఎరుగని విధంగా జరగనుంది. మొదటి ప్రాకారమండపం, రెండవ ప్రాకారమండపం, కల్యాణమండపం, యాగశాల, అద్దాల మండపం, రామానుజకూటం, రాజగోపురాల నిర్మాణం కోసం వైటీడీఏ రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు టెండర్లు పూర్తవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయంలోనే భారీ నిర్మాణాలు రానున్నాయి. గతంలో మాదిరిగా గాకుండా కళ్యాణమండపం, శ్రీవారికి మూడు పూటలా నైవేధ్యం సమర్పించేందుకు తయారు చేయాల్సిన వంటల కోసం ఉపయోగించే రామానుజకూటం యాదాద్రి వైభవాన్ని చాటి చెప్పే అద్దాల మండపం ఒకదాని తరువాత మరొకటి కొలువుదీరడం ద్వారా యాదాద్రి ప్రాశస్థ్యం ఇనుమడించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రిలోని ఆలయం రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానుంది. వెయ్యేండ్లపాటు ఆలయం చెక్కు చెదరకుండా ఉండేవిధంగా ఆర్కిటెక్టులు ప్రణాళికలు రూపొందించారు. వాటిని తూచ తప్పకుండా శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్‌స్వామి వారి సూచనలతో ఆగమాశాస్త్రానుసారం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ నిర్మాణంలో ఉపయోగిస్తారు. అద్దాల మండపం రూ. 30 కోట్లు ఖర్చవుతుందని అంచనాకు వచ్చి పనులు ప్రారంభించారు. ప్లోరింగ్ విషయంలో కూడా రాజీ పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
విగ్రహాలకు రూపకల్పన ప్రక్రియ వేగవంతం
యాదాద్రిలో అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం కానున్న ఆలయానికి అవసరమైన విగ్రహాలకు రూపకల్పన ప్రక్రియ వేగవంతమైంది. నయనానందకరమైన విగ్రహాలను తయారు చేస్తున్నారు. యాదాద్రీశుడు కొలువుదీరడానికి ప్రధాన కారకుడైన యాదరుషీ విగ్రహాన్ని ఆకర్షణీయంగా శిల్పులు చెక్కుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో విగ్రహాలకు రూపకల్పన జరుగుతోంది. కొండపైన గల సీతారామంజనేయస్వామి వారి ఆలయానికి అవసరమైన సీతారామలక్ష్మణ విగ్రహాలను భక్తి ఉట్టి పడేవిధంగా శిల్పులు కృష్ణశిలలపై ఆవిష్కరిస్తున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 32 అవతారాల విగ్రహాలు కూడా తయారవుతున్నాయి. ఒకవైపు శిల్పాలు మరోవైపు విగ్రహాల తయారీ ప్రక్రియ ఊపందుకుంది. యాదాద్రిని తిరుమల తరహాలో తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అత్యంత సుందరమైన ప్రాకారాలు నిర్మాణం చేయడానికి అవసరమైన రాతి స్తంభాలు కూడా తయారవుతున్నాయి. తయారైన విగ్రహాలు, శిల్పాలకు తుది మెరుగులు దిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు వరుసలకు అవసరమైన ఆధార శిలల రూపకల్పన పూర్తయింది.
పర్యాటక ప్యాకేజీలు… యాదాద్రికి హెలీక్యాప్టర్ సేవలు!!
యాదాద్రిని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. యాదాద్రితో పాటు వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప టెంపుల్‌తో పాటు మరికొన్నింటినీ కలుపుతూ టూరిస్టు పర్యాటక శాఖ ప్యాకేజీలను రూపొందిస్తుంది. విమానయానాన్ని ప్రొత్సాహించడానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో పర్యాటక శాఖలో కదలిక వచ్చింది. ప్రపంచ పర్యాటకులను కూడా ఆకర్షించి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడానికి సరికొత్త ప్రణాళికలు రచిస్తుంది. దీంతో యాదాద్రి ప్రపంచ ప్రసిద్ధి కానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగులీనుతూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్ధానానికి మరింత ఆదరణ పెంచుకొనున్నది. వైటీడీఏ ప్రతిపాదించిన వాటిలో వీవీఐపీ అయిన రాష్ట్రపతి కోసం నిర్మాణమవుతున్న ప్రెసిడెంట్ సూట్ వద్ద వీఐపీల కోసం ఒకటి పర్యాటకులు భక్తుల కోసం టెంపుల్‌సిటీలో మరో హెలిప్యాడ్‌ను నిర్మించాలని ఖరారు చేశారు. దీనిద్వారా పర్యాటకులకు, భక్తులు, ప్రముఖులు, వీదేశీయుల ప్రయాణానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. హైద్రాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమానయానం భాగ్యం కలుగనుంది. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలకు శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతో పాటు, రాజధాని నగరమైన హైద్రాబాద్ నుంచి యాదాద్రికి రావడానికి ఆకాశయానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది.