బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు.. చీఫ్ కోచ్ గోపీచంద్‌కు చెందిన రెండు ప్రత్యేక అకాడమీల్లో శిక్షణ పొందుతున్నారు. వ్యూహాలను అమలు చేయడం, షాట్లలో పరిణతి, భిన్నమైన ర్యాలీలను ఆడటంపై వీళ్లు తర్ఫీదు పొందుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ ఇద్దరి శిక్షణను గోపీచంద్ పర్యవేక్షిస్తున్నారు. కొత్త అకాడమీలో శిక్షణ సింధుకు అనుకూలంగా లేదు. బ్యాడ్మింటన్ వ్యక్తిగత క్రీడాంశం కావడంతో పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా తన వ్యూహాలపై దృష్టిపెట్టాలనే ఉద్దేశంతో కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పాత అకాడమీలోనే ప్రాక్టీస్ చేస్తున్నది. ఇద్దరు కలిసి ఒకే దగ్గర ప్రాక్టీస్ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకరి బలహీనతలు మరొకరికి తెలుస్తాయి.
మిగతా వాళ్లు ఎంత ఫిట్‌గా ఉన్నారో కూడా తేలికగా అర్థమైపోతుంది. అప్పుడు క్లిష్టమైన అంశాలపై దృష్టిపెట్టలేరు. అందుకే అప్పట్లో సైనా.. విమల్ దగ్గర శిక్షణ తీసుకున్నది అని సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నాడు. నాలుగేండ్ల కిందట గోపీ పాత అకాడమీకి అర కిలోమీటర్ దూరంలోనే కొత్తగా మరో అకాడమీని ఏర్పాటు చేశారు. సింధు ప్రాక్టీస్ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ.. గోపీ ఉదయం ఏడు నుంచి ఎనిమిదన్నర వరకు శిక్షణ ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఇండోనేషియా కోచ్‌లు సహకరిస్తారు. జూనియర్ బాలురు, డబుల్స్ ప్లేయర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎక్కువ సమయం గడిపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓ దశకు చేరుకున్నాకా ఎలా ప్రాక్టీస్ చేయాలో ప్లేయర్స్‌కు అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ పరిణతి చెందినవారే. చేసే తప్పులు, వ్యూహాలపై కచ్చితమైన అవగాహన ఉంటుంది. వీటిని సరిదిద్దుకుని ముందుకెళ్తే సరిపోతుంది అని రమణ వ్యాఖ్యానించాడు.