యాదాద్రికొండపైన గల శ్రీపర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. శివాలయం వేలాది మంది భక్తులతో అలరారుతున్నది. యాదాద్రికొండ శివకేశవులకు నెలవుగా మారింది. ప్రతిరోజు ఉదయాన్నే పూజలు ప్రారంభమవుతాయి. ఒకవైపు శ్రీమహావిష్ణువు, మరోవైపు శివుడు యాదాద్రిని పునీతం చేస్తున్నారు. శివాలయంలో నవగ్రహాలు, ఆంజనేయస్వామి, నాగదేవత, గణపతి, కుమారస్వామిలను దర్శించుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. శివపార్వతుల కల్యాణం కనుల పండువగా జరుగుతుంది. మహాశివరాత్రి రోజు అర్థరాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో జరిగే మహా రుద్రాభిషేకంలో భక్తులు వేలాదిగా పాల్లొంటారు. యాదాద్రిని దర్శిస్తే శివకేశవులిద్దరినీ దర్శించే భాగ్యం కలుగుతుండడంతో భక్తులు యాదాద్రి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివస్తారు.