స్వయంభూ పంచానారసింహుని వైభవం…!!
శ్రీయాదరుషి తపస్సునకు మెచ్చిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు ఆయన కోరిక మేరకు యాదాద్రి క్షేత్రంలో పంచరూపాలతో దర్శనభాగ్యం కలిగిస్తున్నారు. పంచరూపాలు ధరించడంలో కొన్ని ప్రత్యేకతలను తెలుపుచూ స్కాంద, బ్రహ్మండాది పురాణాలు అనేక విధాలుగా వర్ణించాయి. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంది్రయాలు, పంచతిన్మాత్రలు, పంచ తత్త్వములు అంతర్లీనమై శ్రీస్వామి వారిలో ఉంటాయని పేర్కొన్నాయి. హిరణ్యకశ్యపుని వధ సమయంలో శ్రీస్వామివారు సుమారు 72 స్వరూపాలను ధరించి హిరణ్యకశిపువు దాల్చిన 72 విషతత్త్వములను సంహరించినట్లు పురాణ ప్రసిద్ధము. వాటిలో యాదాద్రి క్షేత్రంలో గల పంచరూపాలు మహోన్నత ప్రత్యేకతను తెలియజేస్తాయి.
శ్రీజ్వాలా నృసింహ ప్రత్యేకత :
భయంకర ఆకృతి దాల్చి హిరణ్యకశ్యపుడు చీకటిలో అంతర్లీనుడవ్వగా శ్రీస్వామి వారు జ్వాలా నరసింహునిగా సర్పకారంలో ఆవిర్భవించి తన వెలుగుల ద్వారా హిరణ్యకశ్యపుని తమోమయ శరీరమును నాశనం చేశారు. సర్పాకృతిలో స్వామి దర్శనమివ్వడం, తనను దర్శించిన వారికి దృష్టశక్తుల పీడ ఉండదని అనుగ్రహించడం విశేషం.
శ్రీయోగానందనరసింహస్వామి :
మనస్సును నిగ్రహించిన అది ఆనందమయమవుతుంది. యోగ సాధన మహర్షులకు దర్శింపచేస్తూ బాహ్యస్మృతిని వదిలి అంతరంగిక శుద్ధని తెలియజేస్తుంది. హిరణ్యకశ్యపుని అంతరంగిక మాలిన్యం తొలగించి యోగసాధనలో చిత్తవృత్తిని భగవదర్పణ గావించిన వైనాన్ని యోగాభ్యాసంతోనే ఆయనలోని దుష్టశక్తిని తొలగించారు.
శ్రీగండభేరుండ స్వామి విశిష్టత :
హిరణ్యకశ్యపుడు స్వామి వారితో యుద్ధం చేసే సమయంలో దిక్కుతోచని స్థితిలో భయంకర విషసర్పముల రూపముదాల్చి విషపు కోరలతో ముల్లోకాలను భయకంపితులను చేసే సమయంలో శ్రీస్వామివారు లోక రక్షణార్థం గండభేరుండ పక్షి రూపము దాల్చి అతని భయంకర సర్పరూపమును సంహరించారు. అంతేగాక పక్షికి గల రెండు రెక్కలు..ఒకటి జ్ఞానాన్ని, రెండోది కర్మనుష్టానం సూచించునని సృష్టిలో ప్రతి జీవి జ్ఞాన కర్మనుష్టానం ద్వారానే భగవత్ ప్రాప్తిని పొందగలడు. సర్వవిధ సర్వ గండములను హరించే వైనం గండభేరుండ రూపంలో తెలుస్తుంది.అందుకే యాదాద్రి క్షేత్రంలో భక్తకోటి గండదీప మొక్కుల ద్వారా తమ దోషాలను తొలగించుకుంటున్నారని యాదాద్రి క్షేత్ర మహత్యం తెలియజేస్తుంది.
శ్రీ ఉగ్రనరసింహస్వామి విశిష్టత :
హిరణ్యకశ్యపుడు సంహరార్థం అలనాడు శ్రీహరి నరాహరిగా ఉగ్రస్థంభం నుండి వెలువడి హిరణ్యకశ్యపుడిని వధగావించిన సన్నివేశం ఈ ఉగ్ర ఆకృతిలో దర్శించవచ్చును. అట్టి భయంకర ఆకృతిలో దర్శనమిచ్చిన స్వామిని గిరినంతటా ఆశ్రయించి ఉన్నతిని పొందింప చేయమని యాదరుషి కోరగా శ్రీస్వామి వారు ఈ కొండపై శ్రీసుదర్శన చక్రరూపంలో ఉండి సమస్త భూత, ప్రేత, పిశాచాది బాధలను తొలగిస్తున్నారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి విశిష్టత :
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారుగా యాదాద్రి క్షేత్రంలో భక్తకోటికి కొంగు బంగారమై ఆశ్రిత రక్షకుడై సర్వసంపదలను ఇస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని సర్వదా రక్షిస్తూ ఉన్న రూపమే శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు. శ్రీవారి అనుగ్రహం పొందడానికి సకల దేవతలు, చరాచర జగత్తు అంతా ఆనందమును అనుభవించుట, వివిధ శస్త్రచికిత్సల ద్వారా భయంకరమైన వ్యాధులను ఎన్నో తొలగించి రక్షించడం యాదాద్రి క్షేత్రంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రత్యేకత.