యాదాద్రి అద్బుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది…శ్రీలక్ష్మీనరసింహుడికి పరమభక్తుడి రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరుమలకు ధీటుగా యాదాద్రి ఉండాలని సంకల్పించారు. వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అభివృద్ధిలో తలమునకలయ్యారు. యాదాద్రి చరిత్రలో కేసీఆర్ పాలన సువర్ణాక్షరాలతో లిఖిచేదిగా లిఖితమవుతున్నది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిన నిర్మాణాలు తిరిగి కేసీఆర్ పాలనలో జరుగుతున్నాయని ఆధ్యాత్మికవేత్తలు కొనియాడుతున్నారు. జీయర్‌స్వామి మాటల్లో చెప్పాలంటే ఆధ్యాత్మిక విప్లవం మొదలైంది. ఎన్ని వందల కోట్లయినా ఇస్తాము..యాదాద్రిని తిరుమలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆచరణ రూపం దాల్చడంతో యాదాద్రి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ ఆధ్యాత్మిక ప్రపంచంలో యాదాద్రికి స్థానం ఉండేవిధంగా తెలంగాణకు తలమానికంగా దేశంలోనే పేరెన్నికగన్న పుణ్యక్షేత్రంగా విరాజిల్లడానికి అవసరమైన హంగులను సమకూర్చుకుంటున్నది. ఈ ఏడాది చివరి నాటికి ప్రధానాలయం పనుల పూర్తి లక్ష్యంగా నిర్మాణాలు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యాదాద్రికి ముఖ్యమంత్రి హోదాలో 2014 అక్టోబర్ 17న శుక్రవారం కాలుపెట్టారు. కేసీఆర్ యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా మారుస్తామని అదే రోజు ప్రకటించడంతో యాదాద్రికి మంచిరోజులు మొదలయ్యాయి. వీటన్నింటిని తలదన్నేలా అయిదు లక్షలకు ఎకరం కూడా పలకని ఇక్కడి భూముల ధరలు రెండు కోట్లకు దాటాయి. ప్రపంచమంతా గమనించేవిధంగా ఆయన యాదాద్రికి వెయ్యి కోట్ల రూపాయలైన వెనుకాడమని అభివృద్ధే ద్యేయంగా ముందుకు సాగుతామని ప్రకటన చేశారు. అంతకుముందు వరకు ముఖ్యమంత్రుల మాదిరిగానే కేసీఆర్ కూడా దర్శించుకొని వెళ్తారని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా అందరికి వరాలిచ్చే లక్ష్మీనరసింహుని గుడికే అండగా నేనున్నానంటూ అభయమిచ్చారు. నాటి నుంచి నేటివరకు అనేక పర్యాయాలు యాదాద్రిలో విహంగ వీక్షణం చేయడం కొండపై అనువణువు శోధించడం కేసీఆర్‌కు అలవాటుగా మారిపోయింది. తన స్వంత ఇంటి పనికన్నా ప్రాధాన్యతను ఇస్తూ గుడి వెలుగులే తనకు ముఖ్యమన్న దోరణితో ముందుకు సాగుతున్నారు. రెండేళ్లలో సుమారు వెయ్యి డిజైన్లను పరిశీలించి చివరికి ఆగస్టు నెలలో డిజైన్లను పైనల్ చేశారంటే ఆలయ అభివృద్ధి విషయంలో ఎంత సూక్ష్మ పరిశీలన చేస్తున్నారో అవగతమవుతుంది.
అంత చొరవ తీసుకొని చేసిన డిజైన్లకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభించింది. డిజైన్లకు వాస్తవరూపం ఇచ్చేందుకు జరుగుతున్న పనులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవిధంగా ఉన్నాయి. యాదాద్రిలో ఇప్పుడు జరుగుతున్న పనులను ఎవరూ ఊహించలేదు..ఆంధ్రా సోకాల్డు నాయకులు ఆలయానికి వచ్చి విడిది చేసి సకల లగ్జరీ సుఖాలు అనుభవించారు తప్ప ఏనాడు స్వామివారి ఆలయం అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా కోట్లాది రూపాయల నిధులను ఆంధ్రా ప్రాంతాల్లోని దేవాలయాల అభివృద్ధికి మళ్లించేవారు. నాటి వివక్ష నుంచి సీఎం విముక్తి చేయడమే గాకుండా కోరిన కోర్కెలు తీర్చే శ్రీలక్ష్మీనరసింహునికే కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్న అపూర్వ సన్నివేశం అందరిని అబ్బురపరుస్తోంది. సీఎం చూపిస్తున్న చొరవ…ఆయన స్వప్నం ఎంత బలీయమైందో ప్రపంచమంతా గమనిస్తోంది.
వెయ్యి డిజైన్ల నుంచి ఆ ఒక్కటి ఎంపిక
యాదాద్రిలో జరుగుతున్న పనులపై సీఎం కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డిజైన్లు పూర్తి కావడానికి రెండేళ్లు తీసుకున్నారు. 2015 దసరా రోజున పనులకు శంకుస్థాపన చేయగా ఈ ఏడాది చివరి నాటికి పనులను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వేయి రకాల డిజైన్ల తరువాత పైనల్ డిజైన్లు వచ్చాయంటే సీఎం చిత్తశుద్ధి ఎంత గట్టిదో అవగతమవుతుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు దేశంలోని ఎంతో మంది నిష్ణాతులు యాదాద్రి డిజైన్లను పరిశీలించారు. ప్రతఒక్కరు ప్రశంసించడమే గాకుండా సీఎం చేస్తున్న యజ్ఞం సఫలం కావాలని ఆశీస్సులు అందజేశారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్వయంగా పనులు జరుగుతున్న తీరును సమీక్షించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మసేవలను కూడా వైటీడీఏ అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. ప్రధానాలయాన్ని రెండు ఎకరాలలో విస్తరిస్తూ, కొండపైన మొత్తం పద్నాల్గు ఎకరాలలో చేపట్టిన పనులను సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం రూపొందించిన డిజైన్లు, ప్రాధమిక దశలోని నిర్మాణం పనుల వరకే పరిమితం కాగా, ఇప్పుడు వెయ్యి సంవత్సరాల కాలం వరకు నిలిచి ఉండే అద్భుత నిర్మాణాలు జరుగుతున్నాయి.
యాదాద్రికొండపై పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
ఇప్పటికే…శ్రీవారి సన్నిధికి 9సార్లు..!!
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో 2016 అక్టోబర్ 19న మరోసారి యాదాద్రిని సందర్శించి తెలంగాణకు తలమాణికమైన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చదిద్దాలని, అందుకు అవసరమైన అన్ని హంగులు సమకూరుస్తామని కేసీఆర్ పునద్ఘాటించారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎనిమిదోసారి. మొట్టమొదటి సారి ఆయన 17-10-2014న శ్రీవారిని దర్శించుకున్నారు. 2014లో డిసెంబర్ 17న రెండోసారి దర్శించుకున్నారు. 2015లో ఫిబ్రవరి 25, 27న, మార్చి 5న జరిగిన శ్రీవారి కల్యాణంలో సతీసమేతంగా పాల్గొన్నారు. మే 30న మరోసారి యాదాద్రి పనులను పర్యవేక్షించడానికి దర్శించుకున్నారు. రాష్ట్రపతితో పాటు జూలై 5న దర్శించుకున్నారు.
నూతనంగా రూపుదిద్దుకునే యాదాద్రి నిర్మాణాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
అపర వైకుంఠం యాదాద్రి..!!
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు పూర్తయితే యాదాద్రి సకల సౌకర్యాలు కలిగిన అపర వైకుంఠం కానుంది. కొండపైన, కొండ కింద సెంట్రల్ లైటింగ్ వెలుగులు ఒకవైపు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేటువంటి సెంట్రల్ మైక్ సౌండ్ నుంచి వచ్చే పాటలు…మరోవైపు చూడచక్కని రోడ్లు ఇలా ఒక్కో మౌళిక సౌకర్యాల కల్పనలో అత్యాధునికత జతకలవడంతో యాదాద్రి ప్రపంచంలోనే ఎంతో పేరున్న ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగులీనుతుందని భావిస్తున్నారు. ప్యూచర్ యాదాద్రి ఇదిగో అంటూ వైటీడీఏ విడుదల చేసిన పైనల్ డిజైన్లు అద్భుతంగా ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు, భక్తుల ప్రశంసిస్తున్నారు.