రాజుల కాలంలో నిర్మించిన రాతిశిల నిర్మాణాల రీతిలో మహిమాన్విత స్వయంభూ పంచనారసింహులు కొలువైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాచీన శిల్పకళా శోభను సంతరించుకుంటోంది. దేశంలోనే అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దడానికి శిల్పులు ఆహోరాత్రులు శ్రమిస్తున్నారు. రాతి శిలలకు తమ ఉలులతో ప్రాణం పోసి అద్భుత రాతి శిలలను ఆవిష్కరిస్తున్నారు. ఆలయ గోపురాలు, ప్రాకార మండపాలు, రాతి శిలా స్తంభాలుగా ఆవిష్కరిస్తున్నారు. యాదాద్రికొండపై ప్రధానాలయ ప్రాంగణంలో సాగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతితో ఆలయం రోజుకో కొత్తరూపుతో సందర్శకులను అలరిస్తోంది. ఏడాది చివరి నాటికి గర్భాలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే సంకల్పంతో ప్రధానాలయ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా ప్రధానాలయ ముఖమండపానికి దాదాపు 13, 800 చదరపు అడుగుల స్లాబ్ నిర్మాణం పూర్తి చేయడంతో ఆలయ పునర్నిర్మాణంలో కీలకఘట్టం పూర్తి చేశారు. యాదాద్రి దివ్యక్షేత్రానికి శిల్పశోభను సంతరింపజేసే సప్తగోపురాల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఐదు తలల ఉత్తర, తూర్పు రాజగోపురాలు తుది దశకు చేరుకుని శిఖర పనులకు మెరుగులు దిద్దుకుంటున్నాయి. తూర్పు రాజగోపురం పనులు పూర్తి చేసి, శిల్పాలను అమర్చే పనులు ప్రారంభించారు. ఏడంతస్తుల మహారాజగోపుర నిర్మాణ పనులు సాగుతున్నాయి. అదేవిధంగా గర్భాలయంపై విమానగోపుర నిర్మాణ పనుల్లో వేగం పెంచారు.
బాలపాద స్తంభాలకు తుది మెరుగులు దిద్దుతున్న శిల్పులు
ప్రధానాలయ గోపురాల ఐదంతస్తుల నిర్మాణం పనులు పూర్తి
దేశంలోనే అత్యద్భుత ఆలయంగా రూపుదిద్దుకుంటున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఇప్పుడు జరుగుతున్న ప్రధానాలయ గోపురాల ఐదంతస్తుల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఐదు అంతస్తుల్లో నిర్మాణం జరుపుకున్నుఉత్తర గోపురానికి అమర్చడానికి విగ్రహాలను సిద్ధం చేశారు. గోపురానికి ముందు భాగంలో పది ద్వారపాలకుల విగ్రహాలు, ఐదు రాజ విగ్రహాలు, వెనుకభాగంలో పది ద్వార పాలకుల విగ్రహాలు, ఐదు రాజ విగ్రహాలు, నాలుగు సైడ్‌లలో 8 సింహలు అమర్చనున్నారు. వైష్ణవ సంప్రదాయం ఉట్టిపడే విధంగా గోపురాలకు రూపమిస్తున్నారు. దివ్యవిమాన గోపురం పనులను ఇప్పటికే ప్రారంభించిన ఇంజనీర్లు, స్తపతులు ప్రధానాలయానికి అత్యంత ముఖ్యమైన ముఖమండపం స్లాబ్ పనులు పూర్తయ్యాయి. గర్భాలయ మట్టానికి 36 అడుగుల ఎత్తు సుమారు 20, 000 స్క్వేర్ ఫీట్ల వెడల్పులో స్లాబ్‌ను వేసిన ఇంజనీర్లు…స్తపతులు రాత్రింభవళ్లు వందలాది మంది కూలీలు చేసిన పనులు ప్రధానాలయానికి ఒక రూపునిచ్చాయి.
రాత్రింబవళ్లు శ్రమిస్తున్న స్తపతులు, ఉప స్తపతులు
ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా…
ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ, టెంపుల్‌సిటీ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రతీ 15 రోజులకోసారి పర్యవేక్షిస్తుండటంతో నిర్మాణం పనులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆలయ ప్రణాళికలతో పాటు పనుల పురోగతిపై సీఎంఓ ప్రత్యేక చర్యలు చేపట్టింది. విశాలమైన మాఢవీధులు, అంతర్, బాహ్య రెండు ప్రాకారాలు, సప్తగోపురాలు, ఆధారశిలల నుంచి శిఖరం వరకు నల్లరాతి కృష్ణశిలలతో అద్భుతమైన శిల్పకళా సౌరభాల శిల్ప నిర్మాణాలతో ప్రాచీన కాకతీయుల, తంజవూరు శిల్ప సంప్రదాయం మేళవింపుగా చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విమానగోపురం మొదటి అంతస్తు కర్ణకూటపు పనులు పూర్తయ్యాయి. ప్రధానాలయం ఆళ్వార్ ముఖమండపం పైకప్పు పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేశారు. గోపుర నిర్మాణంలో ముఖ్యమైన లలాటనాస నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఉత్తర గోపురంపై కప్పు నిర్మాణం కోసం కపాల శిలాఫలాకాన్ని అమర్చారు. దాదాపు 14 టన్నుల బరువుగల ఈ శిలఫలకాన్ని భారీ క్రేన్లతో సహయంతో అమర్చారు. ఈ కఫాల ఫలకం అమర్చడంతో గోపురం ముఖ వర్చస్సుకు శిల్పాలు చెక్కడం మొదలైన పనులు శిల్పులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కపాల ఫలకం అమర్చిన ఉత్తరగోపురంతో పాటు తూర్పురాజగోపురం నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. గోపురాలకు అమర్చాల్సిన విగ్రహాల పనులు కొనసాగుతున్నాయి.