యాదాద్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులు రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి మరిన్ని దర్శనీయ క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. ఇన్నేళ్లు మరుగున పడిన మన ఆలయాలు…పర్యాటన ప్రాంతాలు రాష్ట్ర ఏర్పాటుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యాదాద్రి తలాపునే కోటిలింగాలకు కొలువై దక్షిణ కాశీగా పేరుగాంచిన కొలనుపాక సోమేశ్వరాలయం, జైనులు అత్యంత పవిత్రంగా పూజలు చేసే జైన్ మందిర్ కూడా యాదాద్రికి 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి. మరింకేందుకు ఆలస్యం యాదాద్రి నర్సన్నను కొలిచిన తర్వాత మన భువనగిరి ఖిల్లా…అట్నుంచి మత్య్సగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడా చూసొద్దం పదండి మరి…!!
తెలంగాణకు తలమాణికం యాదాద్రి
తెలంగాణకు తలమాణికమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి దివ్యక్షేత్రం మహిమాన్వితమై విరాజిల్లుతోంది..యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు జరిపితే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. రాష్ట్ర రాజధానికి అతి చేరువలో వెలసిన యాదాద్రి క్షేత్రంలో భారీ సంఖ్యలో భక్తులు పూజలు జరిపించుకుంటారు. రాష్ట్రంలో యాదాద్రికొండపైనే అతి ఎక్కువగా సత్యనారాయణస్వామి వారి పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా లక్షకుపైగా వ్రతాలు జరుగుతున్నాయంటే…ఈ క్షేత్ర విశిష్టత ఏమిటో అవగతమవుతుంది. వ్రత పూజల విశిష్టత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ మేరకు వ్రతం కోసం అన్ని హంగులతో కూడిన విశాలమైన మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంటపంలో సామూహికంగా ఒకేసారి 250 జంటలు వ్రత పూజలు నిర్వహించవచ్చు. భక్తులు కేవలం రూ. 516 చెల్లిస్తే చాలు పూజా సామాగ్రిని ఆలయాధికారులు సమకూర్చుతారు. ఉదయం 7:గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రోజుకు నాలుగు పర్యాయాలుగా వ్రత పూజలు జరుగుతాయి. సెలవులు, విశేషదినాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా వ్రతపూజలు నిర్వహిస్తారు.
యాదాద్రిలో కొలువుదీరిన పరమశివుడి ఆలయం…!
యాదాద్రిపైన శివాలయం వేలాది మంది భక్తులతో అలరారుతోంది. యాదాద్రికొండ శివకేశవులకు నెలవుగా మారింది. నిత్యపూజలకు తోడు ఒకవైపు శ్రీమహావిష్ణువు, మరోవైపు శివుడు యాదాద్రిని పుణీతం చేస్తున్నారు. యాదాద్రిని దర్శిస్తే శివకేశవులిద్దరిని దర్శించే భాగ్యం కలుగుతుండడంతో భక్తులు యాదాద్రి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతీఏటా భారీ ఎత్తున శివాలయంలో పూజలు చేయిస్తున్నారు. శ్రీకాళహస్తిలో నిర్వహించే రాహుకేతు పూజలు ఇప్పుడు యాదాద్రి శివాలయంలో నిర్వహిస్తున్నారు. గతంలో రాహుకేతులకు పూజలు జజరింపించుకోవాలంటే ఆంధ్రాలోని శ్రీకాళహస్తికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు యాదాద్రిలోనే అన్ని పూజలు సమకూరుతున్నాయి.
పెండ్లిల్ల దేవునిగా పాతగుట్ట
పాత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం యాదగిరిగుట్టకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత పురాతమైన ఈ దేవాలయాన్ని యాదాద్రి దేవస్థానం దత్తత తీసుకుని అభివృద్ధి చేసింది. ప్రతిరోజు యాదాద్రిని దర్శించిన భక్తులు పాతగుట్టను కూడా దర్శించుకుంటున్నారు. ఏటా రెండు కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే స్ధాయికి ఆలయం చేరుకున్నది. వ్రతపూజలు, నిత్యకల్యాణాలు యాదాద్రిలో జరిగే అన్ని పూజలు పాతగుట్టలో జరుగుతున్నాయి. పెండ్లిల్ల దేవునిగా పాతగుట్ట ప్రసిద్ధి చెందింది. ఎవరైనా పెండ్లి కానివారు ఇక్కడికి వచ్చి పూజలు చేసి పెండ్లి కావాలని మొక్కుకుంటే తథాస్తు అంటూ శ్రీలక్ష్మీనరసింహుడు దీవిస్తాడని తిరిగి కొత్త పెండ్లి జంట ఇక్కడికి వచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. దాంతో పాతగుట్టకు పెండ్లిల్ల దేవునిగా పేరు వచ్చింది.
ఆపద మొక్కులవాడు వెంకటాపురం నరసింహుడు
ఆపద మొక్కుల వాడిగా వెంకటాపురం నరసింహుడికి పేరుంది. పురాణకాలంలో వెంకటాపురం గిరిపై రుషులు తపస్సు చేసినట్లు, దానికి మెచ్చిన శ్రీలక్ష్మీనరసింహుడు జ్వాలారూపంలో వారికి దర్శనమిచ్చినట్లు పురాణాల ఆధారంగా తెలుస్తోంది. తుర్కపల్లి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇరుకైన కొండగుహలో జ్వాలా నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. యాదగిరిగుట్టకు పది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంది. యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుడు అలసి సొలసి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాడని కొంతమంది భక్తుల నమ్మకం. ఎంతో పురాతనమైన ఆలయాన్ని చేరుకోవడానికి యాదాద్రి నుంచి ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి.
రాయగిరి వేంకటేశ్వరుడు…
రాయగిరిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు. రాయగిరి స్టేషన్ వద్ద గల గుట్టపై శేషశయనంపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్యవిమాన గోపురాన్ని చూపిస్తుంది. విశాలమైన కొలను ఇక్కడి ప్రత్యేకత. అనంత పద్మస్వామిని పోలిన విగ్రహాం ఇక్కడ దర్శనమిస్తున్నది. అత్యంత ప్రాచీనమైన ఆలయం ఇది. రాయగిరి స్టేషన్ పక్కనే ఇది ఉండటం విశేషం.
ప్రఖ్యాతి గాంచిన కొలనుపాక జైనమందిరం..
కాకతీయుల కాలంలో ప్రసిద్ధినొందిన దివ్యస్థలం కొలనుపాక. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జైనుల ఆలయం తలమానికంగా ఉన్నది. జైనుల రెండో ఆరాధ్యక్షేత్రంగా విరాసిల్లుతుండటంతో ప్రపంచం నలుమూలాల నుంచి ఇక్కడికి జైన మతాన్ని విశ్వసించే భక్తులు వస్తుంటారు. ఇటీవలనే కోట్ల రూపాయలు వెచ్చించి రాజేంద్రసూరి జైన్ మందిర్‌ను కూడా నిర్మాణం చేశారు. దీన్ని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆసియా ఖండంలోనే ఇక్కడ ఉన్న జైనుల ఆలయం ప్రసిద్ధి చెందినది. దక్షిణ కాశీగా పేరుగాంచిన కోటిలింగాలకు నెలవైన సోమేశ్వరాలయం కూడా ఇక్కడ ఉన్నది. శివుడు ఇక్కడ కొలువుదీరి ఉన్నట్లు శివపురాణంలో పేర్కొనబడి ఉంది. అంతేగాకుండా వీరనారాయణస్వామి ఆలయం కూడా అత్యంత పురాతమైంది. యాదగిరిగుట్ట నుంచి కొలనుపాకకు 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.
వేములకొండ మత్స్యగిరి…
యాదగిరిగుట్టకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములకొండపైన నరసింహస్వామి ఆలయం కొలువుదీరి ఉంది. కొండపైన విష్ణు పుష్కరిణిలోని చేపలకు నామాలు ఉండటం విశేషం. జిల్లాలో రెండో యాదాద్రిగా మత్స్యగిరి వెలుగొందుతుంది. కొండపైకి చేరుకోవడానికి ఘాట్‌రోడ్డును ఏర్పాటు చేయడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వేములకొండకు తరలివస్తున్నారు. దుకాణాలు కూడా బాగానే వెలిశాయి. స్వామి దర్శనం అనంతరం ఇక్కడ గల చెట్టు కింద వంటలు చేసుకుని భోజనాలు చేసి ఇండ్లకు చేరుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
భువనగిరి ఖిల్లా…
తూర్పు చాళుక్య రాజైన త్రిభువన మల్లుడు ఏకశిల కొండపై నిర్మించిన భువనగిరి ఖిల్లా చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్నది. కోట సందర్శనకు రాజధాని నగరం నుంచి విశేష సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఏకశిల కావడంతో భువనగిరి ఫోర్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా గుర్తించింది. భువనగిరి ఖిల్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి చెందిన పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రాక్‌క్లైంబింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం ఇక్కడి విద్యార్థులు అన్నపూర్ణ, ఆనంద్‌లు ఎవరెస్టు శిఖరంను అధిరోహించడంతో ఖిల్లా మారుమ్రోగింది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ఎవరెస్టును అధిరోహించడంతో శిక్షణ పొందే విద్యార్ధుల సంఖ్య కూడా పెరిగింది. విదేశీ టూరిస్టులు ఇప్పుడు విశేషంగా సందర్శిస్తున్నారు.
సురేంద్రపురి…
ఈ మధ్య కాలంలో నిర్మించిన ఆధునాతన ఆలయాలు, అతి పెద్ద హన్మంతుడు, శివుడి విగ్రహాం ఇచ్చట చూడదగ్గది. శిల్పకళకు ప్రసిద్ధి. ఈ పౌరాణిక విజ్ఞాన కేంద్రం సందర్శనకు రూ. 650 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రామాయణంలోని బొమ్మలకొలువు మాదిరిగా చూడచక్కని శైలితో తయారు చేసిన కళారూపాలు ఆకట్టుకుంటాయి.
లోటస్ టెంపుల్…
యాదగిరిగుట్టలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పులిగిల్ల బాలరాజు ఎంతో శ్రమించి శక్తికి మించిన కృషికి ఫలితంగా లోటస్ టెంపుల్ నిలుస్తున్నది. ఇంద్రలోకం, రుతువులు, ఆదిపరాశక్తి కొలువుదీరిన స్వర్ణలోకం తదితర లోకాలను కళ్లకు కట్టినట్లు రూపొందించడంలో శిల్పి రాజేందర్ చూపిన చొరవ ప్రశంసనీయం. ఇక్కడ నామమాత్రపు రుసుముతో దర్శనం చేసుకునే అవకాశం ఏర్పాటు చేశారు.
యాదాద్రికి రవాణా సౌకర్యాలు…
హైద్రాబాద్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు రావడానికి అక్కడి నుంచి ప్రతి గంటకోసారి బస్సులు ఉంటాయి. ఇవేగాకుండా వరంగల్, హన్మకొండ డిపోల నుంచి విశేష సంఖ్యలో బస్సులున్నాయి. యాదగిరిగుట్ట డిపో నుంచి జిల్లాలోని అన్ని డిపోలకు బస్సులు ఉన్నాయి. రైలు ప్రయాణికులు రాయగిరి రైల్వే స్టేషన్‌లో దిగి ఇతర వాహనాల్లో గుట్టకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి హైద్రాబాద్ మార్గంలో ఈ స్టేషన్ ఉన్నది. దేవస్థానానికి చెందిన మినీ బస్సులు గుట్ట బస్టాండ్ నుంచి 10 నిమిషాలకోసారి కొండపైకి సిద్ధంగా ఉంటాయి. బస్‌స్టేషన్ సమీపం నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఆటోలు సిద్ధంగా ఉంటాయి. పాతగుట్టకు టాంగా ప్రయాణం మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. భువనగిరికి కేవలం 12 కిలోమీటర్ల దూరం, ఇక్కడ అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి.
యాదాద్రికొండపై దర్శనీయ స్థలాలు…
విష్ణుపుష్కరిణి : యాదున్ని రక్షించిన సుదర్శనుడు…పుష్కరిణిలో స్నానం చేసిన భక్తుల గ్రహబాధలు తొలగిస్తాడని భక్తుల నమ్మకం. బ్రహ్మ శ్రీవారిని సేవించి పాదాలు కడుగగా, ఆ మండల తీర్థమే పుష్కరిణిగా ఏర్పడి మహిమాన్వితమైనదని చరిత్ర చెబుతోంది.
బాపట్ల లక్ష్మీకాంతయ్య సంగీత భవనం…
180 సంవత్సరాల క్రితం కీ.శే.బాపట్ల లక్ష్మీకాంతయ్య ప్రారంభించిన ధార్మిక సభలు నేడు రాష్ట్రస్థాయికి ఎదిగాయి. రాష్ట్రం నలూమూలల నుంచి ఇక్కడికి కళాకారులు విచ్చేస్తుంటారు. సాహిత్య, సంగీత, నృత్యోత్సవాలు , సంగీత గోష్టులు నిర్వహిస్తారు.
సంస్కృత విద్యాపీఠం :
అస్తికతను బోధించే ఉద్దేశ్యంతో 65 ఏళ్ల క్రితం దేవస్థానం వారిచే స్థాపించబడి రాష్ట్రంలో తలమాణికమైన విద్యాపీఠంలో 8వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు ఉచిత విద్య, బోధన సౌకర్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.
శ్రీవారి పాదాలు :
మెట్ల మార్గంలో శ్రీవారి పాదాలు దర్శించుకుంటే ముక్తిదాయకమని భక్తుల నమ్మకం. శ్రీనారసింహుడు యాద మహర్షికి ప్రత్యక్షమైన తర్వాత వేసిన అడుగులుగా వీటిని చెబుతారు. వీటిని దర్శించుకుంటే ముక్తి దాయకమని భక్తుల నమ్మకం.