నాడు మహిమాన్విత యాదగిరి క్షేత్రం
నేడు యాదాద్రిగా ప్రపంచ పర్యాటక కేంద్రం
యాదగిరిగుట్ట పునర్నిర్మాణ చరిత్ర పై ఓ ప్రత్యేక వ్యాసం…!!
(శ్రీపాద శివ ప్రసాద్, కవి, విమర్శకులు సెల్ 897 8835919)
*1) కృత.. త్రేతా.. ద్వాపర.. కలియుగాల సమ్మిళితమైన చరిత్ర కలిగి.. విభండక మహర్షి పౌత్రుడు.. శాంత, రుష్యశృంగుల పుత్రుడు అయిన యాద మహర్షి తపోఫలితంగా మహా మహిమాన్వితమై.. జ్వాలా.. ఉగ్ర.. గండబేరుండ.. యోగానంద.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గా పంచరూప నారసింహక్షేత్రంగా ఉద్భాసితమై విరాజిల్లుతున్నది ఈ యాదగిరిగుట్ట దేవాలయం.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తదేక దీక్షతో, మండల ప్రదక్షిణలతో లక్షలాదిమంది భక్తులు దీర్ఘకాలికమైన శారీరక, మానసిక రుగ్మతలను తొలగించుకోవడం ఈ దేవాలయం ప్రాశస్త్యం.
- 2) ఇక్కడకు వచ్చే గ్రామీణ ప్రజలంతా అనాదిగా స్వామి వారి పాదాలకాడ (ఈ గుట్టకు తూర్పు దిక్కున ఉన్న కొండ వాలులో) జంతు బలిని నైవేద్యంగా ఇవ్వడం ఆచారంగా ఉంది. జానపదులకు కొంగుబంగారమై, పల్లెజనాలకు నరసన్న దేవుడైనాడు. దాదాపు 100 సంవత్సరాలుగా దినదిన ప్రవర్థమానమౌతూ ప్రపంచవ్యాప్తంగా, కులమతాలకు అతీతమై భక్తజనహృదయాలలో యాదగిరి గుట్టగా, జానపద క్షేత్రంగా భాసిల్లుతుంది. గత శతాబ్ద కాలంగా ఎన్నో మార్పులను చెందింది. ఈ గుట్టను నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవనోపాధులను ఏర్పరచుకోవడంతో ఈ గుట్టను ఆనుకొని ఉన్న యాదగిరి పల్లి, గుండ్లపల్లి గ్రామాలను కలుపుకొని యాదగిరిగుట్ట ఓ ప్రత్యేక గ్రామంగా 100 సంవత్సరాలకు మించిన చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకుంది.
- 3) తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, 2016 ఏప్రిల్ లో అప్పటి వరకూ ఉన్న ఈ గుట్ట గుడినీ, దేవాలయానికి అనుసంధానమైన అన్ని నిర్మాణాలను, గుట్ట చుట్టూతా ఆనుకొని ఉన్న అన్ని ప్రైవేటు స్థలాలనూ, గృహనిర్మాణాలనూ సమూలంగా నిర్మూలించారు.
- 2016 తర్వాత నల్లరాతి కట్టడాలతో.. యాదాద్రి గా పునర్నిర్మాణం జరుపుకుంటున్నది. ఈ వ్యాసం వ్రాసే నాటికి (01.09.2021) ఇంకా ఈ కొత్త గుడి నిర్మాణాలు పూర్తికాలేదు. తెలంగాణా తిరుపతిగా పిలుచుకునే ఈ యాదగిరిగుట్ట ప్రపంచవ్యాప్తంగా యాదాద్రిగా నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ యాదగిరి గుట్ట యాదాద్రి గా మార్పు చెందుతున్న సందర్భంగా జరుగుతున్న మార్పుల నేపథ్యాన్ని అనుసరించి వ్రాసిన వ్యాసమే ఇది.
- 4) ప్రకృతి రూపమైన.. జానపదుల దైవమైన.. మా నరసన్న దేవుడు.. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహుడు. వందలాది సంవత్సరాల కాలగమనంలో బీజం మొలకగా, మొలక చెట్టుగా, చెట్టు మహా వృక్షంగా, ఆ మహా వృక్షం అనితరసాధ్యమైన పచ్చని ప్రకృతిగా, జీవపరిణామక్రమం మాదిరిగా, మెల్లిమెల్లిగా ఎన్నో మార్పులు చెందుతూ, ఓ మహోన్నత రూపాన్ని సంతరించుకుంది ఈ దేవాలయం. అలాంటి శతాబ్దాల ప్రకృతి రమణీయతను ఒక్క వేటుతో కూలదోసిన విశృంఖలత్వానికి నిదర్శనమే ఈ పునర్నిర్మాణం.
- 5) కన్నుపోయే కాటుక పెట్టుకుంటారా..!? మా దగ్గర పెట్టినారు..! పెట్టుకున్నరు..!! బంగారు కత్తి అని మెడ కోసుకుంటారా..!? మా దగ్గర కోసినారు..!కోసుకున్నరు..!! వాపును చూసి బలుపు అనుకుంటారా..!? మా దగ్గర అనుకున్నరు..! అనుకునేటట్లు చేసినారు..!! కొండ నాల్కకు మందేసి ఉన్న నాల్క ఊడగొడ్తారా..!? మా దగ్గర అలాంటిదే చేసినారు..!! దీపం కింద చీకటి ఎట్లుంటదో తెలుసుకోవాలంటే..!? ఇప్పుడు మా ఊర్లెకొచ్చి బతికితే తెలుస్తుంది..! అలా తెలిసేటట్లు చేసినారు..!! ఇవన్నీ ఎక్కడనో కాదు..!?!? ప్రపంచ ప్రఖ్యాతి అంటూ.. ఢంకా బజాయించి ప్రచారం జరుపుతున్న మా యాదగిరిగుట్టలోనే.
- 6) ఒకనాడు యాదగిరి గుట్ట పేరుతో మాత్రమే ప్రచారంలో ఉన్న మా దేవున్నీ, మా ఊరునూ, మాకు కాకుండా చేసినారు. యాదాద్రి పేరుతో ఎన్నటికీ తీరనీ, తీర్చలేని సమస్యల పుట్టగా మార్చినారు. కొండపైన మహాద్భుత కట్టడం గొప్పతనంలోని ఆ నిజమెంతో..!? ఆ నరసింహస్వామికే ఎరుక..!
- 7) వచ్చే యాత్రికులకు కనీస అవసరాలను కూడా ఏర్పాటు చేయలేకపోవడమే ఇందుకు ప్రత్యక్ష ప్రధాన నిదర్శనం. పైరవీలుకానీ, పెద్ద పెద్ద పరిచయాలుకానీ, దళారులకు అంతో ఇంతో వేలాదిగా రూపాయలు సమర్పించుకోవడంకానీ.. లేకపోతే..!? యాదగిరి గుట్ట గుడిలోపల దర్శనం అంత ఈజీగా కాదు. ఏ ఒక్క పైరవీ లేకుండా, అడ్డదిడ్డంగా ఖర్చులు పెట్టుకోకుండా, ఆ దేవుని దర్శనం చేసుకోవడం అనేది ఇక్కడ సుసాధ్యమైన అంశం కానేకాదు. ఈ విషయంలో మాత్రం ఆ తిరుపతిని మించిపోయింది మా యాదాద్రి.
- 8) యాదాద్రిలో ఏదో మస్తుగ వెలిగిపోతుంది అనుకుంటూ శని, ఆదివారాలతో పాటు ఇతరత్రా సెలవు దినాలలో లక్షలాది జనాలు తండోప తండాలుగా వస్తూనే ఉన్నారు. నిజానిజాలేమిటో ఇక్కడకు వచ్చిన తర్వాతనే ఆ భక్తులకు అర్థమౌతుంది. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయల దరిద్రం ఏవిధంగా తాండవిస్తుందో..!? వచ్చి చూస్తేకానీ ఎవ్వరికీ అర్థం కాదు. ఒకసారి వచ్చిన భక్తులు పొరపాటున కూడా మళ్ళీ ఇంకోసారి రావడానికి అయోమయంలో పడిపోతారు. నవరంధ్రాలు అన్నీ మూసుకొని దేవుని మీద భక్తితో మాత్రమే వచ్చిపోవాలనే పరిస్థితులను, వారూ వీరూ అనే కాదు అందరూ కలిసి ఇక్కడ ఈ దుస్థితిని కల్పించారు. మెల్లకన్ను సరిచేయబోయి ఉన్న కన్నును ఊడబీకి గుడ్డితనం అంటగట్టినట్లుగా ఐపోయింది నేడు మా యాదగిరి గుట్ట.
- 9) సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు టాయిలెట్లు, మంచినీరు, వసతిగృహాలు, దర్శనంలైన్లు, ప్రసాదాలకౌంటరు, విచారణకార్యాలయాలు, శివాలయం వెళ్ళే దారి ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. ఇక్కడ అన్నీ అగమ్యగోచరమే. భక్తుల మొక్కు చెల్లింపుల స్నానాలకై గుండం లేకపోవడం, అననుకూలమైన కళ్యాణ కట్ట, సత్యనారాయణ వ్రతమండపశాల సమస్యలు, వర్షాలు వస్తే బురదమయమైన దారులు, ఎండలు బాగా ఉంటే నిలువ నీడలేని పరిస్థితులు. వృద్ధులు, వికలాంగులకు ఇప్పుడున్న గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడమంటే నరకప్రాయమే. దేవాలయానికి పోయే దారులన్నీ రాళ్లు రప్పలతో నిండిపోవడం. ఇక్కడ ఏ అధికారినీ, ఏ నాయకుడినీ, అడిగినా..!? ఒకే ఒక్క సమాధానం గుడి నిర్మాణం జరుగుతుంది. ఇలా కాకుండా..!? ఎలా ఉంటుంది అనీ..!? కొండకింది నుండి కొండపై దాకా వైతరిణీనదిలాంటి ఇక్కట్లతో కూడి ఉంది నేడు యాదాద్రి. ఇలా ఒక్కో భక్తునికి శతకోటి సమస్యలను సృష్టించే విధంగా తయారు చేశారు యాదాద్రిని. ఇక నిర్మాణాల విషయానికి వస్తే కట్టడం కూల్చడంలో కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల బొక్కసాలు నింపడంలో ఈ యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతమైన లాభసాటిగా సాగుతుందని చెప్పవచ్చు.
- 10) యాదాద్రి గా పేరు మారుమోగుతుండడంతో.. జనాలు విపరీతంగా వస్తున్నారు.. దీంతో.. దేవస్థానం ఆదాయం విపరీతంగా పెరిగింది. కొండపైన ఎందరెందరికో..!?!? ఎంతటి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలకైనా దొరకనంతగా భక్తుల నుండి పరోక్షంగా పైపై రాబడీల పైకం ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతుంది. లాటరీ టికెట్ల మాదిరిగా రకరకాల పేర్లతో దేవస్థానం ఆదాయం పెంచుకోనీకి అన్ని టికెట్ల ధరలనూ పెంచుతూ యాత్రికుల నెత్తిన నిండుగా శఠగోపం పెడుతున్నారనేది నిజమైన భక్తుల ఆవేదన. కానీ.. భక్తులకు మాత్రం కనీస వసతులు కల్పించాలనే ధ్యాస ఏమాత్రమూ లేకుండా ఈ పునర్నిర్మాణం వీరికి ఓ అదృష్టంగా మారిపోయింది.
- 11) సాక్షాత్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే దిగివచ్చి ధనం కావాలా..!? దైవం కావాలా..!? అని అడిగితే..!? కడుపులనిండా తరతరాలకూ పొర్లిపోయేలా ధనమే కావాలని మనసులో కోరుకుంటూ.. పైకి మాత్రం బొట్లూ బోనాల వేషాల పటాటోపపు స్తోత్రాల ఆడంబరాలతో దేవుడా నీవే దిక్కూ అంటూ.. దేవుడికే బురిడీ కొట్టించే మాబోటి జనాల గుణాల తగ్గట్టుగానే..!? నేడు కేవలం ప్రపంచ పర్యటన స్థలంగా మారిపోయింది. ఒకనాడు మహామహిమాన్వితమైన గుహాంతర్భాగ నారసింహ క్షేత్రంగా విరాజిల్లిన యాదగిరి గుట్ట, నేడు ఆ వైభవాన్ని సాంతం కోల్పోయిందనడానికి దేవుడనే సెంటిమెంట్ అడ్డువస్తుంది.
- 12) యాదగిరి గుట్ట కింద పాదాల దగ్గర అనాదిగా భక్తులు తమ మొక్కలు చెల్లించుకోవడానికి మేకలను, పొటేళ్ళను స్వామి వారికి ప్రసాదంగా బలి ఇచ్చే విధానం ఉంది. ఐతే..!? నేడు యాదాద్రి రింగ్ రోడ్ పేరుతో యాదగిరి గుట్టకు మూలస్థానమైన ఆ దేవునిపాదాల దారినే తొలగించినారు. ఆ పాదాల దగ్గర మొక్కులు చెల్లించుకునే వీలులేకుండా చేశారు. ఈ పాదాల దగ్గరకు పోవడానికి భక్తులు పడుతున్న యాతన అంతా ఇంతా కాదు. మా యాదగిరి గుట్టకు అనాదిగా, వచ్చిన భక్తులే మళ్ళీ మళ్ళీ యేడాదికి రెండుమూడు సార్లైనా వస్తూ ఉంటారు. అలాంటిది ఒక్కసారి వస్తే మళ్ళీ రావడానికి నేడున్న పరిస్థితులకు భయపడిపోతున్నారు.
- 13) పునర్నిర్మాణా దశలోని ఎన్నో కూల్చివేతలు జరుగుతున్నాయి. వాటిల్లోంచి ఓ చిన్న ఉదాహరణ యాదాద్రి రింగ్ రోడ్ లో భాగంగా పాత గోషాల ప్రక్కన, నల్లపోచమ్మవాడ వెనుక ప్రాంతంలోని అంజనీపురం కాలనీలో దాదాపుగా వందకు పైగా ఉన్న కొత్త కొత్త గృహాలను ఈ పునర్నిర్మాణంలో భాగంగా తీసుకున్నారు. ఆ గృహాలకు లక్షలాది మొదలు కోట్లాది రూపాయలు చెల్లించారు. ఐతే..!? ఆ కాలనీలోని గృహాలన్నింటినీ భక్తుల సౌకర్యార్థం వినియోగించుకోకుండా, ఎంతో మంచిగా ఉన్న ఆ ఇండ్లన్నింటినీ కూలగొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యాదాద్రి పునర్నిర్మాణంలో దేవుని గుడి పేరు చెప్పి కోట్లాది ప్రజాధనం కాంట్రాక్టర్లకు దారి మళ్లుతుందనేది ఇక్కడున్న ఏ సామాన్యునికైనా ఇట్టే అర్థమౌతుంది.
- 14) ఇకపోతే., యాదగిగుట్ట కింద మెయిన్ రోడ్డు మొదలు ఇటు యాదగిరిపల్లి వరకు, అటు తులసీ కాటేజీ రోడ్డు దాకా, యాదగిరి గుట్ట పట్టణం మొత్తం ఆగమాగం ఐపోయింది. మెయిన్ రోడ్డు నుండి రెండు భాగాలుగా విభజిస్తూ గోడలతో కడుతూ వేస్తున్న ఫ్లై ఓవర్ రోడ్డు తో యాదగిరి గుట్ట.. East Yadagiri Gutta & West Yadagiri Gutta గా నిర్దాక్షిణ్యంగా చీల్చబడింది. ఈ యాదాద్రి టెంపుల్ రింగ్ రోడ్ నిర్మాణం కారణంగా ఊరుకు ఏ సంబంధం లేకుండా చైనావాల్ మాదిరిగా ‘యాదాద్రి వాల్’ నిర్మాణం చేసినారు. కొండ కింద హనుమాన్ గుడిని మార్చవద్దన్న ఒకే ఒక్క కారణాన్ని బూచీగా చూపి, గుట్ట చుట్టూ గడికోట మాదిరిగా గోడ నిర్మాణం చేశారు. దీంతో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన యాదగిరి గుట్ట ఊరు మొత్తం సర్వనాశనం అయ్యింది. ఊరులోని జనాల బతుకులెన్నో ఆగమాగం అయినాయి.
- 15) యాదగిరి గుట్ట మునిసిపాలిటీగా ఏర్పడిన తర్వాత, మేజర్ గ్రామపంచాయతీగా ఉన్నదానికంటే మరింత అధ్వాన్నంగా చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిపోయింది. మెయిన్ రోడ్డు మొదలు అన్ని వీధులన్నీ సమస్యలతో నిండిపోయాయి. పునర్నిర్మాణం సాకును చూపి గుట్ట మునిసిపాలిటీ చేతులెత్తేసింది. యాదగిరిగుట్ట మునిసిపాలిటీలోని కొత్త పాత గుండ్లపల్లి గ్రామాలు, శ్రీరాంనగర్, బి.సి.కాలనీ, మెయిన్ రోడ్డు, గణేశ్ నగర్, వికలాంగుల కాలనీ, ప్రశాంత్ నగర్, లోటస్ టెంపుల్ ఏరియా, చెక్ పోస్ట్ ఏరియా, శివాజీరోడ్ ఏరియా, సుభాష్ నగర్, బి.సి. కాలనీ, గాంధీనగర్, నల్లపోచమ్మవాడ, మసీదు ఏరియా, యాదగిరిపల్లి ఇలా యాదగిరి గుట్ట చుట్టుపక్కల ప్రాంతాలలోని వేలాది కుటుంబాలన్నీ గుట్ట కు వచ్చే యాత్రికులమీద మాత్రమే ఆధారపడి బతుకులు సాగిస్తున్న వారందరి జీవనోపాధిపై కర్కశంగా, అమానవీయంగా, పాశవికంగా ఈ యాదాద్రి పునర్నిర్మాణం కోలుకోలేని దెబ్బతీసింది.
- 16) 2016 ఏప్రిల్ వరకు అనగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాకమునుపు యాదగిరి గుట్ట దేవాలయం దాదాపుగా అన్ని సౌకర్యాలతో కూడి ఉంది. నిత్య పూజాదికాలకు సంబంధించిన అన్ని అవకాశాలూ ఇక్కడ ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం దాదాపుగా 70 శాతంకు పైగా వసతులూ ఉన్నాయి. ఎప్పటి అవసరాలకు తగినంతగా అప్పుడు ఎందరో దాతలు భక్తిప్రపపత్తులతో తమ విరాళాలతో దేవాలయ పరిసరాలను నిత్యనూతనం చేస్తూనే ఉన్నారు. అలాంటి దేవాలయాన్ని ఇంకా మెరుగుగా, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొన్ని రకాల అత్యవసర మార్పులు చేస్తే సరిపోయేది. ఐతే.. గత 50 సంవత్సరాలకు పైగా కాలానుగుణంగా ఎప్పటికప్పుడు ఈ యాదగిరిగుట్ట దేవాలయం నిత్య నూతనంగా మార్పులను సంతరించుకుంటూనే ఉంది. 2016 వరకు ఎంతో పటిష్ఠంగా ఉన్న ఈ దేవాలయాన్ని, లక్షలాది, కోట్లాది రూపాయలను విరాళాలుగా ఇచ్చిన దాతల సహకారంతో చేపట్టిన కొత్త కొత్తగా ఉన్న నిర్మాణాలను అన్నింటినీ ఏకధాటిగా కూల్చేసినారు. ఇటు నిత్య పూజలకూ, అటు భక్తులకూ నానా ఇబ్బందులూ, అగచాట్లూ కలిగే దుస్థితిని తీసుకువచ్చారు. ఈ పునర్నిర్మాణం కారణంగా మొత్తానికి మొత్తం అటు కొండ పైనా, ఇటు కొండ కిందా ఇక ఎన్నడూ కోలుకోలేని విషమ పరిస్థితులలోకి కూరుకుపోయింది ఈ యాదగిరిగుట్ట.
- 17) ఈ పునర్నిర్మాణం పేరుతో.. కొండపైనా.. కొండ కిందా.. చెడగొట్టి శనిగలు అలికినారు. ఇక మిగిలింది అలిగిన ఆ శనిగలను ఏరుక తినడమే. నేటి ఈ యాదాద్రి గతంలోని యాదగిరి గుట్టగా, ఓ మాదిరి వ్యాపార స్థలంగా మళ్ళీ దారిలోకి రావడానికి సుమారు ఇంకా ఓ ఇరవై ఏండ్ల కాలం పడుతుంది. దీంతో ఓ మూడు తరాల తలరాతలు తారుమారైనట్లే.. 60/40/20 ఏండ్లకు సంబంధించిన మూడుతరాల బతుకులు ఆగమైనట్లే. ఇది అస్సలు అబద్ధం కాని అసలు సిసలైన నిజం. ఇది ఎందరికో అర్థం కాని అగమ్యగోచరమైన మాయాజాలం.
ఐనా..!? ఐదేండ్ల కాల పరిమితి కలిగిన ప్రభుత్వాల వ్యవస్థలు, మన ప్రజాస్వామ్య క్షేత్రంలో మత సంబంధమైన దేవాలయాలను సంపూర్ణంగా నిర్మించాలనుకోవడమే వెర్రితనం. లేదా వ్యక్తిగత పేరు ప్రఖ్యాతులపై అత్యాశాతనం.
- 18) ఆయా దేవాలయాలో ఏండ్లకు ఏండ్లుగా జరుగుతున్న అభివృద్ధి పనులకు తోడుగా మరింతగా బడ్జెట్లను, ప్రణాళికలను తక్కువ సమయంలో పూర్తి చేయకలిగేలా చూడాలి కానీ., పూర్వకాలంలోని రాచరిక వ్యవస్థలలో మాదిరిగా కొత్తగా దేవాలయాలను కట్టాలనుకోవడం, ఉన్న ఆలయాలను కూలదోసి పునర్నిర్మాణాలు చేయాలనుకోవడం ఒకవిధమైన మూర్ఖత్వం. లేదా దేవుని పేరుతో ఎంతకాడికైతే..!? అంతకాడికి దండుకోవడానికి దారులు వేసుకోవడం.
- 19) మన ప్రజాస్వామ్య పరికల్పనలో ఐదేండ్ల కాలపరిమితితో ఎన్నికైన ఏ ప్రభుత్వాలైనా మొదటి చివరి యేడాదులలో ఎన్నో రకాలుగా సర్దుకోవడానికే ప్రాముఖ్యతనిచ్చుకుంటాయి. మధ్యలో మిగిలిన మూడేండ్లలో చేయ కలిగిన ప్రాజెక్టులను మాత్రమే ఎన్నుకోవాలి. అలాకాకుండా..!? దీర్ఘకాలిక ప్రణాళికలైన ఇలాంటి గుడిగోపురాలపై ప్రజాధనాన్ని, పాలనా సమయాన్ని వెచ్చించడంలో నిబద్ధత, నిజాయితీ ఉండదనేది సత్యదూరమై విషయం కాదు. నేటి కాలంలో ప్రభుత్వ నాయకులు మొదలు అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ ప్రతీ పనిలోనూ కమీషన్లపై, లంచాలపై, పర్సెంటీజీలపై మాత్రమే పనులు చేస్తుంటారు. అలాంటివారు ఏ పనిలోనైనా సరే.. ఎలా..!? ఏవిధంగా ..!? చిత్తశుద్ధి కలిగి ఉంటారు..!? నిఖార్సుగా ఎలా పనులు చేయగలుగుతారు..!?!?
- 20) దీర్ఘకాలిక నిర్మాణాలను పటిష్ఠంగా, సౌకర్యవంతంగా నిర్మించడమనేది..!? కంప్యూటర్లలో డిజిటల్ డిజైన్లు, డిజిటల్ వీడియోలు తయారు చేసినంత సులువు కాదుగా..!? ఇలాంటి మహోన్నతమైన నిర్మాణాలను మన దేశంలో నిబద్ధతతో, నిజాయితీతో, చిత్తశుద్ధితో ఎవ్వరూ చేయరనేది 75 సంవత్సరాల స్వతంత్రంలోని
మన ప్రజాస్వామ్య నాయకత్వ చరిత్రపుటలు తిరిగేస్తే ఇట్టే అర్థమౌతుంది. ఇది అక్షర సత్యం. ఇది మనందరి దేవుళ్ల మీద ఒట్టేసి చాటించదగిన నిఖార్సైన నిజం.
దేవుళ్లపైన జనాలకున్న బలహీనతలను ఆసరా చేసుకొని ఏండ్లకు ఏండ్లు సమయం పట్టే దేవాలయాల నిర్మాణాలపై పెట్టుబడులను పెట్టడమనేది..!? ప్రజలను నిట్టనిలువునా దగా చేయడమే ఔతుంది. ముందుగానే మోసం చేద్దామని పాలకులు నిర్ణయించుకుంటారు కాబట్టి, ఆ తర్వాత ఎంతటి దేవుడైనా సరే మూగగా రోదించకతప్పని పరిస్థితులు ఏర్పడతాయి. ఇక మామూలు జనాల స్థితిగతులు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.
- 21) ఇలాంటి ఒక అసంబద్ధమైన నిర్ణయాలతో జనాలలో ఉహాత్మకమైన ఆశలను పెంచుతూ, కీర్తికాంక్షలు ఒకవైపుగా, ధనసంపాదన మరొకవైపుగా, ఓట్లపందాలు ఇంకోవైపుగా గుడులు, గోపురాలు, దేవుళ్ళు అనే మూఢనమ్మకాల బలహీనతలను ఆసరాగా తీసుకుని ఈ యాదాద్రి దేవాలయ నిర్మాణం మొదలుపెట్టారనేది ఏమాత్రమైనా ఇంగిత జ్ఞానమున్న ఎవరైనాసరే అర్థం చేసుకోలేని చిదంబర రహస్యం కానే కాదు.
- 22) దేవునికి వేలాది ఎకరాలు అవసరమనే సాకును చూపి యాదగిరి గుట్ట చుట్టూ ఉన్న వేలాది ఎకరాల పంటపొలాలనూ, చెల్కలనూ, వందలాది బావులనూ, బోర్లనూ, ఎన్నో కుంటలనూ, చెరువులనూ స్వచ్చమైన
అటవీ సంపదనూ.. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసినారు. ఈ చర్యతో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎన్నో భవిష్యత్తులో బతుకుదెరవులు కోల్పోయే దుస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా రాజకీయ రియల్ ఎస్టేట్ వ్యాపారుస్తులు యాదగిరి గుట్ట చుట్టూ ఎటూ యాభై కిలోమీటర్ల కు పైగా కొండలనూ, కోనలనూ, వాగులూవంకలనూ, పంటపొలాలనూ మొత్తం వెంచర్లుగా చేసి సహజసిద్ధమైన ప్రకృతినంతా కకావికలం చేసేశారు. యాదగిరిగుట్ట పరిసరప్రాంతాలన్నీ నేడు సజహసౌందర్యాలను కోల్పోయి కృత్రిమ రంగుల మేకప్ లను రుద్దుకున్న అంగడిబొమ్మలా తయారు చేశారు. - 23) ఐతే..!? ఓ లాజిక్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగాలంటే..!? యాదాద్రి లోని నిజాలన్నీ అబద్దాలనీ.. అబద్దాలన్నీ నిజాలనీ.. హబ్బక్ మాటలతో వ్యాపారాలు చేసే బ్రోకర్ల మాటలకే బలం ఎక్కువ. ఈ రియల్ వ్యాపారస్తులు మాత్రం యాదాద్రి వెలిగిపోతుంది అంటూ ప్రచారం చేసుకోవడమనేది మాత్రం అబద్ధమైన నిజం. నిజమైన అబద్ధం. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మాత్రం అన్ని పార్టీల లీడర్లందరూ ఒకే ఒక ‘రియల్ పార్టీ సిండికేట్’ గా కూడుతారన్నది కూడా జగమెరిగిన సత్యం. పార్టీలకు.. కులాలకూ.. మతాలకూ.. వర్గాలకూ.. ఉద్యోగాలకూ అతీతంగా ‘రాజకీయ రియల్ బూమర్లందరూ’ ఒకే మాట మీద నిలబడి యాదాద్రి పేరును ప్రపంచ ఖ్యాతిలోకి తీసుకుపోతున్నారనేది ఆ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పవచ్చు.
- 24) ఈ రియల్ ఎస్టేట్ రాజకీయ వ్యాపారుల మాయాజాలంతో.. ఈ గట్టునంటావా..! నరసన్నా..!? మా గట్టుకొస్తావా..! నరసన్నా..!? అంటూ దళారీ ఆటలాడుకునే ఈ అరివీర భక్తులంతా కలిసి, అందరి బంధువైన ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే అయోమయంలో పడేశారు. వాళ్లకు నచ్చినట్లుగా యాదాద్రి పునర్నిర్మాణంపై వేలంవెర్రిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.
- 25) పునర్నిర్మాణం పేరిట జరుగుతున్న అకృత్యాలలో
ఏ భక్తులకు అండగా ఉండాలో..!? ఏ బడా చోర్లకు వత్తాసు పలకాలో..!? అర్థం కాని సందిగ్ధంలో పడ్డ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఈ యాదగిరి గుట్ట గుహలోనే ఉన్నాడో..!? లేక..!? ఇక్కడనుండి మరో గుహకు మాయమైపోయాడో..!? అని ఎటూ ఆలోచనతోచని అమాయక జనాలను ఆగమాగం ఔతున్నారు. - 26. ఏ వ్యవస్థలోనైనా, ఏ సమాజంలోనైనా, కాలగమనంలో మార్పులు అనేవి సహజమే. కానీ ఓ యాభై ఏండ్లకు మించిన మార్పులను, పట్టుబట్టి ఒకేసారి జరిపితే అసహజమే ఔతుంది. అలాంటి అసజహమైన ఏకధాటి మార్పులతో, స్థానికంగా ఉన్న అత్యధికశాతం పేద, మధ్యతరగతి జనజీవన వ్యాపారాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయనేది ఆ పెరుమాళ్లకు కూడా ఎరుకలేని ఓ లోగుట్టు.
- 27) ఆధ్యాత్మికతను అణగార్చిన సజీవ రూపం ఏమిటంటే..!? కలియుగంలో పాపాత్ములే పుణ్యాత్ములుగా చలామణి ఔతారనీ.. పాపకార్యమే పుణ్యకార్యంగా వెలుగుతుందనడానికి ఓ సజీవ సాక్ష్యం..! ఈ యాదాద్రి పునర్నిర్మాణ రూపం..!! ప్రకృతిని వికృతిగా మార్చిన వైనం.. .! ఈ యాదాద్రి పునర్నిర్మాణ వైభవం..!!