దళితబంధు పథకం అమలుపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఆర్థిక అవసరాలు, స్థితిగతులు పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రం నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. చింతకాని, తుంగతుర్తి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రంలో నలుమూల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

హుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పున ఉన్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు చేస్తున్నామని, వాసాలమర్రి, హుజూరాబాద్‌లో ప్రకటించిన మాదిరిగా నిధులు విడుదల చేస్తామన్నారు.
4 మండలాలకు కూడా 2, 3 వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 4 మండలాల్లోని అధికారులు గ్రామాలకు తరలాలి రావాలని ఆదేశించారు. దళితబంధు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగిందని సీఎం వివరించారు. దళితబంధు పథకం దేశంలో మునుపెన్నడూ, ఎవరూ చేయని వినూత్న ఆలోచన, ఈ పథకానికి రూపకర్తలం, కార్యకర్తలం మనమేనన్నారు.
స్వాతంత్ర్యానంతరం అరకొర అభివృద్ధి తప్పితే, దళిత గూడాల్లో గుణాత్మకమైన మార్పు ఇంకా రాలేదన్నారు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఆపదవస్తే ఎట్లైతే ఆదుకుంటామో అదే స్ఫూర్తితో దళితులను యావత్ సమాజం బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించుకొని అమలు చేస్తున్న పథకం దళితబంధు అని స్పష్టం చేశారు.