
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన విమాన గోపురం తదితర నిర్మాణాలకు బంగారు తాపడం చేయించే పనులలో భక్తులను మమేకం చేస్తున్న ప్రభుత్వానికి విశేష ఆదరణ లభిస్తుంది. తాజాగా గురువారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బంగారం తాపడం పనులకు కోటి రూపాయల నగదును విరాళంగా దేవస్థానంలో అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్న పద్ధతిలో చేపట్టిన నిర్మాణ పనులలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే కోటి రూపాయల నగదు తనవంతుగా విరాళం ఇస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో… పార్టీ నేతలతో యాదాద్రికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నగదును నెత్తిపై పెట్టుకుని తిరు వీధుల గుండా ఆలయంలోకి ప్రవేశించారు. దీన్ని కవర్ చేయడానికి మీడియా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. సాక్షాత్తు మంత్రి నగదును నెత్తిపై పెట్టుకుని తరలి వస్తున్న దృశ్యం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఇంతవరకు దేవస్థానంలో విరాళాలు ఇచ్చిన భక్తులు ఇలా నగదును మోసుకుంటూ వచ్చి ఇచ్చిన దాఖలాలు లేవు. నగదును సమర్పించిన భక్తులు సంచుల్లో మూడో కంటికి తెలియకుండా ఆలయం వరకు తీసుకువచ్చి ఆలయంలోని అధికారులకు సమర్పించడం ఆనవాయితీ.

అందుకు భిన్నంగా కోటి రూపాయల నగదు నెత్తిపై మోసుకుంటూ వచ్చిన వ్యక్తిగా మంత్రి మల్లారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఈ సందర్భంగా నగదును స్వీకరించిన అనంతరం అధికారులు, అర్చకులచే వేద ఆశీర్వచనం జరిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న ప్రజారంజక పాలన వల్ల ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. తన వంతు కర్తవ్యం కోటి రూపాయల నగదును స్వామివారికి సమర్పిస్తున్నట్లు వివరించారు.