ప్రతి ఒక్కరూ నాణ్యత గల ఆహారం పొందడమే ఆహార భద్రత చట్టం ప్రాథమిక లక్ష్యమని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ కె.తిర్మల్ రెడ్డి తెలిపారు.
స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎంపీపీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో జరిగిన ఆహార భద్రత చట్టం – అమలుపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందడమే చట్టం ఉద్దేశమని, దీనిపై ప్రజలకు విస్తృతంగా తెలియజెప్పేందుకు, వారి హక్కులను వారు గుర్తించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ఎంత ఆహారం అందించాలనేది చట్టంలో విపులంగా ఉందని, ప్రజలకు ఉన్న హక్కులపై వారికి తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, చట్టం పరిపూర్ణంగా అమలు అయితేనే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.


ఆహార భద్రత చట్టం విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ప్రజలకు అందేలా చూడాలని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాయని, అలాగే సుప్రీం కోర్టు కూడా ఆహార భద్రత చట్టం అమలుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరిగిందని తెలిపారు. ప్రజల హక్కులకు భంగం కలిగితే కాపాడడానికి చట్టంలో వీలుందని, ఉన్నత ఆహార ప్రమాణాలు పొందే హక్కు ఉందని అన్నారు. జిల్లా విజిలెన్స్ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, గ్రామ స్థాయిలో సర్పంచి చైర్మన్గా నిర్వహిస్తారని, అన్యాయం అవకతవకలపై కమిటీలు పర్యవేక్షణ చేయాలని, కమిటీల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకంపై సోషల్ ఆడిట్ జరగాలని, అధికారులు దీనికోసం చర్యలు తీసుకోవాలని తెలుపుతూ చట్టం అమలులో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. మధ్యాహ్న భోజనం అందరికీ అందేలా విజిలెన్స్ కమిటీలు పర్యవేక్షించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రజలందరికీ సరసమైన ధరకు నాణ్యమైన సరుకులను అందించే బాధ్యత జిల్లా యంత్రాంగందేనని అన్నారు.

సమీక్ష కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డిఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, కమిషన్ మెంబర్ బి.భారతి, జిల్లా అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు తహసీల్దార్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.