ఇక అలహాబాద్‌ పేరు ‘ప్రయాగ్‌రాజ్‌’

0
88

ఆమోదం తెలిపిన ఉత్తరప్రదేశ్‌ మంత్రివర్గం
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నగరం పేరును ‘ప్రయాగ్‌రాజ్‌’గా మార్చారు. పేరు మార్చొద్దని రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేరు మార్చేందుకే నిర్ణయించారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ఈరోజు నుంచి అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా పిలవాలని తెలిపారు. రైల్వే సహా ఇతర అన్ని విభాగాల్లో నగరం పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని వెల్లడించారు. శనివారం యోగి అలహాబాద్‌ను సందర్శించిన సమయంలోనే త్వరలోనే నగరం పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చుతామని చెప్పారు. దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అలహాబాద్‌లో కుంభమేళా ఎంతో ఘనంగా జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు హాజరవుతారు. 2019లో జరిగే కుంభమేళా కంటే ముందుగానే నగరం పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని యోగి భావించారు. పూర్వం అలహాబాద్‌ పేరు ‘ప్రయాగ్‌’ అని ఉండేది. 16వ శతాబ్దంలో మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ గంగా, యమునా నదుల సంగమ స్థానంలో కోటను నిర్మించారు. ఆ కోటకు, పరిసర ప్రాంతాలకు ఇలహాబాద్‌ అని పేరు పెట్టారు. తర్వాత అక్బర్‌ మనవడు షాజహాన్‌ అలహాబాద్‌గా పేరు మార్చారు. కానీ కుంభమేళా జరిగే ప్రాంతాన్ని ఇప్పటికే ప్రయాగ్‌ అనే పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్‌ రైల్వే జంక్షన్‌ను కూడా యోగి ప్రభుత్వం పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. అలాగే మొఘల్‌సరాయ్‌ పట్టణాన్ని పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ నగర్‌గా మార్చారు.