శ్రీయాదాద్రి ప్రతినిధి : యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్‌వీఎన్ మాంటిస్సోరి హైస్కూల్‌లో బతుకమ్మ పండుగను ఈ నెల 8న సోమవారం వైభవంగా నిర్వహించనున్నట్లు పాఠశాల వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్, డైరెక్టర్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురిలు తెలిపారు. తెలంగాణ సంప్రదాయాన్ని భావి తరాలకు అందించేందుకు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బతుకమ్మ వైభవంపై పాటలు, నృత్యాలు, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు అంబరాన్నంటే బతుకమ్మ పండుగ వైభవాన్ని చిన్నారులకు వివరించనున్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతిక వైభవం చాటి చెబుతామన్నారు. తెలంగాణలో గౌరీకి ప్రతీకగా బతుకమ్మను ఆరాధిస్తారని చెప్పారు. ఆశ్వయుజ మాసంలో మహాలయ అమవాస్య నాడు ప్రారంభమై నవమితో ముగిస్తుందని చెప్పారు. పిలిచినా, పిలవకున్నా బతుకమ్మ పండుగ వస్తుందంటే ఇంటి ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుంటారని, ప్రకృతి అంతా పూలవనమై అలరారుతున్న సమయంలో పండుగ వస్తుందని వివరించారు.

