కాంగ్రెస్‌ బాటలో గద్దర్

0
79

ప్రజాయుద్ధ నౌకగా ‘విప్లవాభిమానులు’ పిల్చుకునే గద్దర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నారు. ఈరోజు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలవనున్నట్టు గద్దర్ బీబీసికి తెలిపారు. ప్రజలే తనను తీర్చిదిద్దారని, వారే తన భవిష్యత్తును నిర్దేశిస్తారని ఆయన అన్నారు. గద్దర్ కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారని, పార్టీ ప్రచారానికి గద్దర్ తురుపుముక్కగా పనిచేస్తారని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ రామచంద్ర కుంతియా బీబీసీకి తెలిపారు. పూర్తి వివరాలు సోనియా, రాహుల్‌లతో గద్దర్ భేటీ తర్వాత వెల్లడిస్తామన్నారు. సుదీర్ఘ కాలం నక్సలైట్ల భావజాలానికి బహిరంగ వాహికగా ఉన్న గద్దర్ స్వరం కొంతకాలంగా మారుతూ వస్తున్నది. ఎన్నికల రాజకీయాల వైపు ఆయన చూపు సారిస్తూ వచ్చారు. ఒక దశలో సొంతంగా పార్టీ పెట్టాలనే ప్రయత్నాలు సైతం సాగినా అవి చర్చలను దాటి ముందుకు వెళ్లలేదు. దళిత బహుజనుల కూటమిగా తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్న బి.ఎల్.ఎఫ్ తరఫున ఆయన పోటీ చేస్తారనే వార్తలు బలంగా వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ స్నేహహస్తం అందుకోవడం ఎన్నికల వేళ రాష్ర్ట రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.