తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై గధ, కమలం ధరించిన శ్రీ మహావిష్ణువు అలంకారంలో మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యభగవానుడు సప్తాశ్వాలతో రథాన్ని నడుపుతూ స్వామివారిని తీసుకెళుతున్నట్లుగా సూర్యప్రభ వాహనాన్ని రూపొందించారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అలరించారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది.