లేదు.. లేదంటూనే కేసీఆర్ వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోందంటే!

0
48

తెలంగాణా టీడీపీ- ఇప్పుడు చాలా హాట్ టాపిక్‌! తెలంగాణాలో ఈ పార్టీకి ఎలాంటి బలం లేదంటూనే అధికార టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రోజుకోసారి ఈ పార్టీపైనే విరుచుకుపడుతుండడం గమనార్హం. నిజానికి బలం లేని పార్టీకి, ఓటు షేరింగ్ లేని పార్టీని చూసి ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? అనేది ప్రధాన ప్రశ్న. మహాకూటమి ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని, ఆయన వ్యూహం ఫలిస్తే.. తమ కొంపకు ఎసరు రావడం ఖాయమని కేసీఆర్ భావిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. దీంతోనే ఆయన లేని పార్టీని పదే పదే కెలుకుతూ.. పెద్దది చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరే ఈ విషయం అలా ఉంచితే.. టీడీపీకి జవసత్వాలు ఊదేందుకు ఇటీవల చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలయ్య తెలంగాణాలో పర్యటించి ప్రచారం కూడా చేశారు.

వాస్తవానికి చంద్రబాబు అండ్ ఫ్యామిలీ, బాలయ్య వార్తలకు ఎంతో ప్రాదాన్యం ఇచ్చే ఏపీ మీడియా ముఖ్యంగా బాబు అనుకూల మీడియా… కూడా బాలయ్య వార్తలను పక్కన పెట్టింది. అంటే.. ఏపీకి చెందిన బాలయ్య తెలంగాణాలో ప్రచారం చేస్తున్నారంటే.. తెలంగాణాలో టీడీపీకి నాయకులు లేరనే సంకేతాలు వెళ్తాయని భావించారో ఏమో.. ఇలా చేశారు., సరే ఏది ఏమైనా.. బాలయ్య మాత్రం తనదైన స్టైల్లో దూసుకుపోయారు. ముఖ్యంగా ఏపీ సరిహద్దుల్లోని ఖమ్మం జిల్లా టీడీపీకి జవసత్వాలు నింపాలని ఆ పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య ప్లాన్ చేశారు. అందుకోసం జిల్లాలో ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఎన్‌టీఆర్ విగ్రహాల ఆవిష్కరణకు రావాల్సిందిగా వారు కోరారు. ఖమ్మంలో పార్టీ పరిస్థితి గురించి వివరించి.. స్థానిక టీడీపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపాలంటే ఖమ్మం రాక తప్పదని బాలయ్యబాబుకి నచ్చచెప్పారు. అంతేకాకుండా- తను మూడోసారి పోటీచేస్తున్న సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తే అది తన గెలుపునకు దోహదపడుతుందని సండ్ర వెంకటవీరయ్య బాలయ్యకు వివరించారు. గత ఎన్నికలలో ఖమ్మంజిల్లాలో బాలయ్య పర్యటించిన ప్రాంతాల్లో తప్పకుండా ఆ ప్రభావం కనిపించిందనీ, అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు అడుగుతున్నామనీ సండ్ర, నామా నాగేశ్వరరావు బాలయ్య వద్ద పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మం పర్యటనకు బాలకృష్ణ ఒకే చెప్పారు. అయితే, ఆశించిన మేరకు మైలేజీ కనిపించిందా? అంటే ఇప్పటికే మౌనమే సమాధానంగా వస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. ఒక్క జిల్లాలోకూడా బాలయ్య పెద్దగా మైలేజీ సాధించలేకపోయారనే వాదన బలంగా ఉంది.