మానసిక ఒత్తిడి అనర్థాలకు మూలం
10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
శ్రీయాదాద్రి ప్రతినిధి : ప‌్రస్తుత కాలంలో ఏ సమస్యా లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా జీవించడమంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మనం మారుతూ, మన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే ఈ పోటీ ప్రపంచంలో మన ఉనికిని నిలుపుకోగలం, లేదంటే ఇతరలు మనల్ని దాటేసి ముందుకు వెళతారనే బెంగతో ప్రతిక్షణం మన ఆలోచనలకు పదును పెట్టే క్రమంలో, కొన్ని సందర్భాలలో ఇన్ఫీయార్టికి గురై ఎంతో కొంత ఒత్తిడికి గురవ్వడం ఖాయం. అక్టోబర్ 10న బుధవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒత్తిడిని ఎలా జయించాలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జక్కని రాజు చెబుతున్నారు. ఆయన మాటల్లోనే…
ఒత్తిడి ఎవరికి ఉంటుంది…?
నిత్యజీవితంలో ఒత్తిడిని ఎదుర్కోని వారు దాదాపు అరుదనే చెప్పాలి. అయితే ప్రశాంతంగా జీవించే వారు లేరాంటే ఉన్నారు కానీ చాలా తక్కువ శాతమనే చెప్పాలి. ఈ సందర్భంగా ఒక చిన్నకథ. ఒక స్వామీజీని ఒక యువకుడు అడిగాడంట. మీలాంటి స్వాములు, యోగులు, సన్యాసులు గాకుండా సంసార బంధంలో ఉండి ప్రశాంతంగా జీవించేవారు ఎవరైనా ఉన్నారా స్వామీ అని. దానికాయన జవాబిస్తూ జీవితంలో ఎన్నడూ ఏ పనిచేయనివాడు, ఏ లక్ష్యము లేనివాడు, మూర్ఖుడు, సోమరిపోతులు ఇలాంటి వారు మాత్రమే ఒత్తిడికి గురికారు నాయనా.మిగతా వారంతా ఎంతో కొంత ఒత్తిడికి లోనవుతుంటారని సెలవిచ్చాడంట. దీనిని బట్టి మనకర్తమయ్యే నీతి ఏమిటంటే స్ట్రేస్ అనేది అసలే లేకపోవడం అనేది కుదరదు. కాకపోతే దానిని మేనేజ్ చేసుకోవాలి. అందుకే స్ట్రేస్ మేనేజ్‌మెంట్ అన్నారు గానీ, స్ట్రేస్ లెస్ అని ఎప్పుడూ ఎవరూ అనరు.
ఒత్తిడి అవసరమే..
ఔను. ప్రతీ మనిషికి తమ తమ పనులు సకాలంలో జరగాలంటే కొంతమేర ఒత్తిడి అవసరమే. మనలో చాలామంది డెడ్‌లైన్ ఉంటేనే పనిచేస్తారు. ఈ సమయంలోగా ఈ పని పూర్తవ్వాలి అనే ఒకటుంటేనే బద్దకాన్ని పక్కనబెట్టి ఆ పని చేయడానికి శాయశక్తులా కృషి చేస్తారు. లేదంటే వాయిదా వేసే అవకాశం ఉంది. అందుకని కొంతమేర ఒత్తిడి కూడా వరమే అంటారు మానసిక నిపుణులు.
చేసే పనిని ప్రేమించాలి
మానసిక ఒత్తిడి తగ్గాలంటే ముందుగా మనం చేసే పనిని ఇష్టపడి చెయ్యాలి లేదా ఇష్టమైన పనిని ఎంచుకోవాలి. ఎదో బతకడానికి మాత్రమే పనిచేసినట్లయితే కొంచెం శ్రమించినా అలసటగా గురవుతాము. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సైంటిస్టులు, రచయితలు వారు రోజుకి పద్దెనిమిది గంటలు శ్రమించినా ఉత్సాహంగానే కనబడతారు. వారికి శ్రమించడంలోనే ఆనందం ఉంటుంది. అలాగే మన వృత్తిలో మెళకువలు తెలుసుకోగలిగితే తక్కువ సమయంలో ఎక్కువ పనిచేసి, ఎక్కువ ఆనందాన్ని పొందుతాము.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జక్కని రాజు, 9440469097
క్షమించగలిగే మనస్తత్వం ఉండాలి
కుటుంబ సభ్యులను గానీ, బంధుమిత్రులను, కొలిగ్స్‌ని, నైబర్స్‌ని గానీ వారి తప్పులని జీవితాంతం గుర్తుంచుకుంటే మనకు మిగిలేది వ్యధ మాత్రమే. సమస్యలను సులభతరం చేసుకుంటూ, పట్టువిడుపులతో ముందుకు సాగితే జీవితంలో ఒత్తిడి ధరిచేరదు. సర్థుకుపోయే మనస్తత్వం ఉన్నవారు మాత్రమే ప్రశాంతంగా జీవించగలుగుతారు.
టైం మేనేజ్‌మెంట్
ఏ రోజు పనులు ఆరోజు చేయడం అలవర్చుకోవాలి. బద్దకాన్ని వదిలి, ఒక ప్రణాళికా ప్రకారం, ప్రాధాన్యత ప్రకారం పనులు చేసుకుంటూ పోతే స్ట్రేస్ ధరిచేరదు. అలాగే ప్రతీరోజూ వాకింగ్ లేదా జాగింగ్, వీలైతే వ్యాయామం చేయడం దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇంకా ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజకం చేకూరి మనసు మన కంట్రోల్లో ఉంటుంది.