‘తితలీ’ తుఫానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి ముందుకొచ్చిన సినీ హీరోలు విజయ్ దేవరకొండ, నిఖిల్‌ను టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు అభినందించారు. రెండ్రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండ తుఫాను బాధితులకోసం తన వంతుగా రూ. 5లక్షలు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు నిఖిల్.. మొట్టమొదటిసారి హీరో నిఖిల్ సిద్ధార్థ ‘తితిలీ’ ప్రభావిత ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించి దగ్గరుండి మూడు వేల మందికి భోజన సదుపాయం కల్పించాడు. 2500 కిలోల రైస్, 500 దుప్పట్లు, పవర్ కట్స్‌ని నివారించేందుకు పోర్టబుల్ జనరేటర్స్ అందించాడు. తెలుగు హీరోల సాయాన్ని తుఫాను బాధితులు మెచ్చుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు సిక్కోలు తుఫాను బాధితులకు సాయం చేసి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోలని అనిపించుకుంటున్నారు!. తాజాగా.. విజయ్ దేవరకొండ, నిఖిల్ సాయంపై ఎంపీ కంభంపాటి రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించి అభినందించారు.
విజయ్‌ను ఉద్దేశించి..
” కష్టకాలంలో సిక్కోలు తుఫాను బాధితులకు అండగా నిలిచి సాయం చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయ్ ఆర్థిక సాయం చేసినట్లున్న స్ర్కీన్ షాట్‌ను తన ట్విట్టర్‌లో యువ ఎంపీ పోస్టు చేశారు.
నిఖిల్‌ను ఉద్దేశించి..
” కష్టకాలంలో మీరు చేసిన సాయం, మీ నిస్వార్థ సేవలు నేను.. మా సిక్కోలు ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మీరు మరింత మందికి ఆదర్శంగా నిలవాలి” అని రామ్మోహన్ నాయుడు ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌తో పాటు బాధితులకు సాయం చేస్తున్నట్లున్న ఓ ఫొటోను ఎంపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.