Site icon Sri Yadadri Vaibhavam

బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబుకు షాకిచ్చిన సునీల్

చలమలశెట్టి సునీల్, తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. ఇపుడీ పేరుతో పనేమిటంటే ? సునీల్ ఈరోజు జనసేనలో చేరారు. కాకినాడ పార్లమెంటు సీటుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారట. అందుకనే జనసేనలో చేరిపోయారు. టిడిపిలో చేరేందుకు చంద్రబాబుతో అనేక సార్లు భేటీలు జరిపి చివరకు జనసేనలో చేరటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సునీల్ , పవన్ పాత కాపులే లేండి. ఎలాగంటే చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినపుడు సునీల్ రాజకీయంగా మొదటి అడుగు వేశారు. పిఆర్పిలో పవన్, సునీల్ కలిసి పనిచేశారు. పిఆర్పి తరపున కాకినాడ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొంత కాలంపాటు రాజకీయంగా స్తబ్దుగా ఉండి ఆ తర్వాత వైసిపిలో చేరారు. దాదాపు నాలుగేళ్ళ పాటు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. అయితే, స్ధానిక నేతలతో సరైన సంబంధాలు లేని కారణంగా ఎప్పుడూ వారితో గొడవలే. దాంతో సునీల్ విషయంలో వైసిపి అధ్యక్షుడు జగన్ కూడా విసిగిపోయారు. చివరకు సునీల్ ను జగన్ పట్టించుకోవటం మానేశారు. దాంతో జగన్ పై అలిగిన చలమలశెట్టి వైసిపికి రాజీనామా చేసేశారు. తర్వాత టిడిపిలో చేరే ఉద్దేశ్యంతో చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. కాకినాడ ఎంపిగా గెలవాలన్నది సునీల్ జీవితాశయంగా కనబడుతోంది. అందుకనే చంద్రబాబుతో కూడా కాకినాడ సీటు గురించే పట్టబట్టారు. మొత్తానికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపో మాపో టిడిపిలో చేరటమే అన్నట్లుగా ఉంది పరిస్ధితి. అటువంటిది తెర వెనుక ఏమైందో ఏమో…హాఠాత్తుగా ఆదివారం పవన్ సమక్షంలో సునీల్ జనసేనలో చేరారు. బహుశా కాకినాడ ఎంపిగా పోటీ విషయంలో పవన్ హామీ ఇచ్చుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సునీల్ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతే కాకుండా ఆర్దికంగా కూడా గట్టి స్ధితిలో ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా కూడా సునీల్ కు జిల్లాలో పేరుంది.

Exit mobile version