అక్టోబర్ 6 వ తేదిన వనపర్తిలో జరిగిన టిఆర్ ఎస్ ప్రచార సభలో సీఎం కేసీఆర్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వికలాంగులు సూర్యాపేట సీఐ కి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి సభలో మాట్లాడుతూ కుంటోళ్లు, గుడ్డోళ్లు అని హేళనగా మాట్లాడటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తే కనీస విచక్షణ లేకుండా మాట్లాడితే సమాజంలో వికలాంగుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీం కూడా వికలాంగులు అని పిలవాలని ఆదేశాలు ఇచ్చినా కూడా వికలాంగుల మనస్సు బాధపడేలా మాట్లాడటం సరికాదన్నారు. సీఎం వ్యాఖ్యలపై వికలాంగుల హక్కుల చట్టం 2016 కింద సెక్షన్ 92 ప్రకారం సూర్యాపేట సీఐ శివశంకర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సీఐ ఇది వనపర్తిలో జరిగింది. కాబట్టి ఈ కేసును వనపర్తి ఎస్పీ గారికి బదిలీ చేస్తామన్నారని వారు తెలిపారు. తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట అధ్యక్షుడు కోనేటి వెంకన్న మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడిన భాష అవమానకరంగా ఉందన్నారు. సీఎం తన స్థాయిని దిగజారి మాట్లాడారని విమర్శించారు. కుంటోళ్లు, గుడ్డోళ్లకు పింఛన్లు పెంచామని చెప్పారని అది ప్రభుత్వ బాధ్యతన్నారు. కానీ కేసీఆర్ వాడిన భాష తప్పన్నారు. కేసీఆర్ వెంటనే వికలాంగులందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.