కలకలం సృష్టించిన ఆత్మహత్యాయత్నం
కొండపైకి తల్లిదండ్రులు వస్తున్నారని భవనంపై నుంచి దూకిన ప్రేమజంట
శ్రీయాదాద్రి ప్రతినిధి :
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపై ప్రేమజంట మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడడంతో భక్తుల్లో కలకలం నెలకొంది. గాంధీ జయంతి కావడంతో భారీగా తరలివచ్చిన భక్తజనసందోహంతో యాదాద్రికొండంతా కిటకిటలాడుతుండగా ప్రేమజంట ఆత్మహత్యాయత్నం తెలుసుకున్న భక్తులు కరవరానికి గురయ్యారు. ప్రేమికుల వార్త కథనాలు హల్‌చల్ సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏం జరిగిందో అంటూ కుప్పలు తెప్పలుగా భక్తులు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న భవనం వైపుకు తరలిరావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యాదగిరిగుట్ట సీఐ నర్సింహరావు సంయమనంతో వ్యవహరించడంతో ప్రేమికులు బతికి బయటపడ్డారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన ప్రేమజంట మనీష్ (20), అక్షయ (18) రాత్రి 7:30 గంటల సమయంలో శ్రీచక్ర భవనంపై నుంచి కొండ కిందికి గల లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించి దూకారు. మనీష్ కొండకింది భాగంలో పందులు కొండపైకి రాకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన రేకులపై పడి దానిపై నుంచి లోయలోని బండపై పడడంతో కాళ్లు, చేతులు, నడుములు విరిగిపోయాయి. అక్షయ కొండకింద గల బురదలో పడడంతో స్వల్పగాయాలతో బయటిపడింది. గత రెండు రోజులుగా వీరిద్దరూ కొండపైన తిరుగుతూ ఉద్యోగులకు కన్పిస్తున్నారు. కొండపైన గల విచారణ శాఖలో తాము భార్యాభర్తలమని తమకు గది కావాలని కోరినప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో గది ఇవ్వలేదు. దాంతో వారు శ్రీవారి తిరువీధులు, ధర్మశాలలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటివరకు శ్రీవారి సన్నిధిలో ప్రశాంతంగా ఉన్న ప్రేమజంటకు అల్వాల్‌లోని తన స్నేహితుల నుంచి మీ తల్లిదండ్రులు యాదాద్రికొండపైకి వాహనంలో వస్తున్నారని సమాచారం రావడంతో తమను ఎలాగైన వీడదీస్తారని భావించిన ప్రేమజంట ఆత్మహత్యే శరణ్యమని భావించి కొండపైన అత్యంత ఎత్తైన శ్రీచక్ర భవనం నుంచి లోయలోకి దూకి చనిపోవాలని క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్ని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రేమజంట శ్రీచక్ర భవనం నుంచి దూకడంతో శబ్దం విన్న శ్రీచక్ర భవనంలోని గదులలో గల భక్తులు హుటాహుటిన పోలీసులకు సమాచారమివ్వడంతో సీఐ నరసింహరావు కొండపైన గల సిబ్బందిని అప్రమత్తం చేసి రక్షించే పనులు చేపట్టి ప్రేమజంటను కాపాడారు. ఈలోగా అక్షయ, మనీష్‌ల తల్లిదండ్రులు కూడా పోలీసులను కలిసి రెండు రోజుల నుంచి ఇద్దరు ఇంటిలో నుంచి పారిపోయి వచ్చారని ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. తీవ్ర గాయాలపాలైన మనీష్‌ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
