రోస్టన్ ఛేజ్ (98 నాటౌట్) వీరోచిత బ్యాటింగ్ గట్టి పోటీనిచ్చిన వెస్టిండీస్
విండీస్ నిలిచింది. అనుకున్నంత తేలికగా ఆ జట్టేమీ లొంగిపోలేదు. ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేనకు గట్టిపోటీనిచ్చింది. మొదటి సెషన్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించగా రెండో సెషన్‌లో రెండు జట్లూ కఠినంగా పోటీపడ్డాయి. మూడో సెషన్‌లో మాత్రం కరీబియన్ జట్టుదే ఆధిపత్యం. రోస్టన్ ఛేజ్ (98 బ్యాటింగ్; 174 బంతుల్లో 7×4, 1×6), జేసన్ హోల్డర్ (52; 92 బంతుల్లో 6×4) అద్భుతంగా పోరాడారు. తొలి రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టును 295/7తో నిలిపారు.
ఆరంభంలో పడ్డా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన విండీస్‌కు శుభారంభం దక్కలేదు. 32 పరుగులకే ఓపెనర్ కీరన్ పావెల్ (22) ఔటయ్యాడు. కుల్‌దీప్ యాదవ్ అతడిని ఎల్బీగా పంపించాడు. మరో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (14) జట్టు స్కోరు 52 వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షై హోప్ (36), సునిల్ ఆంబ్రోస్ (18), హెట్‌మెయిర్ (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో భోజన విరామానికి ఆ జట్టు 86/3తో నిలిచింది.
సూపర్ ఛేజ్
భోజన విరామం తర్వాత క్రీజులోకి వచ్చిన రోస్టన్ ఛేజ్ (98) నిలకడగా ఆడాడు. షేన్ డోవ్రిచ్ (30)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం అందించాడు. తేనీటి విరామానికి అర్ధశతకం సాధించి విండీస్‌ను 197/6తో నిలిపాడు. కుదురుకున్న ఈ జోడీని డోవ్రిచ్‌ను ఔట్ చేయడం ద్వారా ఉమేశ్ విడదీశాడు. ఇక త్వరగా వికెట్లు పడతాయి అనుకున్న దశలో జేసన్ హోల్డర్ (52) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఓ వైపు ఛేజ్, మరోవైపు హోల్డర్ నిలకడగా పరుగులు సాధించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 104 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. ఆచితూచి ఆడిన హోల్డర్ అర్ధశతకం బాదేశాడు. ఆ తర్వాత 2 పరుగులకే ఉమేశ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దేవేంద్ర బిషూ (2 బ్యాటింగ్) నైట్‌వాచ్‌మన్‌గా వచ్చాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి విండీస్ 295/7తో నిలిచింది. ఉమేశ్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్ తలో 3 వికెట్లు తీశారు. అరంగేట్రం చేసిన పేసర్ శార్దూల్ ఠాకూర్ తొడకండరాల గాయంతో 10 ఓవర్లకే మైదానం వీడాడు.