హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్ర క్రీడాకారులు మరోమారు సత్తాచాటారు. రష్యాలోని అనాప నగరం వేదికగా జరిగిన వాకో కిక్ బాక్సింగ్ వరల్డ్ టోర్నీలో రాష్ట్ర కిక్‌బాక్సర్లు పతకాలతో మెరిసారు. దేశం తరఫున రాష్ట్రం నుంచి బరిలోకి దిగిన ఐదుగురు బాక్సర్లు రెండు స్వర్ణాలతో సహా రజతం, రెండు కాంస్య పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో కందుల మౌనిక, ప్రవీణ్ కుమార్ తమ తమ విభాగాల్లో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. మిగిలిన విభాగాల్లో తమదైన రీతిలో పైచేయి సాధిస్తూ రాసకొండ సంజీవ్ రజత పతకంతో ఆకట్టుకోగా, షేక్ అహ్మద్, మహేశ్ కాంస్య పతకాలు దక్కించుకున్నారు. వీరందరినీ కోచ్ నర్సింగ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమార్జున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎంతో చేయూతనిస్తున్నది అన్నారు. రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం అభినందనీయమన్నారు.