శిఖర్‌ ధావన్‌కి కొత్త పేరు పెట్టాడు!

0
69

టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, బౌలర్‌ హర్భజన్ సింగ్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచుల్లో ఆడకపోయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం తమదైన శైలిలో పోస్టులు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా, శిఖర్‌ ధావన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో అతను కనబడుతున్న తీరు అలరిస్తోంది. ఎంతో రిలాక్స్‌గా కూర్చున్నట్లు కనపడుతున్నాడు. అయితే, అతను ధరించిన దుస్తులు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. ఒంటిపై నల్లటి శాలువా ధరించి, గడ్డం, గుండుతో ఉన్నాడు. ఎవరినో తదేకంగా చూస్తున్నట్లు ఉన్న ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన హర్భజన్‌ సింగ్.. ధావన్‌కు కొత్త పేరు పెట్టాడు. ‘డాకు’ అంటూ కామెంట్ చేశాడు. హిందీలో డాకు అంటే బందిపోటు అని అర్థం. అచ్చం అలాగే తయారైన ధావన్‌కు ఈ పేరు సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తనకు ‘డాకు’ అని పేరు పెట్టినందుకు గానూ భజ్జీకి ధావన్‌ కూడా ఓ కొత్త పేరు పెట్టాడు. ‘జగ్గా జాట్’ అంటూ కామెంట్ చేశాడు. ధనవంతుల నుంచి దోచుకుని పేదలకు పంచే వ్యక్తిగా 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన పంజాబ్‌ యోధుడి పేరే ‘జగ్గా జాట్’. ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకరికి ఒకరు పెట్టుకున్న పేర్లు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన శిఖర్‌ ధావన్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.