కాకతీయుల పాలనలో ప్రజలకు సంఘమర్యాదల పేరుతో ప్రజాధికారాలుండేవని శాసనాలవల్ల తెలుస్తున్నది. సాంఘికాచారాలలో భాగంగా కొన్నికట్టుదిట్టాలుండేవి. అవి న్యాయసమ్మతమైవుండాలి. ప్రజలకున్న అధికారాలు రాజప్రభుత్వానికున్న అధికారాలు ఏవైనా బాధ్యతాయుతమైనవే. రాచరికపాలనలు ఎక్కువపాళ్ళు నియంతృత్వవిధానంలోనే వుంటాయి. విశేషించి ప్రజాభిప్రాయం కోరే సందర్భాలు తక్కువ. కాకతీయులు కాని, అంతకు ముందున్న రాజవంశాలు వారు కానీ, గ్రామాలలో గ్రామాధికారుల(గావుండాల) వ్యవస్థను ఏర్పాటుచేసి, ఆ గ్రామాలలో ఏ ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవహారమైనా, దానమైనా, ధర్మమైనా ఆ గ్రామ(జన)సభ నిర్ణయం మేరకే చెల్లేది. కొన్నిసార్లు అష్టాదశ ప్రజలన్నా, మహాజనసభలన్నా అటువంటివే. గావుండాల అనుమతితోనే ఆ గ్రామాలలో రాచరికం చేసిన నిర్ణయాలు చెల్లుతుండేవని ఆయా రాజుల పాలనాకాలాలనాటి శాసనాలు చెప్తున్నాయి.
కాకతీయులు రాజ్యమేలుతున్న కాలంలో ప్రభుత్వంతో నిమిత్తం లేని ప్రజాధికారం చెల్లేదని తెలుస్తున్నది. వారి కాలంలో వుండే గ్రామసభలను ‘అశేషప్రజ’ లేదా ‘సమస్త ప్రజ’ అని, అష్టాదశప్రజ అని కూడా పిలుస్తుండేవారు. నిజానికి అన్ని గ్రామాలలో 18కులాలవారు సభలో వుండేవారో లేదో కాని, సభకు ఆ పేరే వుండేది.
శనిగరం గ్రామంలో కాకతీయ 1వ బేతరస ప్రెగ్గడ నారణయ్య ఆ గ్రామం గావుండ(గ్రామ సంఘాధ్యక్షుడు) ముప్పడయ్య, మరొక గావుండ పున్నిరడ్డిల సమ్మతితో దుద్ధమల్ల జినాలయాన్ని బాగుచేయించి, 1 రాటణాన్ని దానం చేసాడు.
అదే వూరిలో మధుపేశ్వరాలయానికి దానం చేయడానికి అప్పటి కాకతీయరాజు 2వ ప్రోలుడు అక్కడి గావుండల అనుమతి తీసుకున్నాడు. శనిగరం పెద్దలనే కాక తానివ్వదలచుకున్న భూములన్న గ్రామం బెజవాంక గావుండాల సమ్మతిని కూడా తీసుకున్నాడు.
ఆ కాలంలో గ్రామాలలోని భూములు, నివేశన స్థలాలు ఒక మేరకు గ్రామసంఘాల అధీనంలో వుండేవని తెలుస్తున్నది.
యాదాద్రి-భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని వెంకిర్యాల(శాసనంలో ఇంక్రియాల్) గ్రామం బయట పాడువడ్డ గుడులున్నచోట గతంలో పురావస్తుశాఖవారికి ఒక శాసనం లభించింది. ఈ శాసనం క్రీ.శ.1292(శక సం.1214)నాటిది.
కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఓరుగల్లులో పాలన చేస్తుండగా క్రీ.శ. 1292సం.(శక సం. నందన చైత్ర శు.3నాడు) మహామండలేశ్వరుడైన పెండ్లికొడుకు మల్లిదేవ మహారాజు లెంక ‘ఎల్లు రవుతు’ మూసీనది ఒడ్డున వుండే వెనకరేవుల(వెంకిర్యాల,శాసనంలో ఇంక్రియాల్), రేవురేల(రావిరాల), రుద్రపురం(రుద్రెల్లి) అనే 3ఊర్ల కాపులను, అశేషప్రజను పిలిపించి, వారిచేత చేయించిన దానం గురించి ఈ దానం చెపుతున్నది. ఈ పెండ్లికొడ్కు మల్లిదేవమహారాజు పాతర్లపాడు శాసనంలో ప్రస్తావించబడ్డాడు.
ఇతని లెంక(ప్రాణమిచ్చే సైనికాధికారి ‘ఎల్లు రవుతు’ మూడూర్ల ప్రజలను, పెద్దలను పిలిపించి గుడిమంటపంలో సభ చేసి, దానం విషయమై విన్నపం చేసినాడు. మల్లినాథదేవుని గుడికి దానంచేసేందుకు తనకధికారం లేనందువల్ల తనలెంక ద్వారా రాజు ప్రజలకు విన్నపం చేసివుంటాడు.
అపుడు ఆ పెద్దలందరు తాము దున్నుకుంటున్న భూములమీద మర్తురు(1న్నర ఎకరం)భూమికి 1చిన్నం చొప్పున దేవునికి దానం చేయాలని తీర్మానించారు. అంటే ఇట్లా దానాలకు, పన్నులకు ఆనతిచ్చు అధికారం నాటి ప్రజాసభలకుండేదని తెలుస్తున్నది. అన్ని(?)వృత్తుల మీద కూడా 1గద్యాణం పన్ను విధించారు. గుడిలో దీపాని కొరకు 5ఆవులనిచ్చి, వాటి కోడెలను అమ్మి నూనె కొనమన్నారు. పెయ్యలను జన్నెకొదలిన దేవుని మందలోనే వుంచాలన్నారు.
ఈ శాసనం ప్రజాసంఘాల అధికారాలను వివరించే మంచి ఉదాహరణ.
ఆధారం: నల్గొండ జిల్లా శాసన సంపుటి: శాసన సంఖ్య-89, పేజి సం. 252,253,254
ఇంక్రియాల్ శాసనపాఠం:
‘‘స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శక వ
రుసాలు 1214 అవు నందన సం
వత్సర చైత్ర శు3గు నాండు స్వస్తి
సమధిగత పంచమహాశబ్ద మహా
మండలేశ్వర కాకతియ్య ప్రతాపరుద్ర
దేవరాజులు ఓరుగంట సుఖలీలా వినో
దంబులు బ్రిథ్వీరాజ్యంబు సేయుచునుండంగా
ను స్వస్తి శ్రీ మన్మహా మండలేశ్వర పెండ్లి
కొడ్కు మల్లిదేవ మహారాజుల లెంక ఎల్లు
రవుతు మాడూ వెనకరేవులు, రేవురేల రు
ద్రపురము మూండు ఊడ్ల కాంపులా
అశేషప్రజాను పిల్వంబంచి శ్రీమల్లినాథ
దేవర సభామండపమందు వారికి దండము
వెట్టి వింనపము సేస్తేని ఆ పెక్కండ్రూను ఆ
నతిచ్చిన క్రమము ఎట్లంనను మల్లినాథదేవ
ర భోగానకు సూర్యచంద్రులు కలంతదాం
కాను చెల్లనిచ్చిన పంనుక్రమము మూండూ
డ్ల నీరునేలాను మర్తురు చింనము లెక్క
ను చెల్లనిచ్చిరి ఇధర్మము ఎవ్వరు ప్ర
తి పాలించిరి వారి శ్రీపాదధూళి మా
శిరస్సుది. మీధర్మము ఎవ్వరు నిగ్రహ
ముసేసిరి వారి ఏకావింశతి
పితాడ్లూను అధోగతిం బడుదురు
యిధర్మానకు సాక్షులు మల్లినాథ
దేవరాను భూమి దేవతాను సూ
ర్యచంద్రులు సాక్షి మాడూ దేవర
దీపానకిచ్చిన అయిదు మొదవులకు
కోడెలు ఎన్నిపుట్టినాను దీపము చమ
రునే అమ్మేది పెయ్యలు ఎన్ని పుట్టినా
దేవరి జన్నే పెట్టేది
దేవబ్రాహ్మణ
వ్రిత్తులు మొదలుగా
ను చెల్లనిచ్చిన పన్ను(గ)