కరోనా విలయతాండవంతో తెలంగాణ ప్రజలు సర్వం కోల్పోయాక ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ని అనుమతించడం చేతులుకాలాక ఆకులు పట్టుకునే చర్య
పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇప్పటివరకూ కట్టిన రూ.2వేల కోట్లని కేసీఆర్ సర్కార్ తిరిగి ప్రజలకు చెల్లించాలి : ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్
ఆయుష్మాన్ భారత్ పై పూర్తి గైడ్ లైన్స్ విడుదల చేయాలి.
ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ పై చర్యలేవీ ?
రెమిడిసివిర్ ఇంజెక్షన్ ని హోర్డింగ్ చేస్తున్నందుకు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి
కరోనా కట్టడికి స్టేట్ లెవల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి
బాధితులకు కోటి రూపాయిల నష్ట పరిహారం చెల్లించాలి—————————————————-హైదరాబాద్, మే 19.
‘కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలో చేర్చకుండా తెలంగాణ ప్రజలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడా మాట తప్పి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పధకం గురించి మాట్లాడుతున్నారని, కేసీఆర్ తీసుకుంటున్న ఇలాంటి అలసత్వంతో కూడుకున్న నిర్ణయాలు తెలంగాణ సమాజం పట్ల శాపంగా మారాయని వివరించారు దాసోజు. ఆయుష్మాన్ పధకం కంటే ఆరోగ్య శ్రీనే మేలని గతంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఆయుష్మాన్ పధకం అమలు చేసే దిశగా వెళ్లడం ఒక విధంగా సంతోషంగానే వున్నా .. అసలు ఈ బుద్ది మొదటి నుంచే ఎందుకు లేదని ప్రశ్నించారు దాసోజు. గత మూడు నెలల్లోనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయిలు పేద ప్రజలు హాస్పిటల్స్ కి బిల్లుల రూపంలో కట్టారని, రక్తాన్ని ధారబోసి సంపాయించిన డబ్బుని ప్రాణ భయంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కి ధారబోసారని, ఆ డబ్బుని కేసీఆర్ ప్రభుత్వం తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు దాసోజు.
”కోవిడ్ మీద యుద్ధం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రగతి భవన్ లో కూర్చుని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు కేసీఆర్ కు లేదు. మీకు చేతకాకపొతే పది మందిని సంప్రదించి ప్రజలకు ఏది మంచి చేస్తుందో అలాంటి నిర్ణయాలు తీసుకోండి అంతే కానీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యం కాదు” అని సూచించారు దాసోజు.
”గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారం ఆయుష్మాన్ భారత్ లో కేవలం 26లక్షల మందికి , అదే ఆరోగ్య శ్రీ లో ఐతే 77లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. ఐతే ఇప్పుడు మిగతా 51 లక్షల మందికి ఏ విధంగా న్యాయం చేకూర్చుతారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఆయుష్మాన్ భారత్ ని అన్వయించుకుంటున్న నేపధ్యంలో ప్రజల అనుమానాలు నివృత్తి చేసేలా పూర్తి స్థాయి గైడ్ లైన్స్ విడుదల చేయాలి” అని కోరారు దాసోజు
”మెడికల్ పాలసీ ఉన్నప్పటికీ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కింద చాలా హాస్పిటల్స్ అంగీకరించడం లేదు. కరోనా బాధితుడు ప్రైవేట్ హాస్పిటల్ కంటికి ఏటీఎం మిషన్ లా కనిపిస్తున్నాడు. ప్రజల రక్తం తాగుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలి. గతంలో జీవో 248 తీసుకొచ్చారు. ఈ జీవో చెత్త బుట్టకె పరిమితమైయింది. ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ విషయానికి వస్తే ఐదు లక్షల వరకూ పరిమితి వుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు చూస్తుంటే ఒక్క పేషేంట్ కె ఐదు లక్షల బిల్ వేస్తుంది. మరి కుటుంబాల్లో నలుగురు బాధితులు ఉంటే చికిత్స ఎలా ? ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తునే, ఆరోగ్య శ్రీని కోవిడ్ చికిత్సలో చేర్చుతూనే , గతంలో తెచ్చిన జీవోని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు దాసోజు
”ప్రతి జిల్లాలో నిమ్స్ వంటి హాస్పిటల్ నిర్మించడంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజిక వర్గంలో 100 పడకలు, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని టీఆర్ఎస్ 2014 లో తన మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఈ వాగ్దానం ఇప్పటికీ అమలు కాలేదు. ఇప్పుడు హాస్పిటల్స్ నిర్మాణం చారిత్రాత్మక అవసరం. యుద్ధ ప్రాతిపాదికన హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టండి” అని డిమాండ్ చేశారు దాసోజు.
కరోనా కట్టడి విషయంలో నిపుణులతో స్టేట్ లెవల్ ఎఫెక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. రాష్ట్రంలో చాలా మంది నిపుణులు వున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అపూర్వమైన అనుభవం వున్న మర్రి శశిధర్ రెడ్డి మన రాష్ట్రంలోనే వున్నారు. 104, 108కి రూపకల్పన చేసిన సత్యం రామలింగ రాజు లాంటి వ్యక్తులు.. హైదరాబద్ లోని వున్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ .. సంబధిత అధికారులు.. నిపుణులైన డాక్టర్లు, వివిధ రాజకీయా పార్టీలకు చెందిన నాయకులు .. ఇలా అనుభవం వున్న నిపుణులతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడం అందరి భాద్యత. దయచేసి ఇంక అలసత్వం వహించకుండ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని స్టేట్ , జిల్లా, మండల్, డివిజన్ వైజ్ గా ఏర్పాటు చేయండి. రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన సమయమిది” అని కోరారు దాసోజు.
”మంత్రి కేటీఆర్ ఇలాంటి విపత్కర సమయంలో కూడా తన ఇమేజ్ ని పెంచుకునే పనిలో బిజీగా వున్నారు. కరోనా మందులని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ట్వీట్ చేసిన వారికీ ముందులు ఇస్తున్నారు. ఇది దారుణం. ఎవరైనా మందులని అలా గుపెట్లో పెట్టుకుంటే నేరం. ఒక మంత్రిగా అలాంటి పని కేటీఆర్ ఎలా చేయగలుగుతున్నారు. మందులు అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ విధంగా వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అంతే గానీ ట్వీట్ చేస్తే మందులు ఇచ్చి హీరోయిజం బిల్డప్ ఇవ్వడం తగదు. రెమిడిసివిర్ లాంటి మందులు దాచి పెట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీవో తెచ్చారు. మరి మంత్రి కేటీఆర్ పై ఆ జీవోతో ఎందుకు కేసు పెట్టడం లేదు” అని ప్రశ్నించారు దాసోజు.
‘’ప్రైవేట్ హస్పిటల్స్ దోపిడీ నుండి ప్రజలని కాపాడే బాధ్యత ప్రభుత్వానిపై వుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు వ్యవహరిస్తోంది. గత మూడు నెలలుగా దాదాపు 20వేల కోట్ల రూపాయిలు ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేశాయి. చనిపోయిన శవాలని కూడా వదలలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఈ దోపిడీని అరికట్టడానికి ఒక్క చర్య కూడా తీసుకోలేదు. జూలై తెచ్చిన 240 జీవో ని ( రోజుకి రూ. 7500) అమలు చేయలేకపోయింది. లక్షల రూపాయిలు ప్రజల దగ్గర దోచుకుంటుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ? బిల్ కట్టకపోతే శవాన్ని కూడా వదలడం లేదని అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఒక్క దానిపై కూడా స్పదించలేదు. ట్విట్టర్ లో మెడిసన్ ఇచ్చే కేటీఆర్ కూడా దీనిపై కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఎందుకు ? ఇంత దాష్టికం జరుగుతున్నా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు లేవు. అసలు రాష్ట్రం లో పాలన ఉందా ? జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటే కాదు ఇంతటి దాష్టికానికి పాల్పడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పట్ల చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు దాసోజు.
మాస్క్ లేకపోతె ఫైన్ కట్టాలని జీవో తెచ్చారు. అలా రూ. 35కోట్ల రూపాయిలు ఫైన్ కూడా వసూలు చేశారు. మరి ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ పై కూడ తెచ్చిన జీవోని ఎందుకు ఇంత శ్రద్ధగా అమలు చేయలేకపోతున్నారు. దయచేసి ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అరికట్టండి” అని డిజిపిని కోరారు దాసోజు.
వ్యాక్సినేషన్ ని వేగవంతం చేయాలి. ప్రతి వీధిలో వ్యాక్సినేషన్ డ్రైవ్స్ నిర్వహించాలి. అలాగే కరోనా తో అనేక మంది అనాధలయ్యారు. కుటుంబ పెద్దలని కోల్పోయారు. ఆంధ్ర ప్రదేశ్ లో అనాధలైన పిల్లలకు 10లక్ష చొప్పున పరిహారం ఇచ్చారు. తెలంగాణ కూడా అది అమలు చేయాలి. వారి ఉచిత విద్యతో పాటు వారి కోసం స్పెషల్ గా ఒక పాలసీ తీసుకురావాల్సిన అవసరం వుంది,. చాలా మంది జర్నలిస్ట్ సోదరులు కరోనాతో ప్రాణాలు విడిచారు. వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి. చనిపోయిన వారి కుటుంబానికి ఒక కోటి రూపాయలకు తగ్గకుండా సాయం అందించాలి. అలాగే ఎన్నికల విధులు నిర్వహించిన అనేక మంది ఉద్యోగులు చనిపోతున్నారు. ఎవరి ఆదేశాలు మేరకు ఎన్నికలు జరిగాయో ప్రజలకు తెలుసు. నాగార్జున సాగర్ ఈ రోజు కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఎన్నికల విధులు నిర్వహించిన అనేక మంది చనిపోతున్నారు. వారిందరికీ కూడా కోటి రూపాయిల నష్టపరిహారం చెల్లించాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

