చావు భయం కన్నా…గడప దాటక పోవడమే మిన్న

0
86

గాంధీ ఆస్పత్రి ఎదురుగా..!
అంబులెన్స్ లో
ఆక్సీజన్ సిలెండర్ తో
గాలి పీలుస్తూ బెడ్డు కొరకు
ఎదురు చూసేకంటే…!
నీవు జైలనుకుంటున్న
నీ ఇంటి కిటికీ లోనుండి
స్వచ్ఛమైన గాలి పీలుస్తూ
పరిసరాలు చూడ్డం
ఆనందం కాదా….!!

ఎక్కడో ఆసుపత్రి లో
రోగులు, శవాల మధ్య
బిక్కు బిక్కు మంటూ
గడపడం కంటే..!
నీ ఇంట్లో నీ వాళ్ల మధ్య
ఉండడం సుఖం కాదా…!!

దూరం నుండి పారేసే
రుచి , పచి లేని తిండి కంటే..
నీ ఇంట్లో నీవారు
వండి వడ్డించే భోజనం
రుచికరం కాదా…!!

హాస్పిటల్ చూరును
చూస్తూ రేపు ఉంటానో
లేదో
అని
క్షణ క్షణం ఘడియలు
లెక్క పెడుతూ గడిపే కంటే..!
భవిష్యత్తు గురించి
కలలు కంటూ నీ హాల్లోనే
టీ వీ చూస్తూ ఉండడం
హాయి కాదా…!!

చావు భయంతో అగుపించే యమభటుల
సావాసం కంటే
నీ కంటి పాపలైన
నీ పిల్లలతో
సహవాసం
అద్భుతం కాదా…!!

ఆసుపత్రిలో బెడ్డు కొరకు
కాని వాళ్ళందరి
కాళ్లు పట్టుకునే కంటే..!
నీ పడక గదిలోని
బెడ్డు పై పడుకుని
కలలు కనడం అదృష్టం కాదా…!!

బ్లాకులో మంచాలకు
మందులకు లక్షలు పారబోసుకుని
అప్పుల పాలయ్యేకంటే..!
ఒక నెల రోజులు
ఇంట్లోనే ఉండి లక్షలు ఆదా చేసుకోవడం తెలివైన పని కాదా…!!

పదిహేను రోజులు
నరకం చూపే హాస్పిటల్ కన్నా
పదిలమైన నీ ఇల్లే ఎప్పటికీ మిన్న..!!
బయటకెళ్లి నీవు వెలగ బెట్టే రాచకార్యాలిపుడు సున్నా..!
నీ ఇంట్లో ఉండి నీవు చేసే
నీ ఇంటి పనులే
ఇపుడు గొప్ప ఎవరేమన్నా.!

మన క్షేమమే దేశ క్షేమం
మన హితమే జన హితం
ఇక
నిర్ణయం మనదే…!
ముమ్మాటికీ
మనదే….!!