◆ పిల్లలు వైరస్ క్యారియర్లుగా మారబోతున్నారా?
◆ మున్ముందు మరిన్ని కరోనా వేవ్స్ ప్రమాదం
◆ పిల్లలపై ప్రభావం చూపుతుందా అని అంచనా వేస్తున్న కేంద్రం
◆ పిల్లలు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనా?
న్యూఢిల్లీ…. మున్ముందు మరిన్ని కరోనా వేవ్స్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేవ్‌లు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ విషయంపై నీతి ఆయోగ్ సభ్యుడు, జాతీయ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ వీకే పాల్ స్పందించారు. రాబోయే కరోనా వేవ్స్ పిల్లలపై ఎంతగా ప్రభావం చూపుతాయనేది కచ్చితంగా చెప్పలేమని పాల్ అన్నారు. అప్పటి మ్యూటెంట్లను బట్టి దీన్ని అంచనా వేయాల్సి ఉంటుందన్నారు. చాలా మంది పిల్లలలో కరోనా లక్షణాలు కనిపించకపోవచ్చునని, ఒకవేళ ఉన్నా తీవ్రమైన లక్షణాలు ఉండవన్నారు. కానీ పిల్లలు వైరస్ క్యారియర్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకే పిల్లలు కూడా మాస్కు వేసుకోవాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించారు. పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలనే విషయంపై ప్రోటోకాల్ ను అందుబాటులో ఉంచామనన్నారు. 2 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల విూద కొవ్యాక్సిన్ ట్రయల్స్ మరో 12 రోజుల్లో మొదలవుతుందని పేర్కొన్నారు.