న్యూయార్క్
వాస్తవికతకు అద్దంపట్టని కరోనా అధికారిక గణాంకాలు
దాదాపు 42 లక్షల మంది మృతి.. 70 కోట్ల మందికి కొవిడ్
‘న్యూయార్క్ టైమ్స్’ అంచనా.. ప్రాతిపదికగా సీరో నివేదికలు
భారత్ ప్రకటిస్తున్న కరోనా కేసులు, మరణాల గణాంకాల్లో వాస్తవమెంత?..క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ వార్తాపత్రిక సేకరించిన సమాచారంలో నివ్వెరపరిచే విషయాలు వెలుగుచూశాయి.
ఇందుకోసం 12 మందికిపైగా నిపుణుల సహకారాన్ని తీసుకున్నారు.మూడు సీరో సర్వేల సమాచారం, గణాంకవేత్తల సూచనలు ప్రాతిపదికగా అంచనా నివేదికను రూపొందించారు.
మే 24 నాటికి దేశంలో కరోనా కేసులు 2.69 కోట్లు, మరణాలు 3.07 లక్షలు ఉన్నాయని భారత ప్రభుత్వం చెబుతోంది. అధికారిక లెక్కల కంటే కరోనా కేసులు 26 రెట్లు ఎక్కువగా నమోదై ఉంటే 70.7 కోట్లకు, మరణాలు 42 లక్షలకు చేరి ఉండొచ్చని పేర్కొనడం గమనార్హం.
గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు కొవిడ్ మరణాలు ఇళ్ల వద్దే సంభవించడం, కొవిడ్‌కు సంబంధించిన యంత్రాంగం పటిష్టంగా లేకపోవడం వల్ల అధికారిక కేసులు, వాస్తవిక గణాంకాల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని నిపుణులు విశ్లేషించారు.