హైదరాబాద్ ప్రతినిధి, ఆగస్టు 22.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాలు ప్రత్యక్ష తరగతుల బోధనకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధనకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించిన నేపథ్యంలో ఆ మేరకు సొసైటీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ నెల 25లోగా శానిటైజేషన్ ప్రక్రియ పూర్తిచేసి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు భోజన, వసతి ఏర్పాట్లపై నివేదికలు సిద్ధం చేయాలని క్షేత్రస్థాయి సమన్వయకర్తలకు సూచించాయి. 8, 9, 10, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించాయి. తరగతి గదికి 20-25 మంది చొప్పున ఉండేలా మౌలిక వసతులు కల్పించాలని, అందుకనుగుణంగా ఉపాధ్యాయులకు విధులు కేటాయించాలని ఆదేశాలిచ్చాయి. ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే విద్యార్థులను తొలుత 10 రోజులు పాఠశాలలోనే క్వారంటైన్‌లో పెట్టాలని, ఆ తరువాత ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే తరగతి గదుల్లోకి అనుమతించాలని సొసైటీలు భావిస్తున్నాయి.


