హంపి దావత్ జగదీష్ రెడ్డి మెడకు …
గులాబీ పార్టీలోని కదుపులో కొత్త ట్విస్ట్..
అసలు కథ నడిపింది అల్లుడు మంత్రే..
కేసీఆర్ నమ్మినబంటు, మంత్రి జగదీష్ రెడ్డి కుమారుడు బర్త్ డే సందర్భంగా కొద్ది రోజుల క్రితం కర్నాటక రాష్ట్రంలోని హంపిలోని ఒక ఫాంహౌస్ లో పార్టీ ఏర్పాటు చేశారు.పక్క రాష్ట్రంలో జరిగిన ఒక బర్త్ డే పార్టీ టీఆర్ఎస్ రాజకీయాల్లో కల్లోలం రేపుతోంది. చినికి చినికి ఈటెలపై వేటు దాకా వెళ్లిన ఈ ఘటన తాజాగా మరో మంత్రిని బలి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ అత్యంత నమ్మినబంటుగా ముద్ర పడిన మంత్రి జగదీష్ రెడ్డికి రేపో మాపో కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదంటున్నారు. కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని హంపీలో జగదీష్ రెడ్డి కుమారుడి బర్త్ డే పార్టీ సందర్బంగా జరిగిన సంఘటనల ప్రకంపనలు టీఆర్ఎస్ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. కేసీఆర్ నమ్మినబంటు, మంత్రి జగదీష్ రెడ్డి కుమారుడు బర్త్ డే సందర్భంగా కొద్ది రోజుల క్రితం కర్నాటక రాష్ట్రంలోని హంపిలోని ఒక ఫాంహౌస్ లో పార్టీ ఏర్పాటు చేశారు. తనకు బాగా సన్నిహితులు అనుకున్న నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో పాటు, అధికారంలో వివిధ హోదాలను అనుభవిస్తున్న పలువురు పురప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు.
హుషారుగా పార్టీ మొదలైంది. కేసీఆర్ పాలన పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సదరు పురప్రముఖులు మనసులో మాట బయట పెట్టడం మొదలు పెట్టారు. పాలన పూర్తిగా కుటుంబమయమైపోయిందని… పెత్తనం మొత్తం తండ్రి దగ్గరే ఉందని కడుపులో ఆవేదనను ఒక్కొక్కరుగా వెళ్లగక్కడం మొదలు పెట్టారు. ఈటల రాజేందర్‌పై అధిష్టానం కత్తికట్టిన వైనంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.” పెద్దసారు నెంబర్ వన్ నియంత. కాకపోతే పెద్ద మనిషి…! మొదటి నుంచి మంచో చెడో ఆయనతో ఉన్నాం, నచ్చినా నచ్చకపోయినా సంసారం చేస్తాం. కానీ, రేపొద్దుగాల చిన్నసారు సీఎం అయితే… భరించుడు మనతో ఐతదా…!? అన్న కోణంలో చర్చ డీప్‌గా నడుస్తోంది. సరిగ్గా ఆ సమయంలో… సహజంగా కళాకారుడైన ఓ ఎమ్మెల్యే… ప్రస్తుతం కేసీఆర్ నియంత పాలన, రేపొద్దున కేటీఆర్ సీఎం అయితే చిన్నసారు నియంత పాలన ఎట్లుంటదో తనదైన శైలిలో ఊహించుకుని, పాటకట్టి అక్కడి వారందరినీ “రసమయం”లో ముంచి లేపారట. రాష్ట్రం కాని రాష్ట్రం… సంబంధం లేని మనుషులు… ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ మనసులో మాట చెప్పుకోగలం అన్నట్టు ఎవరికి వారు రెచ్చిపోయారని సమాచారం. అలా… ఆ అర్థరాత్రి పార్టీ ముగిసింది. తెల్లావారు… పెట్టేబేడా సర్దుకుని సొంత ప్రాంతానికి ప్రయాణమయ్యారు సదరు వీఐపీలు.
సీన్ కట్ చేస్తే… హంపిలో పెద్దసారు ఫ్యామిలీ పై “రస”వత్తరంగా పాట పాడిన ఎమ్మెల్యే ఏదో పని కోసం చిన్నసారు అపాయింట్ మెంట్ కోరారట. అపాయింట్ మెంట్ ఇచ్చిన చిన్నసారు… సదరు ఎమ్మెల్యే తన రూంలోకి రాగానే హంపిలో ఆ రాత్రి “రస”వత్తరంగా పాడిన పాటను హమ్ చేయడం మొదలు పెట్టారట. చిన్నసారు నోటి వెంట ఆ పాట వింటూనే సదరు ఎమ్మెల్యేకు గుండెజారి గల్లంతైనంత పనైందట. అంతే… పెదరాయుడు సినిమాలో ధనూష్ లాగా “నీ బాంఛన్ నన్నొదిలెయ్ రాదే… అదేదో పొరపాటున జరిగిపోయింది” అని సదరు ఎమ్మెల్యే చిన్నసారు దగ్గర కాళబేరానికి దిగారట. మళ్లెప్పుడూ ఇట్లాంటి వేషాలు వేయకు అని చిన్నసారు చిన్నక్లాసుతోనే సరిపెట్టి ఆ ఎమ్మెల్యేను క్షమించి పంపేశారట. అంతటితో ఊపిరి పీల్చుకుందామంటే… కథ మరో మలుపు తిరిగింది.
సేమ్ బర్త్ డే బ్యాచ్ ఆ తర్వాత కొద్ది రోజులకు మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలుసుకున్నారట. ఈ సందర్భంగా హంపి వీడియో ఎలా లీకైంది అన్న ఇంటరాగేషన్ స్టార్ట్ అయిందట. మనలో ఎవరో ఒకరే లీక్ చేయాలి అన్న కోణంలో టాపిక్ స్టార్ట్ అయి… వేళ్లన్నీ ఓ కిరణం వైపు చూపాయట. అంతే… సీన్ వేడెక్కింది. తనను తప్పుపట్టడం పై ఆ కిరణం… “ఘంటా” బజాయించి గొడవకు దిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా ఆ క్వార్టర్స్ లో ఓ మినీ కురుక్షేత్రమే జరిగినట్టు తెలిసింది.
మళ్లీ సీన్ కట్ చేస్తే… హంపి నుంచి మినిస్టర్ క్వార్టర్స్ వరకు జరిగిన సీన్ మొత్తం తెలుసుకున్న ఓ “గుండెచప్పుడు” ప్రతినిధి ఈ హంపిమజిలీ కథ మొత్తాన్ని తనకు సన్నిహితుడైన అల్లుడు మంత్రికి మోసేశారట. చాలా కాలంగా పెద్దసారు కరుణాకటాక్షాలు కొరవడి… తన రాజకీయ భవిష్యత్ కొడిగట్టిన దీపంలా అయిపోయిందని ఆవేదనతో కుమిలిపోతున్న అల్లుడు మంత్రికి ఈ స్టోరీ మొత్తం తెలియగానే ఎగిరిగంతేసినంత పనైందట.
పెద్దసారు సన్నిధికి ఎలా చేరాలా అని ఎన్నాళ్ల నుంచో చెకోరపక్షిలా ఎదురు చూస్తోన్న సదరు అల్లుడు మంత్రి… అప్పటికప్పుడు పథక రచనకు తెర తీశారట… “అపాయింట్ మెంట్ ప్లీజ్… అర్జెంట్ మేటర్” అని పెద్దసారుకు కబురు పంపారట. అపాయింట్ మెంట్ ఫిక్స్ అయిందే ఆలస్యం… జెట్ స్పీడుతో ప్రగతి భవన్ కు వెళ్లి పెద్ద కుట్ర జరిగిపోతోందని పెద్దసారు ముందు సినిమా ఓపెన్ చేసేశారట అల్లుడు మంత్రి.
ఈ కుట్రకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఈటెలదేనని…త్వరలో కొత్త పార్టీ రాబోతోందని… హంపి నుంచి క్వార్టర్స్ వరకు జరిగిన చర్చల సారాంశం ఇదేనని పూసగుచ్చారట అల్లుడు మంత్రి. దీనికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారట. పరిష్కారం ఏంటంటే ఈటెల పై వేటేనని కూడా సలహా ఇచ్చరాట. అప్పటికే ఈటెల పై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న పెద్దసారుకు అల్లుడు మంత్రి మోసుకొచ్చిన తాజా సమాచారంతో అరికాలి మంట నషాళానికి అంటిందట. అంతే… చక చకా ప్లాన్ రెడీ అయింది. భూముల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చి ఫస్ట్ వికెట్ అయిన ఈటలను ఔట్ చేశారట.
ఆ విషయం అటుంచితే… నిన్నటి దాకా అల్లుడు మంత్రి, ఈటల ఒక్కటే అన్న టాక్ నడిచింది. ఏదైనా ఈ ఇద్దరు కలిసే ఉంటారన్న వాదన ఉంది. ఈటలను కొట్టేసి అల్లుడు మంత్రిని ఒంటరిని చేశారట అనే ప్రచారం ఉంది. కానీ, అదంతా ఒట్టి ట్రాష్ అని తేలిపోయింది. ఈటలపై అసలు వేటు వేయించిందే అల్లుడు మంత్రి అని తేలిపోయింది. వేటులో కీ పాత్ర అల్లుడు మంత్రిదేనని స్పష్టమైపోయింది. అల్లుడు మంత్రి ఇంత డేంజరా… నమ్మినవాడిని, దగ్గరవాడిని తన రాజకీయ అవసరం కోసం ఇంతలా కోసేస్తాడా…!? పోటు పొడిచేస్తాడా…!? అన్న టాక్ ఇప్పుడు టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. మొత్తం ఎపిసోడ్లో పెద్దసారు అవసరం పెద్దసారుకు తీరిపోయింది. అల్లుడు మంత్రి పర్పస్ కూడా సర్వ్ అయింది. ఎటుతిరిగి ఇద్దరిని నమ్ముకుని ఉన్న వాళ్లలో ఈటెల ఔట్ అయిపోయాడు. మిగతా వాళ్ల మెడపై కత్తి వేలాడుతోంది.
ఇక జగదీష్ రెడ్డి విషయానికి వస్తే… ఈ రోజు ఓ ఇంగ్లీష్ పేపర లో జగదీష్ పై వేటు అని స్టోరీ వచ్చింది. హంపి పార్టీకి మూలపురుషుడు, ఆ పార్టీలో తనపై, తన తన కుటుంబం పై మాటలు, పాటలతో ముప్పేట దాడి జరుగుతున్నా వారించకుండా నిమ్మకునీరెత్తినట్టు ఉన్న మంత్రి జగదీష్ రెడ్డిపై ఇప్పుడు పెద్దసారు గుర్రుగా ఉన్నారట. రేపో మాపో గుంటకండ్ల కూడా కేబినెట్ నుంచి హుష్ ఫటాక్ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.