
👉 దశలవారీగా కాకుండా రాష్ట్రంలోని దళితులకు ఒకేసారి సాయం చేయాలి
👉 అంబేద్కర్ ఆశయాల కోసం అందరం కృషి చేయాలి
👉 భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నేడు భువనగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ భువనగిరి మండలం బండసోమరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ. రామలింగేశ్వర స్వామి ఆలయానికి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అలాగే పెంచికలపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దళిత, గిరిజన, బహుజనులకు అండగా నిలిచిన అంబేద్కర్ అందరకీ స్పూర్తిగా నిలుస్తారని తెలిపారు. కాబట్టి అంబేద్కర్ ఆశయాల కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని దశలవారీగా కాకుండా రాష్ట్రమంతా ఒకేసారి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. హుజురాబాద్ ఎన్నికల గురించే కాకుండా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఉన్న దళితులకు సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే నూతనంగా మంజూరైన వంగపల్లి బ్రిడ్జి, అనంతారం అండర్ పాస్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. గౌరెల్లి నుంచి భద్రాచలం వరకు నూతనంగా మంజూరైన జాతీయ రహదారి ఎన్‌హెచ్ నెం. 930 పి కోసం రూ. 2200 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. భువనగిరి కోట అభివృద్దికి డీపీఆర్‌లు సిద్దమవుతున్నాయని… త్వరలోనే రాష్ట్రంలో భువనగిరి కోట పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు.