- వీసీ పదివి నుంచి ప్రొ. అప్పారావు తొలగింపుతో హెచ్‌సీయూకి పట్టిన పీడ వదిలింది. ప్రొ. అప్పారావు అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. ఆర్ధిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్
- హెచ్‌సీయూ వీసీ పదవి నుంచి ప్రొ. అప్పారావుని తొలగించడం, అమరవీరుడు దళిత విద్యార్ధి రోహిత్ వేములకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న మద్దతుదారుల విజయం. రోహిత్ వేముల ఆత్మహత్యానంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం దాల్చితే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మాత్రమే న్యాయం కోసం పోరాడారు.
- అప్పారావు హయంలో తెలంగాణ బిడ్డలకు తీరని అన్యాయం. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు. అర్హత వున్న తెలంగాణ బిడ్డలని పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం ఒక వర్గానికి చెందిన స్థానికేతరులకు ప్రాధాన్యం.
- వీసి పదవికి ప్రొ. అప్పారావు మాయని మచ్చ. యూనివర్సిటీ నియమ, నిబంధనలని తుంగలో తొక్కిన ప్రొ. అప్పారావు. రాజ్యంగబద్ద రిజర్వేషన్లు సైతం అమలు చేయని దుస్థితి. రోస్టర్ పాయింట్స్ అపహాస్యం ఎస్స్సీ, ఎస్టీ, ఓబిసి విద్యార్థులని అణిచివేయడమే లక్ష్యంగా పని చేసిన ప్రొ. అప్పారావు. హెచ్‌సీయూలో అక్రమ నిర్మాణాలని ప్రోత్సహించిన అప్పారావు. అప్పారావు హయంలో వెనకబడ్డ హెచ్‌సీయూ.
”యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సులర్ ప్రొ. పొదిలె అప్పారావు తొలగింపుతో యూనివర్సిటీకి పట్టిన పీడ వదిలిందని అభిప్రాయపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ప్రొ. అప్పారావు తొలగింపుతో యూనివర్సిటీలో అణిచివేత, అధికార దుర్వినియోగానికి చరమగీతం పాడినట్లయిందని పేర్కొన్నారు. హెచ్‌సీయూ వీసీ పదవి నుంచి ప్రొ. అప్పారావుని తొలగించడం, అమరవీరుడు దళిత విద్యార్ధి రోహిత్ వేములకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న మద్దతుదారుల విజయమని పేర్కుంటూనే ప్రొ. అప్పారావు హయంలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు దాసోజు.
ఈ సందర్భంగా హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఉదంతని గుర్తు చేసుకున్న దాసోజు శ్రవణ్ .. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రొ. అప్పారావే కారణమని, విద్యార్ధులంతా ప్రొ. అప్పారావు రాజీనామాకు డిమాండ్ చేసినప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తేలుకుట్టిన దొంగలా మౌనంగా వుండిపోయినా కానీ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఒక్కరే.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద రోహిత్ కి మద్దతుగా సమ్మె చేసి న్యాయం కోసం పోరాడారని పునరుద్ఘాటించారు దాసోజు.
ప్రొ. అప్పారావు హయంలో హెచ్‌సీయూ ప్రగతి కుంటుపడిందని ఆరోపించిన దాసోజు.. ఎస్స్సీ, ఎస్టీ ,ఓబిసి విద్యార్థులని అణిచివేయడమే లక్ష్యంగా చేసుకొని, ప్రశ్నించిన విద్యార్ధులు, అధ్యాపకులు, బోధనేతర సభ్యులని మానసిక వేదనకు గురిచేశారని, క్రమ శిక్షణని బోధించాల్సిన వ్యక్తి కక్ష పూరితంగా వ్యవహరించారని, రోహిత్ వేముల కుటుంబాన్ని కనీసం మానవత్వంతో పరామర్శించలేదని” విమర్శించారు దాసోజు.
”రూ. 1000 కోట్ల ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా విద్యార్ధుల ఫెలోషిప్ , స్కాలర్‌షిప్ కోసం విడుదల చేయలేదు. కేవలం నిర్మాణాలకు మాత్రమే ఉపయోగించి, విద్యార్ధులకు అన్యాయం చేశారు. అప్పారావు హయంలో యూనివర్సిటీ ర్యాంక్ కూడా వెనకబడింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2016 లో 4 వుంటే 2020 లో 6 కి పడింది. ప్రతిష్టాత్మక వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్స్ లోనూ 2021లో 50 ర్యాంక్ ల మేర దిగజారింది” అని వెల్లడించారు దాసోజు.
” అప్పారావు నిర్లక్ష్యం కారణంగా విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్ధుల ఆత్మ హత్యలపై ఆయన ఏనాడూ స్పందించాలి. సకాలంలో వైద్యం అందక చనిపోయిన విద్యార్ధులు కూడా వున్నారు. అమాయక విద్యార్ధి ప్రాణాలు పోతున్నా ఆయన ఏనాడూ చలించలేదు. మానవత్వం లేకుండా ప్రవర్తించడమే కాకుండా తన అసమర్ధని కప్పుకునే ప్రయత్నం చేశారు” అని విమర్శించారు దాసోజు.
”అప్పారావు తన పదవి కాలంలో యూనివర్సిటీ నియమ, నిబంధనలని తుంగలో తొక్కారు. రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన రిజర్వేషన్ విధానాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేదు. అడుగడుగునా యూజీసీ నిబంధనలను అతిక్రమించారు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎన్‌సిబిసి) వంటి రాజ్యాంగ సంస్థలు, హైకోర్టు తీర్పులు, ఆదేశాలు ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశాడనేదానికి నిదర్శనం” అన్నారు దాసోజు.
”హెచ్‌సీయూలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రొ. అప్పారావు వీసీ స్థానంలో ప్రోత్సహించారు. రిజర్వేషన్లని తుంగలో తొక్కారు. రోస్టర్ పాయింట్స్ విధానాన్ని అపహాస్యం చేశారు. ప్రొ. అప్పారావు హాయంలో అనేక ఆర్ధిక అవకతవకల జరిగాయి. తన స్వప్రయోజనాలు కోసం అర్హత లేని వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వడం, తన వర్గం చెందిన వారిని ప్రోత్సహించడం, తెలంగాణ బిడ్డలకు కాకుండా స్థానికేతరులకు ప్రాధాన్యత, వెనుకబడిన వర్గాల విద్యార్ధుల అవకాశాలని మరొకరి అందేలా కుట్ర.. ఇలా చాలా అక్రమాలు జరిగాయి. ఈ అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.
