50 వేల లోపు రుణాల మాఫీకి నిర్ణయం:కేబినేట్ మీటింగ్ లో నిర్ణయం

0
65

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం.

రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. సభ్యులుగా మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ కేటీఆర్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ ఇంద్ర కరణ్ రెడ్డి, శ్రీ జగదీశ్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు.

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాధలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని ఆదేశించిన కేబినెట్. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని ఆదేశం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై చర్చిస్తున్న కేబినెట్. దేశంలో పలు రాష్ట్రాల పరిస్థితి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి, వాక్సినేషన్, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై చర్చిస్తున్న కేబినెట్.

50 వేల లోపు రుణాల మాఫీకి నిర్ణయం:

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఇప్పటి వరకు 25 వేల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ 50 వేల వరకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందుకు ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రుణ మాఫీ ప్రక్రియను కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు పంటరుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 25 వేల రుణమాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చీలుకు రైతులు ప్రయోజనం పొందారు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 9 లక్షలకు చేరనున్నది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగుతుందని కేబినెట్ నిర్ణయించింది.

ఈడబ్ల్యూఎస్ కోటాకు విధి విధానాలు ఖరారు:

కేంద్రం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్) రిజర్వేషన్ కోటాకు, విద్యా ఉద్యోగ అవకాశాలలో 8 లక్షల లోపు ఆదాయం ఉన్న అభ్యర్థులు అర్హులని కేబినెట్ తీర్మానించింది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపునివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

వ్యవసాయం:

లాభసాటి పంటల సాగుకు ప్రాధాన్యత:
రాష్ట్రంలో ప్రస్థుతం వానాకాలం సీజన్ నడుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణ పై కేబినెట్ సమీక్షించింది. గత కొద్దికాలంగా కురుస్తున్న వర్షాలు, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు రిజర్వాయర్లు చెరువులు కుంటలల్లో నీరు చేరుతున్న పరిస్థితి, వరినాట్లు పడుతున్న సందర్భంలో, పలు రకాల పంటల సాగు ప్రారంభమైన తరుణంలో వాటికి సాగునీటి లభ్యత, రైతులకు ఎరువులు అందుబాటు, తదితర వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ అంశాలపై కేబినెట్ చర్చించింది. ఈ సందర్భంగా పత్తిసాగుపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల పత్తి సాగును రాష్ట్రవ్యాప్తంగా మరింతగా పెంచాలని కేబినెట్ ఆదేశించింది. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి, లాభసాటి పంటల సాగును మరింతగా ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

అనాథ శరణాలయాల పై చర్చ:

కరోనా కాలంలో అనాథలైన పిల్లలను కాపాడుకోవాలని నిర్ణయం:
రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన గురించిన చర్చతో కేబినెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల పూర్తి వివరాలను తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలన్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎదిగే వయస్సులో వున్న పిల్లలు ఓంటరిగా మారి మానసిక వేదనతో పాటు సామాజిక వివక్షను ఎదుర్కుంటూ సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదమున్నది. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి ప్రయోజకులయ్యేంతవరకు వారికి ప్రభుత్వమే ఆశ్రయం కల్పించి అండగా నిలవాలి. గతంలో అనాథ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు వారి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. అనాథ పిల్లలకోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలి. మానవీయ కోణంలో ప్రభుత్వయంత్రాంగం స్పందించాలి. అనాథ పిల్లల అంశానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి’’ అని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఖాళీగా వున్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ ఇంద్ర కరణ్ రెడ్డి, శ్రీ జగదీశ్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ కేటీఆర్ సభ్యులుగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బి. వినోద్ కుమార్ ఆహ్వానితులుగా కొనసాగనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల పరిస్థితుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వైద్యశాఖపై చర్చ – కరోనా వ్యాప్తి పై ముందస్తు చర్యలు:

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై కేబినెట్ కు వైద్యశాఖ వివరాలు సమర్పించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి గురించి ఆరా తీసింది. రాష్ట్రంలో కొనసాగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై కేబినెట్ చర్చించింది. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంపై, ఆయా జిల్లాల ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి సవివరంగా కేబినెట్ కు వైద్యాధికారులు సమాచారం అందించారు. సమస్యాత్మక జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సీజన్, మందులు, బెడ్స్, తదితర ఔషదాల లభ్యతపై విస్తృతంగా కేబినెట్ చర్చించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, అన్ని రకాల మందులు, ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు కేబినెట్ ఆదేశించింది. కేసులు ఎక్కువగా నమోదవున్న సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలను పర్యటించి రావాలని, తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించింది.

కరోనాను కట్టడి చేయడంలో ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని, అందులో భాగంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలను తీసుకోవాలని కేబినెట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాక్సిన్ తీసుకున్నవాళ్లు కూడా నిర్లక్ష్యం చేయకుండా స్వీయ నియంత్రణను పాటించాలని కోరింది.

వైద్యరంగాన్ని పటిష్టం చేయాలి – నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు:

నూతనంగా మంజూరు చేసిన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనపై కేబినెట్ చర్చించింది. మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావలసిన నిర్మాణాలను చేపట్టాలని, వసతుల కల్పన కోసం తగు ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. హైదరాబాద్ నిమ్స్ ను మరింతగా అభివృద్ధి పరిచి వైద్య సేవలను విస్తృత పరిచేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసి వచ్చే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది.

ఇప్పటికే మంజూరైన మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం చేయడానికి సమకూర్చుకోవాల్సిన బెడ్లు తదితర మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించింది. భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కొరకు స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటినుంచే ప్రారంభించాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశించింది.

కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై చర్చించిన కేబినెట్, వాటి సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై వైద్యాధికారుల నుంచి ఆరాతీసింది. త్వరలోనే వీటి నిర్మాణానికై శంఖుస్థాపన చేయాలని ఆదేశించింది.

గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్ దవాఖానతో పాటు, హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు ‘‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’’ (TIMS) గా నామకరణం చేయాలని కేబినెట్ తీర్మానించింది. టిమ్స్ గచ్చిబౌలి, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ ఎల్ బీ నగర్, టిమ్స్ అల్వాల్ దవాఖానాలుగా అభివృద్ధి చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్కచోటనే అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కేబినెట్ ఆదేశించింది. వరంగల్ లో ఇప్పటికే మంజూరు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పురోగతిపై చర్చించిన కేబినెట్, త్వరలో నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
పటాన్ చెరువులో కార్మికులు ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను కేబినెట్ మంజూరు చేసింది. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ స్థాపన లక్ష్యంగా, రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో ఇప్పటికీ మెడికల్ కాలేజీ లేని జిల్లాలను గుర్తించి, దశలవారీగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది.

57 ఏండ్లకు పెన్షన్ అమలు ప్రక్రియను ప్రారంభించండి: సీఎం ఆదేశం

వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. కుటుంబంలో ఒక్కరికే పింఛను పద్ధతిని కొనసాగిస్తూ భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

దోభీ ఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఫ్రీ కరెంటివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటూ పర్యవేక్షించాలని కలెక్టర్లను కేబినెట్ ఆదేశించింది.

దళిత బంధుపై కేబినెట్ సమావేశంలో చర్చ:

ఆగస్టు 16 నుండి ‘దళిత బంధు’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది.

దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది.
కేబినెట్ సమావేశంలో దళిత బంధు పథకం పూర్వాపరాలను సీఎం విశదీకరించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనీ, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయనీ ముఖ్యమంత్రి అన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…‘‘మిషన్ కాకతీయ పథకం అమలు ద్వారా చెరువుల కింద సాగు పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యి అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చింది. కరెంటు సరఫరాలో వచ్చిన గుణాత్మక మార్పు వల్ల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ రోజు రాష్ట్ర ఆదాయంలో 20 శాతం ఆదాయం వ్యవసాయరంగం నుంచే వస్తున్నది. ఇది తెలంగాణ చరిత్రలో మేలిమి మలుపు’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నదని, పల్లె ప్రగతి వల్ల మౌలిక వసతుల కల్పన జరిగి, గ్రామీణ జీవితం ఆహ్లాదంగా మారిందన్నారు. ఇందుకు పంచాయతీరాజ్ శాఖా మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనీయులని ముఖ్యమంత్రి అన్నారు.

సమైక్య రాష్ట్రంలో విచ్చిన్నమయిపోయిన వృత్తి పనుల వారి జీవితాలను నిలబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేపట్టిందని సీఎం అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రణాళికలు అమలు చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వృత్తి పనులు చేసుకునే వారి ఆదాయాలు మెరుగు పడెందుకు తోడ్పడ్డాయన్నారు. గొర్ల పంపిణీ గొల్ల కుర్మలకు లాభం చేకూర్చిందని, పశు సంపద పెరిగిందని, ముఖ్యంగా గొర్రెల సంఖ్య ఎక్కువున్న రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంటు వేదికగా స్వయంగా కేంద్రం ప్రకటించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇటీవల గొర్రెల యూనిట్ ధరను కూడా లక్షా ఇరవై ఐదు వేల నుంచి లక్షా డెబ్బై ఐదు వేలకు పెంచామని ముఖ్యమంత్రి అన్నారు.

చేపల పెంపకం ప్రోత్సహించడం వల్ల మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని సీఎం తెలిపారు. గీత కార్మికులకు చెట్ల పన్ను బకాయిలు రద్దు చేయటమే కాకుండా చెట్లకు పన్ను వేసే విధానాన్నే రద్దు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. నేత, మరమగ్గాల వారి ఆదాయాలు మెరుగు పడ్డాయి. నూలు రంగుల మీద సబ్సిడీతో పాటు బతుకమ్మ చీరల ఉత్పత్తి ద్వారా చేతినిండా పని దొరికేలా చేశామని ముఖ్యమంత్రి అన్నారు.

రైతుబీమా అమలవుతున్న విధంగా అంతే పకడ్బందీగా, క్రమబద్ధంగా నేత, గీత కార్మికులకు బీమా సదుపాయం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నేత, గీత కార్మికులు ఆశావహంగా బీమా సదుపాయం కోసం వేచి వున్నారని, సత్వరమే అమలు విధానం పై స్పష్టత తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు.

అదే దిశగా దళిత బంధు పథకం:

దళిత జాతి పేదరికం రూపుమాపాలని ప్రవేశపెడుతున్న ‘తెలంగాణ దళిత బంధు’ పథకానికి రాష్ట్ర కేబినెట్ ముక్త కంఠంతో ఆమోద ముద్ర వేసింది. దళిత జాతి కష్టాలు తీర్చడానికి ప్రవేశపెడుతున్న తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు సంబంధించి మంత్రివర్గ సభ్యులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకానికి చట్ట భద్రత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేబినెట్ అభిప్రాయపడింది. గతంలో ఎస్సి ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్ లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్ కు బదలాయించే విధానం తీసుకొచ్చామన్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అదే విధంగా దళిత బంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందని కేబినెట్ అభిప్రాయపడింది.

రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీన స్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగు భూమి కేవలం పదమూడు లక్షల ఏకరాలే అని దళితుల పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

దళితుల అభివృద్ధి, అరకొర సహాయాలతో సాధ్యం కాదని, అందుకే దళిత బంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి పదిలక్షల రూపాయల పెద్ద మొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదనీ ముఖ్యమంత్రి తెలియజేశారు. లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని దళిత బంధు పథకం ద్వారా కల్పించాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్చ లబ్ధిదారులదే అని, ప్రభుత్వం అధికారులు, దళిత బంధు స్వచ్చంద కార్యకర్తలూ ఈ దిశగా మార్గదర్శనం చేస్తారని, అవగాహన కల్పిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.

లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ అవగాహన కల్పించాలని క్యాబినెట్ అభిప్రాయపడ్డది. శిక్షణ, పర్యవేక్షణ కోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ‘‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. యూనిట్ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని యూనిట్ సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని కేబినెట్ తీర్మానించింది.

దళిత బంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని వివిధ శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ రామకృష్ణా రావును కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు ద్వారా ఎవరికైతే లబ్ధి చేకూరుస్తారో వారికి అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. ఈ కార్డు ఆన్లైన్ అనుసంధానం చేసి లబ్ధిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ దళిత వాడలకు ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.