యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రానికి తొలి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడం, రెస్పాన్స్ అదిరిపోయే విధంగా ఉండటంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని ఏరియాలో ఈ చిత్రం బాహుబలి రికార్డులను సైతం అధిగమించడం ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్చ పరుస్తోంది. తాజాగా ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం రూ. 100 కోట్ల (గ్రాస్) మార్కును అందుకుంది.

మొండికత్తి దెబ్బకు బాక్సాఫీసు బద్దలు
అరవింద సమేతలో వీర రాఘవరెడ్డి పాత్రలో ఎన్టీఆర్ మొండికత్తితో చేసే యుద్ధం సినిమా మొత్తానికి హైలెట్ అయింది. దీంతో పాటు మొండికత్తి కథతో సినిమాలో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు త్రివిక్రమ్. అలా ఎన్టీఆర్ కత్తి పవర్, త్రివిక్రమ్ పెన్ పవర్ వెరసి… సినిమా విడుదలైన 4వ రోజు రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.