శ్రీయాదాద్రి ప్రతినిధి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మీఅమ్మవారి ఊంజల్‌సేవను వైభవంగా నిర్వహించారు. పరమపవిత్రంగా భావించి వేలాదిమంది మహిళా భక్తులు ఊంజల్‌సేవలో పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త… తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే శ్రీలక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ నిత్యపూజలు జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు హరతి నివేదన జరిపారు. మహామండపంలో అష్టోత్తరం, అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. శివ సన్నిధిలో మహాశివుడిని ఆరాధిస్తూ అభిషేకం, అర్చన చేపట్టారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం పలు దఫాలుగా 516 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహించారు. ఉప ప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ అమ్మవారి ఊంజల్‌సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు గట్టు యాదగిరిస్వామి, ఆలయ పర్యవేక్షకులు సండ్ర మల్లేష్, వేదాంతం శ్రీకాంత్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానకు అన్ని విభాగాల ద్వారా రూ. 3, 30, 532 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
