స్వాతి నక్షత్రం:
ప్రతి నెలా స్వామి వారి జన్మ నక్షత్రం రోజున అష్టోత్తర శతఘటాభిషేకం ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతుంది. ఉదయం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు రూ. 351 చెల్లించాల్సి ఉంటుంది.
అమ్మవారికి ఊంజల్‌సేవ:
అమ్మవారికి ప్రతి శుక్రవారం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. దీనికి గాను రూ. 316 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ. 516 చెల్లించి సువర్ణ పుష్పార్చనలో పాల్గొనవచ్చు.
శ్రీనారసింహ జయంతి
స్వామి వారి జన్మదినమైన వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి చతుర్ధశి వరకు శ్రీనారసింహ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అలంకార సేవ, వాహన సేవల్లో శ్రీవారు తిరువీధుల్లో దర్శనమిస్తారు.
పవిత్రోత్సవాలు:
శ్రావణ శుద్ద దశమి మొదలు ద్వాదశి వరకు..ఆలయ పరిరక్షణ పవిత్రతకు పవిత్రోత్సవాలు జరుగుతాయి.
అధ్యయనోత్సవాలు
మార్గశిర శుద్ధ దశమి మొదలు పౌర్ణమి వరకు ఆరు రోజులు వైకుంఠ ద్వార దర్శనం, ద్రవిడ పారాయణం, అన్నకూటోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీరామనవమి వేడుకలు
యాదాద్రికొండపై గల రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలు మూడు రోజుల పాటు రమణీయంగా నిర్వహిస్తారు.
యాదాద్రిలో ఆంజనేయస్వామి వారికి పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
ఉగాది కవి సమ్మేళనం
తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా కొండపైన ఆస్థాన మండపంలో పంచాంగ శ్రవణం జరుపుతారు. ఈఓల ఇష్టాయిష్టాల బట్టి కవి సమ్మేళనం జరుపుతున్నారు.
శ్రీకృష్ణజయంతి:
శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుడు అవతరించిన రోజు. ఈ సందర్భంగా క్షేత్రంలో స్వామి వారిని శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఆరాధించి శ్రీ కృష్ణుడి బాల్యక్రీడ అయినట్లు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. రుక్మిణీ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ధనుర్మాసం:
ఆండాళ్ అమ్మవారు రచించిన తిరుప్పావై పాశురములను 30 రోజుల పాటు పఠించి అమ్మవారికి ఆస్థానం ఏర్పాటు చేసి ఆమె ప్రాభవాన్ని, పాశర ప్రభావాలను ప్రధానార్చకులు వివరిస్తారు. రోజుకు ఒక పాశురం చొప్పున 30 రోజుల పాశురముల వైభవాన్ని తెలియజేస్తూ ధనుర్మాసాన్ని జరుపుతారు.
శ్రీవారి ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం..
శ్రీ స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున…మూలవర్యులకు 108 కలశాలతో ఆయా దేవతలను ఆవాహన చేసి సుగంధ ద్రవ్యాలతో అర్చిస్తారు. లోక కల్యాణం కోసం అభిషేక మహోత్సవాన్ని పంచామృతాలతో వైదిక మంత్ర సూక్తములతో ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాల్గొంటే గ్రహబాధలు తొలిగి కోరికలు నెరవేరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఆండాళ్ అమ్మవారి నిజాభిషేకం
శ్రీవారి సన్నధిలోని ఆండాళ్ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో, పంచసూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు తమ సౌభాగ్య, సంపదలను పెంచుకోవడానికి ఈ అభిషేకాలు ఎంతో దోహదపడుతాయి.
శ్రీ ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ
ప్రతి మంగళవారం 11 వేల తమలపాకులతో అర్చన నిర్వహిస్తారు. ఆంజనేయస్వామికి తమలపాకులంటే ఎనలేని మక్కువ. మన్యుసూక్తంతో 14 సార్లు పారాయణం చేసి సింధూరాన్ని అలంకరణ చేసి పూజిస్తారు. ఆకు పూజ చేయించడానికి రూ. 216 చెల్లించాలి.
అమ్మవారికి కుంకుమార్చన
ఆ బాల గోపాలానికి సౌభాగ్యమును, దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధింపజేసేందుకు అమ్మవారికి వెయ్యి నాణేములతో పాదముల వద్ద కుంకుమ సమర్పించి పూజిస్తారు. ఈ పూజ చేయించిన వారికి మంగళములు కలుగునని ప్రతీతి.