యాదాద్రిలో 108 అడుగుల పొడవు మ‌హామండపం

0
120

శ్రీ‌యాదాద్రి ప్ర‌తినిధి :
ముఖమండ‌పానికి ఎదురుగా 108 అడుగుల పొడవున మ‌హా మండ‌పం నిర్మిస్తున్నారు. ఇంత విశాల‌మైన ముఖ మండ‌పం మ‌రే ఆల‌యంలోనూ లేదు. 36 అడుగుల ఎత్తున నిర్మించే ఈ మండ‌పంలోని కింది అంత‌స్తులోని స్తంభాల వ‌ద్ద ఆళ్వారు విగ్ర‌హాలు ప్ర‌తిష్టిస్తారు. పై అంత‌స్తులో కాక‌తీయ శైలి స్తంభాలుంటాయి. మ‌హామండ‌పంలోని 12 స్థంబాల్లో 12 మంది ఆళ్వారులు కొలువుదీరి ఉంటారు. ఆళ్వారులు శ్రీ‌వైష్ణ‌వ సంప్ర‌దాయంలో విశిష్ట‌మైన స్థానం క‌లిగిన భ‌క్తులు. త‌మ పాశురాల‌తో విష్ణువును కీర్తించి, ద‌క్షిణాదిన భ‌క్తి సంప్ర‌దాయాన్ని విస్త‌రించారు. వైష్ణ‌వ సంప్ర‌దాయంలోని 12 మంది ఆళ్వారుల్లో అంద‌రూ ఒకే ఆల‌యంలో ఉండ‌డం యాదాద్రి ఆల‌య విశేషం. ఎక్క‌డ ఆళ్వారులుండి, స్వామికి మంగ‌ళాస్వాస‌నం చేస్తున్నారో దానిని దివ్య‌క్షేత్రం అంటారు. ఆ ప్ర‌కారం రేప‌టి యాదాద్రి న‌ర‌సింహ క్షేత్రం మ‌హాదివ్య క్షేత్రంగా వెలుగొంద‌నున్న‌ది. ఆల‌యాన్ని చాళుక్య‌శైలిలొ నిర్మిస్తున్నా ఈ ఆళ్వారు మండ‌పంలోనే కాక‌తీయులు ఆద‌రించిన శైలిలో స్థంభాల‌ను నిర్మిస్తున్నారు. ఈ మొద‌టి అంతస్తును ఆకుపూజ నిర్వ‌హ‌ణ‌కు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తారు.

దైవ ద‌ర్శ‌నం
గ‌ర్భ‌గుడికి ప‌శ్చిమాన రెండో ప్రాకారంలో వున్న రాజ‌గోపురం గుండా భ‌క్తులు మాఢ‌వీధి కంటే గ‌ర్భ‌గుడి, మ‌హా మండ‌పం (ఆళ్వారు మండ‌పం) దిగువ‌గా ఉంటాయి. ముఖ‌మండ‌పం నుంచి గుహాల‌యంలో వున్న మూల‌విరాట్టు శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకుంటారు. అక్క‌డి నుంచి ఆళ్వారు మండపంలోకి ప్ర‌వేశిస్తారు. ఈ ఆళ్వారు మండ‌పంలో ఆకుపూజ చేసిన త‌ర్వాత మ‌హా రాజ‌గోపురం గుండా ప్ర‌ధాన ఆల‌యం నుంచి బ‌య‌టికి వ‌స్తారు. రాజ‌గోపురాలు ఇరువైపులా ఉన్న మండ‌పాల్లో వ్ర‌తాలు జ‌రుపుకోవ‌చ్చు. ప్ర‌సాదం కాంప్లెక్స్‌లో పులిహోర‌, ల‌డ్డూ ఇస్తారు. స‌మీపంలోనే 360 శ్రీ‌వారి మెట్లు ఉంటాయి. ఈ మెట్ల వ‌రుస‌కు స‌మాంత‌రంగా వ్యాపార స‌ముదాయాలుంటాయి. ఈ శ్రీ‌వారి మెట్ల‌ను అనుస‌రిస్తూ ముందుకు సాగితే శివాల‌యాన్ని చేరుకోవ‌చ్చు. శివుడి ద‌ర్శ‌నానంత‌రం భ‌క్తులు ఇక్క‌డుండే ఆహ్లాద‌క‌ర‌మైన ప‌రిస‌రాల మ‌ధ్య ఆధ్యాత్మిక చింత‌న‌తో గ‌డుప‌వ‌చ్చు. భ‌క్తుల‌ను ఇక్క‌డి నుంచి మ‌ళ్లీ వైటీడీఏ వాహ‌నాల్లో గుట్ట కిందికి తీసుకుపోతారు.

ఆల‌య ప‌ట్ట‌ణం
యాదాద్రికి ఆల‌యాన్ని ఎంత ఘ‌నంగా చేప‌ట్టారో..యాదాద్రి ఆల‌య నిర్వ‌హ‌ణ‌, ప‌ట్ట‌ణ ఆధునీక‌ర‌ణ‌ను కూడా అంతే అద్భుతంగా వైటీడీఏ చేప‌ట్టింది. యాదాద్రి ఆల‌య ప‌ట్ట‌ణ నిర్మాణం కోసం 2 వేల ఎక‌రాల భూమిని సేక‌రించారు. 800 ఎక‌రాల్లో ఆల‌య ప‌ట్ట‌ణ నిర్మాణం చేప‌ట్టాల‌ని వైటీడీఏ నిర్ణ‌యించింది. ఈ ఆల‌య ప‌ట్ట‌ణానికి కావాల్సిన మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ముఖ్య‌మంత్రి ఆదేశాల‌తో ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయి. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంలో భాగంగా యాదాద్రి ఆల‌యానికి స‌మీపంలో 10 ల‌క్ష‌ల లీట‌ర్ల నీటి నిల్వ సామ‌ర్థ్యంతో సంపు నిర్మించారు. యాదాద్రి ప‌ట్ట‌ణం చుట్టూ వాహ‌నాల ర‌ద్దీకి అనుగుణంగా రూ. 140 కోట్ల‌తో రింగ్‌రోడ్డు నిర్మాణం మొద‌లుపెడుతున్నారు. భ‌క్తులు గిరి ప్ర‌ద‌క్షిణ చేసేందుకు గుట్ట చుట్టూ రోడ్డు ఇరువైపులా అంద‌మైన శిల్పాలంక‌ర‌ణ‌లు, ఆహ్లాద‌క‌ర‌మైన చెట్ల‌తో వ‌స‌తులు క‌ల్పిస్తున్నారు. గుట్ట కింద భ‌క్తుల కోసం అన్న‌దానం నిర్వ‌హించే స‌త్రాలు, క‌ల్యాణ‌క‌ట్ట‌, మ‌హా పుష్క‌రిణి, క్యూ కాంప్లెక్స్‌, బ‌స్ బే, పార్కింగ్ ఏరియా, ఏసీ చిల్లింగ్ యూనిట్‌, వాట‌ర్ రీసైక్లింగ్ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ మొత్తం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 800 కోట్లు కేటాయించింది. ఇప్ప‌టివ‌ర‌కు గుట్ట విస్త‌ర‌ణ‌, అభివృద్ధి రూ. 400 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. 800 ఎక‌రాల్లో ప్ర‌తిపాదిత ఆల‌య ప‌ట్ట‌ణంలో భాగంగా తొలి విడ‌త‌గా 250 ఎక‌రాల్లో భ‌వ‌నాలు నిర్మిస్తారు. ఇందుకు కావాల్సిన లే అవుట్‌ను వైటీడీఏ విడుద‌ల చేసింది. ఈ అవుట్‌లో అన్ని భ‌వ‌నాల‌ను అన్ని భ‌వ‌నాల‌ను దాత‌ల ఆర్థిక స‌హాయంతోనే నిర్మిస్తారు. వైటీడీఏ రూపొందించిన డిజైన్ల‌కు అనుగుణంగా దాత‌లు ఇక్క‌డ స‌త్రాల‌ను నిర్మించ‌వ‌చ్చు. ఆ స‌త్రాన్ని దాత‌ల కుటుంబ స‌భ్యులు, వారు సూచించిన వ్య‌క్తులు ఏడాదిలో కొద్దిరోజులు ఉచితంగా ఉప‌యోగించుకోవ‌చ్చు.