శ్రీయాదాద్రి ప్రతినిధి : తెలంగాణ ఎదపై మహా శివాలయం వెలుస్తున్నది. ఆగమ సంప్రదాయాలకు ఆలవాలమైజ.. శిల్పశాస్త్ర వైభవానికి పర్యాయమై.. వెయ్యేండ్ల చరిత్ర చూడని అద్భుతం.. తెలంగాణ తల్లి మెడలో సాలహారమవుతున్నది. కేసీఆర్ స్వప్నం ఫలించి.. యాదాద్రిగుట్టపై మహా దివ్యక్షేత్రంగా ఆవిర్భవిస్తున్నది. హైందవ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన శిలాలయమై శిభిల్లుతున్నది! ఇదిగో ఆ యాదాద్రి.. యాదరుషి తపోభూమి! ప్రాచీన ఆలయాలకు నెలవు తెలంగాణ. వాటి గతమెంతో ఘనకీర్తి. శిథిలాలుగా మిగిలి వెలవెలబోతున్న ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్దరణతో స్వరాష్ట్రం ఆలయాలకు స్వర్ణయుగాన్ని తెస్తున్నది. యాదమహర్షి దీక్షకు మెచ్చి స్వయంభువుగా వెలసిన నరసింహుడితో పావనమైన యాదాద్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కార్యదక్షతతో హైందవ ప్రపంచంలోనే అరుదైన క్షేత్రంగా నిలువనున్నది. యాదాద్రి దివ్యక్షేత్రం భారతీయ ఆలయ వాస్తు శిల్పానికి దర్బణంగా, మన పాలకుల దక్షతకు నిదర్శనంగా నిలువనున్నది. నఃభూతో నఃభవిష్యత్ అన్నట్లుగా నిర్మిస్తున్న యాదాద్రి తెలంగాణకే కాదు, భారతీయ వాస్తు, శిల్ప కళకే తలమానికం. ఒక్కమాటలో చెప్పాలంటే యాదాద్రిలో నిర్మితమవుతున్న శ్రీలక్ష్మీనరసింహ, శివాలయ ప్రాంగణాలు ఆగమశిల్ప శాస్త్రం అనడంలో అతిశయోక్తి లేదు. దక్షిణాత్య ఆలయశిల్ప సంప్రదాయంతో ప్రపంచంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నిలిచేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. కొండకు ధీటైన కాంక్రీటు కొండను నిలిపి, కఠినమైన కృష్ణ రాతిని తొలిచి, ఆలయ శిల్పానికి అందాన్నిచ్చిన మహా శిల్పుల నిర్మాణాల్లోని విశిష్టతలను ఎంచి, అకుంఠిత దీక్షతో నిర్మిస్తున్నీ మహా నిర్మాణం ఆధునిక చరిత్రలోనే అద్భుతం. ఇటీవలి వేయ్యెండ్ల ప్రపంచ చరిత్రలో కఠిన శిలతో ఇంతటి ఘనమైన ఆలయాన్ని నిర్మించిన ఘనుడు లేడు. అధిష్టానం నుంచి విమాన శిఖరాగ్రాల వరకు రాతితోనే మహా నిర్మాణాలను చేపట్టిన హైందవ ఆలయమూ లేదు. ప్రపం,చ నిర్మాణ శాస్త్రమే ఔరా అని మెచ్చే తురుపుముక్క యాదాద్రి ఆలయం. పాలకుల మార్గదర్శకత్వంలో భాగమైన అధికారులు కార్యదక్షత, ఇంజనీర్ల సామర్థ్యం, స్థపతుల ఘనకార్యం, శిల్పుల నైపుణ్యం, యాదాద్రి ప్రజల ఔదార్యంతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయం తెలంగాణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి! శిల్పులు ఉలులను కాచుకుంటూ సుందర శిల్పాలుగా రూపుదాల్చిన శిలలన్నీ ఒక్కొక్కటిగా గుట్టపై చేరుతూ రేపటి సంభ్రమాన్ని కళ్లకు కడుతున్నాయి! రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ఆలయాల పూర్వ వైభవాన్ని ఆవిష్కరించేందుకు ఓ ప్రణాళికబద్ధమైన కార్యచరణ మొగ్గ తొడిగింది. ఆ కార్యచరణలోని తొలిమెట్టు యాదాద్రి. ఈ ఆలయ నిర్మాణంతో పాటు ఆలయ నగర నిర్మాణంతో ఆధ్యాత్మిక క్షేత్రంగా మలచేందుకు వసతులతో పాటు, పట్టణాన్ని పర్యాటకకేంద్రంగా మలిచేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఆధ్యాత్మికతకు రాజధానిలా రూపొందుతున్న యాదాద్రి ఆలయ పట్టణం అభివృద్ధి ప్రణాళిక పేరు యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ విశ్రాంత ఐఏఎస్ అధికారి కిషన్‌రావు సారథ్యంలో అందమైన ఆలయ పట్టణ నిర్మాణానికి అంకురార్పణ చేశారు.
ఆధునిక కాలంలో అలనాటి ఆలయాలకు ధీటుగా…
ఆధునిక కాలంలో అలనాటి ఆలయాలకు ధీటుగా రాతి స్తంభాలతో విశాలమైన ఆలయ ప్రాంగణాలు, ఎత్తయిన గోపురాలు నిర్మించడం సాధ్యమా ? అని ప్రశ్నించిన గొంతులే ఆకాశం వైపు తలెత్తి చూస్తున్న అందమైన శిలలను చూసి ఔరా అంటున్నాయి. ఆధునిక నిర్మాణ రంగంలో అద్భుతంగా నిలిచే ఈ కట్టడం కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి అందమైన శిల్పాకృతులతో ఆలయాన్ని ఊహిస్తుంటే, ఆ సృజనకు తగినట్లుగా ఆలయ వాస్తును మధుసూధన్ నిర్దేశిస్తున్నారు. స్తపతి సుందరరాజన్ శిల్పులకు సొబగులద్దే కార్యానికి మార్గదర్శనం చేస్తూ కార్యశాలలో ఉలులకు నాయకత్వం వహిస్తున్నారు. అయిదు వందల మంది శిల్పులు అహర్నిశలూ శ్రమిస్తూ శిలలకు సూక్ష్మమైన అందాలద్దుతున్నారు. గండశిలలను సుందర శిల్పాలుగా చెక్కి యాదాద్రిగుట్టపై ఆలయ శిఖరాలు నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామికి, పరమశివుడికి నిర్మిస్తున్న ఈ ఆలయ ప్రాంగణాల్లో వింతలు, విశేషాలెన్నో! ఈ ఆలయ నిర్మాణం కోసం మన ఇంజనీర్లు యాదాద్రిగుట్టనే విస్తరించారు. రిటెయినింగ్ వాల్‌ను నిర్మించి గర్భగుడికి ఒక దిక్కును విశాలమైన స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారు. విశాలమైన ఆలయ ప్రాకారాల నిర్మాణానికి దారులేశారు. ఇది మన ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం. ఈ విస్తరణలతో గుట్టపైన ఆలయ నిర్మాణానికి 14.5 ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు నరసింహస్వామి గర్భాలయం, ముఖమండపం ఆర ఎకరం స్థలంలోనే ఉండేవి. ఇప్పుడు 4.35 ఎకరాలకు ఆలయ ప్రాంగణం విస్తరిస్తుంది.