అలంకార ప్రియుడైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న అలంకార సేవలో భక్తులు పాల్గొని తరిస్తారు. కలియుగ వేంకటేశ్వరుడి అలంకారంతో మొదలయ్యే అలంకార సేవలు యాదాద్రికొండపై కోలాహలంగా సాగుతాయి. శ్రీవారిని దశావతారంలో పెళ్లి కొడుకును చేయడం అలంకార సేవల ప్రత్యేకత. ఉదయం 11 గంటలకు మొదలయ్యే సేవ తిరువీధుల్లో వేలాది మంది భక్తులు దర్శించుకుంటుండగా రుత్వీకులు వేదమంత్రాలను పఠిస్తూ ఉత్సాహంగా సాగుతారు. ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్య, చింతపట్ల రంగాచార్య, మోహనాచార్యులు, యాజ్ఞీకులు శ్రీవారి విశేషాలను వివరిస్తారు. వేంకటపతి, జగన్మోహిని, శ్రీకృష్ణుడు, వటపత్రశాయి, గోవర్థనగిరిధారి, శ్రీరాముడి తదితర అవతారాలతో శ్రీవారిని అలంకరిస్తారు. అలంకారమూర్తులను ఆలయ పరిసరాలలో ఊరేగించి, భక్తుల కోసం దర్శన సదుపాయాలు కల్పిస్తారు. ఆరు రోజుల పాటు అలంకారాలు నిర్వహించిన అనంతరం వెండి గరుడ వాహనంపై శ్రీలక్ష్మీనరసింహస్వామిని అలంకరించి ఊరేగిస్తారు. ఇదే వాహనంపై కల్యాణ మహోత్సవానికి తీసుకొస్తారు. మధ్యాహ్న సమయంలో అలంకార కైంకర్యాలు, రాత్రుళ్లు వివిధ వాహనాలపై సేవ నిర్వహిస్తారు. వరుసగా శేషుడిపై, హంస, పొన్నవాహనం, సింహ వాహనం, అశ్వ వాహనాలపై రాత్రి సమయాలలో విహారయాత్రలు జరుపుతారు. ప్రతినిత్యం ఒక్కోతీరులో జరిగే ఈ కైంకర్యాలతో ఉత్సవాలు ఆలయ పరిసరాలలో సంతరించుకుంటాయి. నిత్యకల్యాణం పచ్చతోరణంగా మారి భక్తులకెంతో ఆహ్లాదం కలిగిస్తాయి. శ్రీవారి కల్యాణమహోత్సవం సందర్భంగా పది అవతారాలు ఉదయం పూట తిరువీధుల్లో ఊరేగించడం విశేషం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఆయా కాలాలలో భక్తులను రక్షించేందుకు అవతరించిన విశేషాలను పెళ్లి కొడుకైన నరసింహుడి రూపంలో అలంకారాలు చేస్తారు.