10 నుంచి దేవి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం
శ్రీయాదాద్రి ప్రతినిధి : దేవి నవరాత్రుల కోలాహలం బుధవారం నుంచి మొదలు కానుంది. అమ్మవారిని ప్రతిష్టించి పూజలు నిర్వహించేందుకు మండపాలు సిద్ధమయ్యాయి. భక్తులు పోటిపడి నవరాత్రులను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారు సరస్వతి దేవీగా, శ్రీమహాలక్ష్మీగా, బాలాత్రిపుర సుందరీదేవీగా, గాయత్రీదేవీగా, లలితాత్రిపుర సుందరిగా, మహంకాళిగా, అన్నపూర్ణగా, కామాక్షిగా, మహిషాసురవర్థిణి ఇలా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో పూజలు అందుకుంటారు.
పరమపావని ఆనంద ప్రదాయిని
పరమపావని ఆనంద ప్రదాయిని.. తేజస్వరూపిణి సౌజన్యమూర్తి అయిన జగన్మాతను తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. దుష్టసంహారిణి, శిష్ట సంరక్షిణి భక్తులకు కొంగు బంగారమైన త్రిశక్తి మాత పాదారవిందాలను ఆశ్రయిస్తే చాలు ఆజ్ఞానం తొలగిపోయి జ్ఞానం సిద్ధిస్తొంది. విశ్వమంతా ఆదిపరాశక్తిగా ఆధారపడి ఉందని నిరూపించే త్రిశక్తి మాత తన కనుసన్నలతోనే లోకాలన్నింటిని పాలిస్తుందని జ్ఞానోదయం కలిగిస్తుంది. దసరాకు ముందు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ తెలంగాణలోనే ఎంతో ప్రజాధరణ పొందినది. ఈ పండుగను పరుస్కరించుకుని నిర్వహించే దేవీ నవరాత్రులు భక్తుల పాలిట కొంగు బంగారం. ఒకవైపు గౌరీ మాతగా పూజలందుకుంటూ.. బతుకమ్మ కోలాహలం ఒకవైపు..మరోవైపు చల్లని తల్లిని కొలిచే అపురూప ఘడియలు మరోవైపు..తొమ్మిది రోజులు నిష్టతో పూజలు చేసి అమ్మ కరుణ పొందేందుకు తపనపడటం ఆనవాయితీగా వస్తోంది. వేల ఏళ్ల నుంచి సృష్టి మొత్తం అమ్మపాలనలోనే ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే తల్లిని కొలుచుకోవడం ద్వారా భక్తిని, శక్తిని, ముక్తిని పొందవచ్చని భక్తుల నమ్మకం. యాదాద్రికొండపై గల పర్వత వర్థనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల వైభవాన్ని శివాలయం ప్రధానార్చకులు భక్తులకు వివరిస్తారు.

త్రిశక్తిగా అమ్మవారు
మరోవైపు త్రిశక్తిగా అమ్మవారు నవరాత్రుల ద్వారా పూజలందుకుంటారు. నవరాత్రులలో అమ్మవారు చాలా ప్రసన్నురాలై భక్తులను అనుగ్రహిస్తోంది. కాబట్టే జగన్మాతకు విశ్వమెళ్ల దాసోహమై నిరాజనాలు పలుకుతారు. విజయదశమికి సంబంధించిన అనేక ఆసక్తిదాయకమైన విషయాలు పురాణాల ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. రాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు చేరింది.. అర్జునుడు ఉత్తమ గోగ్రహణ యుద్ధానికి సిద్ధమైంది, రఘు మహారాజు స్వర్గం మీద యుద్ధానికి సిద్ధం కాగా కుభేరుడు కనకవర్షం కురిపించింది. శివాజీ శత్రు సేనలను చీల్చి చెండడానికి సిద్ధమైంది అమ్మవారి కృపతోనే విజయం సాధించామని భక్తితో అమ్మకు పూజలు చేశారని చరిత్ర చెబుతోంది. దీనిలో ఆయుధపూజ అతి ముఖ్యమైనది. ఆయా వృత్తుల్లో ఉన్నవారు తమ పనిముట్లను ఒక దగ్గర చేర్చి దుర్గాదేవికి పూజ చేస్తారు. ఏడాదంతా శుభం కలగాలని కోరుకుంటారు.

విజయదశమితో ముగింపు
పూర్వకాలంలో రాజులు దండయాత్రలను విజయదశమి రోజు నుంచి ప్రారంభించే వారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. దసరా పండుగను క్షత్రియ పండుగ అని వ్యవహరిస్తారు. నాడు ఈరోజుకు ముందే రాజులు ఆయుధ పూజలు నిర్వహించి విజయదశమి రోజూ యుద్ధానికి సన్నద్ధమై వెళ్లేవారు. శమి శమీయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారి.. రామస్య ప్రియదర్శనం.. అని శమీ వృక్షానికి పూజలు చేయడం ఆనవాయితీ. పాపాలను శమింపచేసి శత్రువు వినాశనంగా గావించేది శమీ వృక్షం. అర్జునుడు మారువేశం (పేడి) వదిలి ఈ వృక్షానికి పూజలు నిర్వహించి తిరిగి గాండీవరని చేపట్టాడని, రాముడు రావణుడిని సంహరించి శమీ వృక్షానికి పూజలు చేసి తిరిగి అయోధ్యకు పయనమయ్యాడని అందుకే వృక్షం అత్యంత పవిత్రమైందని, శమీ పూజ విజయానికి సంకేతమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా విజయదశమితో నవరాత్రుల కోలాహలం ముగుస్తోంది.