వేములకొండపైన భక్తుల సందడి
శ్రీయాదాద్రి ప్రతినిధి :
చేప ఆకారంలో గుట్ట
మత్స్యగిరి సమీపంలో ఉన్న పొట్టిగుట్ట వద్ద నుండి వెళ్తే ఆ గుట్ట చేప ఆకారంలో కనిపిస్తుంది. ఈ దేవాలయం గట్టుపైకి వేములకొండ నుండి సగం వరకు ఎక్కగానే ఒక శిలాద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారబంధనానికి చేపశిల్పం చెక్కబడి ఉంటుంది.
1991లో శ్రీలక్ష్మీనరసింహుని ఆలయ నిర్మాణం
శ్రీమత్స్యగిరిపై 1991 సంవత్సరంలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆలయ నిర్మాణం చేశారు. ఈ ఆలయం కోనేరును ఆనుకొని నిర్మాణం చేశారు. ఈ దేవాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉపాలయాలుగా శ్రీ ఆంజనేయస్వాయస్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి, గట్టు కింద గల వెంకటాపురం గ్రామంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ఉన్నాయి.
శ్రీ స్వామి వారి పాదాలు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత శ్రీ స్వామి వారి పాదములతో ఆశీర్వచనం చేసినచో భక్తుల సకల పాపాలు తొలగిపోయి వారి ఆరోగ్యాలు కుదుటపడుతాయని భక్తుల నమ్మకం.
శ్రీ స్వామి వారి పుష్కరిణి
శ్రీ స్వామి వారు సాలగ్రామ రూపంలో వెలసి ఉన్నాడు. ఆ ఆకారమునకు నరసింహ ముఖంతో స్వయంభువై వెలిసి ఉన్నాడు. అట్టి స్వామి వారి సన్నిధి నుండి జలగా ప్రవహిస్తున్న నీటితో పుష్కరిణి (కోనేరు)గా ఏర్పడింది. ఇది మూడు భాగాలుగా ఉండడం వల్ల సృష్టి, స్థితి, లయగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మరియు లక్ష్మీ, పార్వతీ, సరస్వతుల త్రినేత్రముగా భావింపబడి ఇట్టి పుష్కరిణిలో ఎప్పుడు నిండా నీటితో కళకళలాడుతూ భక్తులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇట్టి పుష్కరిణిలో శ్రీ స్వామి వారి రూపంలో నామాలతో చేపలు భక్తులందరికి దర్శనమిస్తున్నాయి.
శ్రీ ఆంజనేయస్వామి ఆలయం
ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ ఆంజనేయస్వామి వారు కొలువై ఉన్నారు. శ్రీ ఆంజనేయస్వామి వారికి ఆలయ నిర్మాణం చేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించిన అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారిని భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.